సీజేఐ జస్టిస్‌ రమణకు ఘన స్వాగతం

ABN , First Publish Date - 2022-08-21T06:20:44+05:30 IST

సీజేఐ జస్టిస్‌ రమణకు ఘన స్వాగతం

సీజేఐ జస్టిస్‌ రమణకు ఘన స్వాగతం

- స్వగ్రామం పొన్నవరంలో సందడి 

- స్నేహితులు, గ్రామస్థులతో మాటామంతీ

కంచికచర్ల, ఆగస్టు 20 : భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణకు శనివారం స్వగ్రామం వీరులపాడు మండలం పొన్నవరంలో ఘనస్వాగతం లభించింది. విజయవాడ, గుంటూరు కార్యక్రమాల అనంతరం సాయంత్రం సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామం మీదుగా పొన్నవరం చేరుకున్నారు. గ్రామస్థులతో పాటుగా అర్చకులు, వేదపండితులు ఎదురేగి పూర్ణకుంభంతో స్వాగతం పలికి శివాలయంలోకి తీసుకువెళ్లగా రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులతో కొద్దిసేపు ఆయన గడిపారు. బంధువులు, గ్రామస్థులు, స్నేహితులను పేరు పేరున అడిగి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం కారులో హైదరాబాదుకు తిరిగి వెళ్లారు. 

పేరకలపాడులో మొక్క నాటిన సీజేఐ..

తొలుత పేరకలపాడు గ్రామంలో జస్టీస్‌ రమణకు సర్పంచ్‌ మన్నె సాత్విక ఆధ్వర్యంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. దేవాలయం ప్రాంగణంలో జస్టిస్‌ రమణ మామిడి మొక్కను నాటారు. ఎంటెక్‌ చదివి సర్పంచ్‌గా గ్రామాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న సాత్వికను ఆయన అభినందించారు. కార్యక్రమంలో చవళం శ్రీనివాసరావు, గద్దె మల్లికార్జునరావు, చుండూరు లక్ష్మినరసింహారావు, గద్దె నరసింహారావులు పాల్గొన్నారు. సీజేఐ జస్టిస్‌ రమణను అమరావతి  రైతు నాయకులు అత్తోటి సుబ్బారావు, నల్లూరి రాంబాబు, వెలగా వెంకటేశ్వరరావు, ఒంగోలుకు చెందిన రైతు నాయకుడు చుండూరు రంగారావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టీడీపీ నేతలు తదితరులు దుశ్శాలువాలు, పూలగుచ్ఛాలతో సత్కరించారు. సీజేఐ హోదాలో రెండోసారి స్వగ్రామం పొన్నవరం వచ్చిన సందర్భంగా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ సీపీ కాంతిరాణా పర్యవేక్షణలో డీసీపీ మేరీ ప్రశాంతి,  ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు బందోబస్తులో పాల్గొన్నారు. కార్యక్రమంలో జేసీ శ్రీవాస్‌ నుపూర్‌ అజయ్‌, నందిగామ ఆర్డీవో రవీంద్రరావు, కంచికచర్ల, వీరులపాడు మండలాలకు చెందిన స్థానిక అధికారులు పాల్గొన్నారు.

Read more