సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మొండివైఖరి సిగ్గుచేటు

ABN , First Publish Date - 2022-03-16T06:46:48+05:30 IST

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మొండివైఖరి సిగ్గుచేటు

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మొండివైఖరి సిగ్గుచేటు
నిరసన తెలుపుతూ సాంబమూర్తి రోడ్డులో ర్యాలీగా వస్తున్న పంచాయతీ కార్మికులు

ఉద్యమాలపై పోలీసుల నిర్బంధాన్ని సహించం: సీఐటీయూ రాష్ట్ర నేతలు 

విజయవాడ సిటీ, మార్చి 15: గ్రామ పంచాయతీ కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్ల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవ హరించడం సిగ్గుచేటని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌. సి.హెచ్‌.శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. గ్రామ పంచాయతీ కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్లకు 11వ పీఆర్సీ ఆశుతోష్‌మిశ్రా కమిషన్‌ సిఫారసుల మేరకు రూ.20 వేలు జీతం, బకాయి జీతాల చెల్లింపు, 132, 142, 680 జీవోలను అమలు చేయాలని ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ మంగళవారం నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. దీంతో కొందరు కార్మికులు పోలీసుల  కళ్లుగప్పి సాంబమూర్తిరోడ్డులోని డీమార్టు నుంచి ధర్నాచౌక్‌కు ర్యాలీగా చేరుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, కార్మికులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్‌ మాట్లాడారు. రాష్ట్రవ్యాపంగా ఒకే విధమైన వేతనాలు అమలు కావడం లేదని, రూ.2,400 నుంచి రూ.12 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు మారినా తమ జీవితాల్లో మార్పు రావడంలేదని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.రామాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా చేస్తున్న ఉద్యమా లపై పోలీసుల నిర్బంధాన్ని ప్రయోగించి అణచివేయాలని చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. సంఘం రాష్ట్ర నేతలు కె.శివప్రసాద్‌, కె.నాగన్న, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more