గోవధ నిషేధిత చట్టం అతిక్రమిస్తే శిక్ష : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-07-05T06:49:58+05:30 IST

గోవధకు పాల్పడిన, సహకరించినా చట్టరీత్యా శిక్షార్హులేనని, గోవధ నిషేధ చట్టాన్ని ఖచ్ఛితంగా అమలు చేయాలని కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అన్నారు.

గోవధ నిషేధిత చట్టం అతిక్రమిస్తే శిక్ష : కలెక్టర్‌

వన్‌టౌన్‌, జూలై 4 : గోవధకు పాల్పడిన, సహకరించినా చట్టరీత్యా శిక్షార్హులేనని, గోవధ నిషేధ చట్టాన్ని ఖచ్ఛితంగా అమలు చేయాలని కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అన్నారు. నగరంలోని స్పందన సమావేశ మందిరంలో సోమవారం జిల్లా జంతు సంక్షేమ సంఘం చైర్మన్‌, కలెక్టర్‌ దిల్లీరావు అధ్యక్షతన పశుసంవర్థక శాఖ ఆధ్యర్యంలో గోవధ నిషేధం చట్టం అమలుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోవుల అక్రమ రవాణా, గోవధ నిషేధం, పశుసంరక్షణ చట్టం ప్రకారం గోవధను నిషేధించడం జరిగిందన్నారు. ఎవరైనా అతిక్రమిస్తే ఆరునెలల జైలుశిక్ష, రూ.1000లు జరిమానా, లేదా రెండూ విధించడం జరుగుతుందన్నారు. ఈ నెల 10న బక్రీద్‌ సందర్భంగా గోవధ, అక్రమ రవాణాపై అధికారులు గట్టి నిఘా ఉంచాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. అనంతరం గోవధ నిషేధ చట్టంపై అవగాహన కల్పించే పోస్టరును డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ, కలెక్టర్‌ దిల్లీరావు, జేసీ నూపూర్‌ అజయ్‌, డీఆర్వో కె.మోహన్‌కుమార్‌, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్‌ కె.విద్యాసాగర్‌ విడుదల చేశారు.

కలెక్టర్‌ను కలిసిన రెహమాన్‌

జిల్ల్లా ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎం.హెచ్‌ రెహమాన్‌ సోమవారం కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావును కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందచేశారు. ఏపీ ట్రెజరీ సర్వీసెస్‌ అసొసియేషన్‌ అధ్యక్షుడు బేతాళ సతీష్‌, ఏడీవో రామారావు, ఎస్‌టీవో కె.మల్లేశ్వరరావు, ఒ.నరసింహారావు పాల్గొన్నారు.

ఏపీ ఎడిటర్స్‌, యూనియన్‌ రాష్ట్ర నేతలు వినతి

ఏపీ ఎడిటర్స్‌ అండ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు చొప్పరపు సాంబశివనాయుడు పిలుపు మేరకు ఈ విద్యా సంవత్సరంలో జర్నలిస్టులు, సంపాదకుల పిల్లలకు కాన్వెంట్లు, కళాశాలలో గతంలో మాదిరిగా ఫీజు రాయితీ ఇవ్వాలని ఎడిటర్స్‌, యూనియన్‌ నేతలు కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావును కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఇప్పటికే సమాచార, విద్యా శాఖల మంత్రులు వేణుగోపాల్‌, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డిని కలిశామన్నారు. ఇప్పటివరకు ఆదేశాలు రాకపోవడంతో మరోసారి విజ్ఞప్తి చేస్తున్నట్టు యూనియన్‌ నేతలు కలెక్టర్‌కు చెప్పారు.

Read more