‘పథకం’ ప్రకారం..

ABN , First Publish Date - 2022-10-01T05:26:56+05:30 IST

‘పథకం’ ప్రకారం..

‘పథకం’ ప్రకారం..

ఒక్కో సంక్షేమ పథకానికి ఒక్కో రేటు

గిలకలదిండిలో చోటా ప్రజాప్రతినిధి అక్రమాలు

దరఖాస్తు పెట్టినప్పుడే రేటు నిర్ణయం

లబ్ధి పొందాక అనుచరులను పంపి వసూళ్లు

వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారుల నుంచి వెయ్యి చొప్పున..

కొత్త లబ్ధిదారైతే రూ.6 వేలు సమర్పించాల్సిందే..

గతంలో ఇళ్ల స్థలాల పేరుతోనూ ఇదే పంథా


ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఒక్క రూపాయి లంచం లేకుండా, నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని పాలకులు గొప్పలు చెబుతున్నారు. ఇదంతా ఉత్త ప్రకటనేనని మచిలీపట్నానికి కూతవేటు దూరంలో ఉన్న గిలకలదిండి స్థానిక చోటా ప్రజాప్రతినిధి ఒకరు తన చేష్టల ద్వారా నిరూపిస్తున్నాడు. ‘ప్రభుత్వ పెద్దలు అలానే చెబుతారు, నాకు బోలెడన్ని ఖర్చులున్నాయి, లబ్ధిదారులుగా ఎంపికయ్యే సమయంలో ఇవ్వనవసరం లేదు. ప్రభుత్వం నుంచి ఆర్థిక లబ్ధి పొందాక మామూళ్లు ఇవ్వాల్సిందే’నని పట్టుబడుతున్నాడు.


ఆంరఽధజ్యోతి-మచిలీపట్నం ‘వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా వచ్చిన నగదులో నా వాటాగా ఒక్కొక్కరూ వెయ్యి రూపాయలు తెచ్చి ఇవ్వండి, ఇప్పుడు ఇవ్వకపోతే వచ్చే ఏడాది మీ పేర్లు మాయం కావచ్చు, లేదా ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్లు తప్పు పడవచ్చు, తప్పులు దొర్లితే వచ్చే ఏడాది మీకు నగదు జమ కాదు.’ అధికార పార్టీకి చెందిన ఓ చోటా ప్రజాప్రతినిధి బెదిరింపులివి. దీంతో ఎందుకొచ్చిన గొడవని మహిళలు ఇష్టం లేకున్నా వెయ్యి రూపాయలను సదరు ప్రజాప్రతినిధికి ముట్టజెబుతున్నారు. ప్రస్తుతం ఈ అక్రమ వసూళ్లపర్వం గిలకలదిండితో పాటు మచిలీపట్నంలో, అధికార పార్టీ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. సదరు నాయకుడి వైఖరిని అందరూ తప్పుబడుతున్నారు.

350 మందికిపైగా లబ్ధిదారులు

గిలకలదిండిలో 45 ఏళ్లు నిండిన 350 మంది మహిళలకు వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యింది. ఇంకేముంది అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు రంగంలోకి దిగిపోయాడు. వారందరినీ అర్హుల జాబితాలో చేర్పించానని, ఇందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని బేరాలు మొదలుపెట్టాడు. ఒక్కో మహిళకు రూ.18,750 జమ అయ్యింది కదా, మీరంతా నా వాటాగా వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నాడు. తన అనుచరుల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు కబురు పంపి నగదు తెచ్చి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నాడు. నూతనంగా ఎంపికైన లబ్ధిదారులైతే ఒక్కొక్కరూ రూ.6 వేల చొప్పున ఇవ్వాల్సిందేనని రేటు నిర్ణయించి మరీ వసూలు చేయడం గమనించిదగ్గ అంశం.

మహిళా ఉద్యోగులపై వేధింపులు

గిలకలదిండి డివిజన్‌ సచివాలయంలో పనిచేస్తున్న వలంటీర్లు, ఉద్యోగినుల పట్ల ఈ చోటా ప్రజాప్రతినిధి వివిధ రూపాల్లో వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో కొందరు మహిళా ఉద్యోగులు మాజీ మంత్రి పేర్ని నానీకి ఫిర్యాదు చేశారు. వివరాలు రాబట్టిన ఆయన సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, వలంటీర్ల పట్ల కార్పొరేటర్లు మర్యాదగా ప్రవ ర్తించాలని, లేకుంటే ఇబ్బందులు పడతారని ఇటీవల హెచ్చరించారు.

ఇళ్ల స్థలాలకు కూడా..

గిలకలదిండిలో 900 మందికిపైగా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల కోసం లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ విషయంలోనూ ఒక్కో లబ్ధిదారు నుంచి రూ.5 వేల చొప్పున అధికార పార్టీ నాయకులు వసూళ్లకు పాల్పడ్డారు. ఈ కాలనీలో స్థలాల కోసం ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసింది. ఏడాదిగా ఈ భూమిని అభివృద్ధి చేయలేదు. లబ్ధిదారులకు స్థలాలు కూడా ఇవ్వలేదు. సదరు ప్రజాప్రతినిధి తనను ప్రసన్నం చేసుకున్న వారి పేర్లనే లబ్ధిదారుల జాబితాలో ఉంచి పట్టాలు ఇచ్చారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. మత్స్యకారులు నివాసం ఉండే ఈ కాలనీలో ఒక్కో ఇంట్లో రెండు, మూడు కుటుంబాల వారు ఉంటున్నా అలాంటి వారి పేర్లను లబ్ధిదారుల జాబితాల నుంచి తొలగించడంలో స్థానిక ప్రజాప్రతినిధి చక్రం తిప్పాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Read more