సీఆర్డీఏ పరిధి నుంచి జగ్గయ్యపేటను తొలగించాలి

ABN , First Publish Date - 2022-08-31T06:34:45+05:30 IST

సీఆర్డీఏ పరిధి నుంచి జగ్గయ్యపేటను తొలగించాలి

సీఆర్డీఏ పరిధి నుంచి జగ్గయ్యపేటను తొలగించాలి
సమావేశంలో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం

టీడీ పీ అభ్యంతరాల మధ్య కౌన్సిల్‌ తీర్మానం

డిసెంటు ఇస్తామన్న టీడీపీ కౌన్సిలర్లు 

శానిటేషన్‌పై స్వపక్ష, విపక్ష సభ్యుల ఆగ్రహం


 జగ్గయ్యపేట, ఆగస్టు 30 : తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ల నిరసనల మధ్య రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) పరిధి నుంచి పురపాలక సంఘంను తొలగించాలని జగ్గయ్యపేట కౌన్సిల్‌ సమావేశం తీర్మా నించింది. మునిసిపల్‌ చైర్మన్‌ రంగాపురం రాఘ వేంద్ర అధ్యక్షతన జరిగిన కౌన్సిల్‌ సాధారణ సమా వేశంలో అజెండాలో ఈ అంశం ప్రస్తావనకు రాగా వైసీపీ కౌన్సిలర్‌ సామినేని వెంకట కృష్ణప్రసాద్‌ పురపాలక సంఘం సీఆర్డీఏ పరిధిలో ఉండటం వల్ల ప్రయోజనం లేదని, ఎలాంటి నిధులు రావటం లేదని, పైగా ఫ్యాక్టరీలు, ఇతర నిర్మాణాల అనుమతి క్లిష్టతరంగా మారి అభివృద్ధి కుంటుపడుతుందని మద్దతు పలకగా, టీడీపీ కౌన్సిలర్లు కన్నెబోయిన రామలక్ష్మి, పేరం సైదేశ్వరావు, నకిరికంటి వెంకటిలు అభ్యంతరం తెలిపారు. అమరావతి రాజధానిని మూడు రాజధానులుగా ఏర్పాటు చేస్తామని ఒక్క రాజధానిని కూడా అభివృద్ధి చేయలేదని, అమరావ తిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా చేయాలని కౌన్సిల్‌ తీర్మానం చేయాలని వాదించారు. టీడీపీ సభ్యురాలు రామలక్ష్మి ఈ నిర్ణయంపై డిసెంట్‌ ఇస్తామన్నారు.

శానిటేషన్‌పై రచ్చ..రచ్చ..

పట్టణంలో పారిశుధ్యంపై చైర్మన్‌ రాఘవేంద్ర, వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌లతో పాటు పాలక, ప్రతిపక్ష సభ్యులు తీవ్ర  అసంతృప్తి వ్యక్తం చేశారు. 140 మంది సిబ్బంది ఉన్నా పట్టణంలో పారిశుధ్యాన్ని సక్రమంగా నిర్వహించ లేకపోతున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  జీతం తీసుకుంటున్న ఉద్యోగులు పనిచేయటం లేదని, ఆ పని కూడా ప్రజా ప్రతి నిధులే చేయాలా అని ప్రశ్నించారు.  పారిశుధ్యం మెరుగుపడేందుకు తామేవ్వరం జోక్యం చేసుకోబోమని చైర్మన్‌ రాఘవేంద్ర, కౌన్సిలర్ల అందరి  తరఫున అధికారులకు హామీ ఇచ్చారు.

చేతకాదంటే.. మేమే చెత్త ఎత్తుతాం 

కౌన్సిల్‌ ఏర్పడి పది నెలలైనా వార్డుల్లో పారిశుధ్యం మెరుగు పడటం లేదని, వార్డుల్లోకి వెళ్లాలంటే భయపడాల్సి వస్తుందని టీడీపీ కౌన్సిలర్‌ పేరం ఆరోపిస్తూ మీకు చేతకాదని చెబితే మేమే చెత్త తొలగిస్తామని వ్యాఖ్యానించారు.  

ఎర్రకాల్వ సమస్య పరిష్కరించాలి 

ఎర్రకాల్వ సమస్యపై కౌన్సిల్‌ ఏర్పడినప్పటి నుంచి చెబుతానన్న సమస్య పరిష్కారం కాలేదని వచ్చే సమావేశంలోపు పరిష్కారం కాకుంటే తాను తీవ్రమైన నిర్ణయం తీసుకుంటానని వైసీపీ కౌన్సిలర్‌ పందుల రోశయ్య  సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ కౌన్సిలర్‌ గీతారాణి ఇదే  అంశాన్ని ప్రస్తావించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చైర్మన్‌ రాఘవేంద్ర అధికారులను ఆదేశించి సభ్యులను శాంతింపజేశారు. 

Updated Date - 2022-08-31T06:34:45+05:30 IST