రేషన్‌ అవకతవకలపై విచారణ

ABN , First Publish Date - 2022-09-13T07:03:11+05:30 IST

నగరంలోని 27వ డివిజన్‌లో పేదలకు ఇంటింటికీ రేషన్‌ పంపిణీలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని తహసీల్దార్‌ సునీల్‌ను కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి డాక్టర్‌ భారతీ ప్రవీణ్‌ పవార్‌ ఆదేశించారు.

రేషన్‌ అవకతవకలపై విచారణ

 టీడీపీ కార్పొరేటర్‌ ఫిర్యాదుకు

 కేంద్ర మంత్రి భారతీ పవార్‌ స్పందన

మచిలీపట్నం టౌన్‌, సెప్టెంబరు 12 : నగరంలోని 27వ డివిజన్‌లో పేదలకు ఇంటింటికీ రేషన్‌ పంపిణీలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని తహసీల్దార్‌ సునీల్‌ను కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి డాక్టర్‌ భారతీ ప్రవీణ్‌ పవార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల పనితీరుపై కేంద్ర మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.  27వ డివిజన్‌ లో ఇంటింటికీ రేషన్‌ పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రికి టీడీపీ కార్పొరేటర్‌ చిత్తజల్లు నాగరాము ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేంద్ర మంత్రి స్పందించారు.  కలెక్టర్‌ రంజిత్‌ బాషాతో చర్చించారు. సమావేశంలో ఉన్న తహసీల్దార్‌ సునీల్‌ను పిలిచి విచారణ జరపాలని, అవసరమైతే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేషన్‌ బియ్యం తూకంలో తేడాలు వస్తున్నాయని, లబ్ధిదారులు తిరిగి బియ్యాన్ని తమకే అమ్మాలని ఇంటింటికీ బియ్యం పంపిణీ చేస్తున్న వ్యాన్‌ డ్రైవర్‌ పేదలను బెదిరిస్తున్నారని చిత్తజల్లు నాగరాము ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి స్పందించి తగు విచారణ జరిపించాలని ఆదేశించారు.  టీడీపీ కార్పొరేటర్‌లు దేవరపల్లి అనిత, అన్నం ఆనంద్‌, దింటకుర్తి సుధాకర్‌, జిల్లా మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు సయ్యద్‌ ఖాజా, ప్రభుత్వ ఆసుపత్రి మాజీ డైరెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌  పాల్గొన్నారు.  తనకు టిడ్కో ఇల్లు మంజూరు చేశారని, అయితే 45వ డివిజన్‌ సచివాలయం అధికారులు టిడ్కో ఇల్లు కాదు,  స్థలం తీసుకోమని వత్తిడి చేస్తున్నారని కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌కు వృద్ధురాలు కోడూరి కళావతి  ఫిర్యాదు చేశారు.  దీనిపై మంత్రి స్పందించారు. కలెక్టర్‌ రంజిత్‌ బాషాతో మా ట్లాడారు. వృద్ధురాలు రెండు ఇన్‌స్టాల్‌మెంట్లు కట్టారని, టిడ్కో ఇల్లు ఇవ్వాలని సూచించారు. 

Updated Date - 2022-09-13T07:03:11+05:30 IST