అనధికార దర్శనాలపై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2022-09-28T06:16:37+05:30 IST

ఇంద్రకీలాద్రి మీద అనధికార దర్శనాలపై కలెక్టర్‌ దిల్లీరావు ఉక్కుపాదం మోపారు.

అనధికార దర్శనాలపై ఉక్కుపాదం

ఇంద్రకీలాద్రిపైకి  బస్సుల రాకపోకలు నిలిపివేత 

  వృద్ధులు, వికలాంగులు కార్లలో కొండ మీదకు తరలింపు

  మహామండపం దొడ్డిదారులు మూసివేత 

 తాళాలు వేయించి  సీసీకి ఇచ్చిన కలెక్టర్‌  

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఇంద్రకీలాద్రి మీద అనధికార దర్శనాలపై కలెక్టర్‌ దిల్లీరావు ఉక్కుపాదం మోపారు. శనివారం ఆంధ్రజ్యోతిలో వీఐపీలకు సంబంధించి ప్రచురితమైన  ఖాళీ క్యూ కథనంపై కలెక్టర్‌ స్పందించారు. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు కథనంలో వెలుగులోకి తీసుకువచ్చిన అంశాలపై దిద్దుబాటు చేపట్టారు. కొండమీదకు అనధికారికంగా ప్రవేశించే భక్తులను మంగళవారం నివారించారు. అనధికార వీఐపీల తాకిడిని నియంత్రించేందుకు మహామండపం నుంచి ఇంద్రకీలాద్రి చిన రాజగోపురం వరకు కలెక్టర్‌   తహసీల్దార్లను నియమించారు. రెవెన్యూ అధికారుల ద్వారా డిజిగ్నేటెడ్‌ వీఐపీల సమాచారం కచ్చితంగా యంత్రాంగం దృష్టికి ముందుగా వచ్చేలా చర్యలు చేపట్టారు. నాన్‌ డిజిగ్నేటెడ్‌ వీఐపీలను పూర్తిగా ఓం టర్నింగ్‌ దగ్గర ఏర్పాటు చేసిన వీఐపీ మార్గంలోనే వెళ్లేలా చర్యలు చేపట్టారు. దీంతో కొండ మీదకు అనధికార వీఐపీల ప్రవేశం గణనీయంగా తగ్గిపోయింది. వృద్ధులు, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత బస్సుల్లో ఎవరు పడితే వారు వస్తుండటం వల్ల కూడా కొండ మీద అనధికార దర్శనాలకు ఆస్కారం కలుగుతోందని గుర్తించి బస్సులను నిలుపుదల చేయించారు. వృద్ధులు, వికలాంగులను కూడా దేవస్థానం ఏర్పాటు చేసిన కార్లలోనే పైకి తరలించారు. ఎన్‌ఎస్‌ఎస్‌, రెడ్‌క్రాస్‌, పోలీసు వలంటీర్ల బృందాలను కొండ మీద వీల్‌ చైర్లతో సిద్ధం చేశారు. ఇదే సందర్భంలో ఉచిత బస్సులను బస్‌స్టేషన్‌, రైల్వేస్టేషన్లు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులను వినాయకుడి గుడి దగ్గర ఉన్న క్యూల దగ్గరకు తీసుకువచ్చి, తీసుకు వెళ్లేందుకు ఉపయోగించారు.

 ఆలయ పరిసరాలపై దృష్టి

కలెక్టర్‌ ఆలయ పరిసరాలపై దృష్టి సారించారు. బయట చిన రాజగోపురం మార్గాన్ని మూసివేయించారు. లోపల సోమవారం మూసివేయించిన షట్టర్‌ను ఎట్టి పరిస్థితుల్లో తెరవనీయకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. వీఐపీ క్యూ నుంచి ఆలయ పరిసర ప్రాంతాల్లోకి వచ్చే మార్గాలన్నింటికీ తాళాలు వేయించారు. అంతరాలయంలోకి వెళ్లటానికి అవకాశం ఉన్న అన్ని దారులను ఆయన దగ్గరుండి తాళాలు వేయించారు. మహామండపం ద్వారా ఉన్న అడ్డదారులను గుర్తించి వాటికి తాళాలు వేయించారు. ఈ తాళాలను సీసీ కి అప్పగించారు. 

 దేవదాయ ఉద్యోగుల కినుక

 అంతరాలయ అడ్డదారులకు తాళాలు

 వేయించడంతో కలెక్టర్‌పై ఆగ్రహం

జిల్లా యంత్రాంగంపై దేవదాయ శాఖ ఉద్యోగులు కస్సుబుస్సులాడుతున్నారు. అంతరాలయ ప్రవేశ ద్వారాలన్నీ కలెక్టర్‌ దిల్లీరావు మూసివేయించటంతో  సహించలేకపోతున్నారు.  దసరా ఉత్సవాల్లో దేవస్థాన ఉద్యోగులు అనధికార దర్శనాలు చేయించే అవకాశం లేకుండా పోయింది. చిన్న రాజగోపురం నుంచి అంతరాలయం వరకు ఉన్న అనధికార మార్గపు లింకులను కలెక్టర్‌ మూసివేయించారు. ఇది దేవస్థాన ఉద్యోగులకు మింగుడు పడలేదు. ఘాట్‌ మార్గంలోని సమాచార కేంద్రంలో కూర్చుని జిల్లా యంత్రాంగాన్ని ఆడిపోసుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. సాధారణంగా దేవస్థాన ప్రొటోకాల్‌ దర్శనాల వ్యవహారాలను ఉద్యోగులే చూస్తుంటారు. ప్రొటోకాల్‌ దర్శనాలకు వచ్చేవారు డిజిగ్నేటెడ్‌ కాబట్టి వారికి వీఐపీ దర్శనం ఉంది. కలెక్టర్‌ తమ దారులన్నింటినీ మూసివేశారన్న ఆక్కసుతో దేవస్థాన ఉద్యోగులు, ప్రొటోకాల్‌ విధులు నిర్వహించే సిబ్బంది దిల్లీరావును బహిరంగంగా ఆడిపోసుకుంటున్నారు. తమకు వ్యక్తిగతంగా వచ్చిన ఇబ్బందిని భక్తుల సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దేవస్థాన ఉద్యోగులు కినుక వహించి ఘాట్‌ రోడ్డు మార్గంలోని సమాచార కేంద్రం దగ్గర కూర్చుంటున్నారు. దసరా ఉత్సవాల ఫెస్టివల్‌ ఆఫీసర్‌ రామచంద్రమోహన్‌ పలు దఫాలు సమాచార కేంద్రానికి వచ్చి దేవస్థాన సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్‌గేట్‌, ఓం టర్నింగ్‌ల దగ్గర డ్యూటీలు నిర్వహించకుండా సమాచార కేంద్రంలో కూర్చుని ఏమి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆ కాసేపు విధులకు వెళ్లి ఫెస్టివల్‌ ఆఫీసర్‌ వెళ్లగానే.. మళ్లీ యథాస్థానాలకు వచ్చేస్తున్నారు. 


Read more