చాగంటిపాడులో బుసక దందా

ABN , First Publish Date - 2022-12-10T01:23:32+05:30 IST

జగనన్న కాలనీల మెరక పేరుతో అధికారపార్టీ నేతలు బుసక దందాకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పగలు విశ్రాంతి ఇచ్చి రాత్రి సమయాల్లో జోరుగా బుసక అక్రమ వ్యాపారం సాగిస్తున్నారని తెలుస్తోంది.

చాగంటిపాడులో బుసక దందా
తవ్వకాలు జరిగిన చాగంటిపాడు ఎస్సీ సొసైటీ భూమి

జగనన్న కాలనీల మెరకకని చెప్పి.. ప్రైవేటు కనకవల్లి భూముల్లోకి తోలుతున్న అధికార పార్టీ నేతలు

తోట్లవల్లూరు, డిసెంబరు 9: జగనన్న కాలనీల మెరక పేరుతో అధికారపార్టీ నేతలు బుసక దందాకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పగలు విశ్రాంతి ఇచ్చి రాత్రి సమయాల్లో జోరుగా బుసక అక్రమ వ్యాపారం సాగిస్తున్నారని తెలుస్తోంది. తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు ఎస్సీ సొసైటీ భూముల్లో బుసక తవ్వకాలకు పామర్రు మండలం రాపర్లకు చెందిన కాకర్ల వెంకటేశ్వరరావు పేరుతో రెవెన్యూ అధికారులు అనుమతి ఇచ్చారు. మండలానికి చెందిన కొందరు వైసీపీ నేతలు బుసక తవ్వకాలు చేపట్టారని తెలిసింది. రెండు రోజుల నుంచి రాత్రి సమయాల్లో మండలంలోని కనకవల్లిలో ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కన ఓ రైతు మాగాణి భూమిలో సుమారు వంద లారీల బుసకను అనధికారికంగా నింపేశారు. ఇక్కడ జగనన్న కాలనీ ఎక్కడుందని, ప్రైవేటు భూముల్లోకి ఎలా బుసక తోలుతారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాఉరు. శుక్రవారం చాగంటిపాడు ఎస్సీ సొసైటీ భూముల వద్దకు వెళ్లగా అక్కడ జేసీబీ ఉంది. రాత్రి సమయాల్లో బుసక తవ్వుతున్నట్టు పలువురు తెలిపారు. ఎకరం విస్తీర్ణంలో బుసక తవ్వకాలు చేశారు.

చర్యలు తీసుకుంటాం

మొవ్వ మండలం అయ్యంకిలో జగనన్న కాలనీలో ప్లాట్ల మెరకకు బుసక తోలాలి. కనకవల్లిలో అనధికారికంగా బుసక తోలినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం.

-కె.వెంకటశివయ్య, తోట్లవల్లూరు తహసీల్దార్‌

Updated Date - 2022-12-10T01:23:33+05:30 IST