నందిగామలో విగ్రహాల మార్పునకు బ్రేక్‌

ABN , First Publish Date - 2022-02-23T06:13:10+05:30 IST

నందిగామ మెయిన్‌ బజార్‌లోని విగ్రహాల మార్పు వివాదం హైకోర్టుకు చేరింది.

నందిగామలో విగ్రహాల మార్పునకు బ్రేక్‌
కోర్టు ఉత్తర్వులను సబ్‌కలెక్టర్‌కు అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే సౌమ్య

కోర్టు ఉత్తర్వులను సబ్‌ కలెక్టర్‌కు అందజేసిన మాజీ ఎమ్మెల్యే సౌమ్య

నందిగామ : నందిగామ మెయిన్‌ బజార్‌లోని విగ్రహాల మార్పు వివాదం హైకోర్టుకు చేరింది. పట్టణంలోని మెయిన్‌ బజార్‌లో రోడ్డు విస్తరణలో భాగంగా పార్క్‌లో ఉన్న పలువురు జాతీయ, స్థానిక నాయకులు విగ్రహాలను ప్రభుత్వ వైద్యశాల గోడపైకి మార్చేందుకు మునిసిపల్‌ అధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై టీడీపీ అభ్యంతరం తెలిపింది. పక్కనే ఉన్న వైఎస్‌ విగ్రహం తొలగించకుండా మిగిలిన విగ్రహాలు తొలగించడంపై పలు మార్లు ఆందోళనలు కూడా చేశారు. అయినా మునిసిపల్‌ అధికారులు పట్టించుకోకుండా విగ్రహాల మార్పుకు చర్యలు చేపడుతుండడంతో పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఏచూరి రామకృష్ణ కోర్డును  ఆశ్రయించాడు. ఆయన పిటిషన్‌ మంగళవారం బెంచ్‌పైకి వచ్చింది. ఈ వివాదంపై నెల రోజుల్లో వివరణ ఇవ్వాలని, అంత వరకూ పనులు నిలిపివేయాలని కోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు మునిసిపల్‌ అధికారులకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రతులను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణలు సబ్‌కలెక్టర్‌కు ప్రవీణ్‌చంద్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ, మునిసిపల్‌ కమిషనర్‌, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ ఈవిషయంలో ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.చిత్తశుద్ధి ఉంటే వైఎస్‌ విగ్రహం కూడా అందరి విగ్రహాల పక్కన పెట్టి విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 

సబ్‌కలెక్టర్‌ సమీక్ష

 నందిగామ రెవెన్యూ కార్యాలయంలో సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు. రికార్డులు పరిశీలించి వివిధ అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్పందనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-02-23T06:13:10+05:30 IST