తెల్లవార్లూ బార్లా..!

ABN , First Publish Date - 2022-07-07T06:04:54+05:30 IST

తెల్లవార్లూ బార్లా..!

తెల్లవార్లూ బార్లా..!

బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో నిబంధనలు తూచ్‌

తెల్లవారుజాము నుంచే వ్యాపారం

ముందు షట్టర్లు దించేసి, వెనుకవైపు నుంచి అమ్మకాలు

కొట్లాట స్కెచ్‌లకూ కేంద్రాలు


పటమటలంకలో ఒక బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ అది. నిబంధనల ప్రకారం ఉదయం పది గంటలకు తెరవాలి. కానీ, బార్‌ పక్కనే ఖాళీ స్థలాన్ని అద్దెకు తీసుకుని, చుట్టూ రేకులు కట్టుకుని  తెల్లవారుజామున 5 గంటల నుంచే మద్యం విక్రయిస్తున్నారు. దీంతో తెల్లవారితే ఇక్కడ పరిస్థితి ఓ జాతరలా మారిపోతోంది. వాకింగ్‌ చేసే వారికి ఇబ్బందిగా ఉంటోంది. డయల్‌ యువర్‌ కమిషనర్‌లో ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు ఇది. 


కొత్త ప్రభుత్వాసుపత్రిలోని పోస్టుమార్టం వద్ద ఉన్న స్నేహితుడి మృతదేహాన్ని చూడటానికి వచ్చినవారు.. ఆనక మహానాడు రోడ్డులో ఉన్న బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వద్దకు వెళ్లారు. అక్కడ  తాగిన తరువాత ఇద్దరు యువకుల మధ్య వివాదం చెలరేగింది. ఇద్దరూ కొట్టుకున్నారు. అనంతరం ఒక యువకుడు తన అనుచరులతో వెళ్లి మరో యువకుడిని చంపేశాడు. కొద్దిరోజుల క్రితం జరిగిన వాలీబాల్‌ కోచ్‌ ఆకాశ్‌ హత్య కేసులోని కోణం ఇది. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వద్ద వివాదం జరిగినా అక్కడి నుంచి పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదు. - (ఆంధ్రజ్యోతి-విజయవాడ)


తెల్లవారుజాము నుంచే కిక్కు..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకే బార్‌ అండ్‌ రెస్టారెంట్లను నిర్వహించాలి. రాత్రి 11 గంటల తర్వాత మద్యం సరఫరా చేయకూడదు. ఆహారం మాత్రం సరఫరా చేసుకోవచ్చు. ఈ నిబంధనలను నగరంలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యజమానులు ఉల్లంఘిస్తున్నారు. ఆదేశాలు ఎలా ఉన్నా.. వారు అనుకున్న సమయానికి కార్యకలాపాలు మొదలు పెట్టేస్తున్నారు. కొన్ని బార్లు తెల్లవారుజాము నుంచే అమ్మకాలు సాగిస్తున్నాయు. బార్‌ షట్టర్లు మూసేసి ఉంచి, వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలంలో వ్యవహారం నడిపిస్తున్నారు. ఉదయం నుంచి షట్టర్లు ఎత్తే వరకూ మద్యం విక్రయించడానికి ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించుకుంటున్నారు. నగరంలో మొత్తం 145 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉన్నాయి. గొల్లపూడి డిపో పరిధిలో 65 బార్‌లు ఉండగా, నిడమానూరు డిపో పరిధిలో 80 ఉన్నాయి. వాటిలో సగానికి పైగా నిబంధనలు ఉల్లంఘించి సాగుతున్నాయి. కొంతమంది సమీపంలో ఉన్న ఖాళీ స్థలాలను అద్దెకు తీసుకుని షెడ్లుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. బయటకు కనిపించకుండా లోపల సరుకును అమ్ముతున్నారు. 

దారుణాలకు పక్కా స్కెచ్‌..

నగరంలో జరిగిన కొన్ని ఘటనలకు బార్‌ల వద్ద స్కెచ్‌లు సిద్ధం చేసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. వాగ్యుద్ధాలు జరిగిన పరిస్థితుల్లో మద్యంబాబులు కత్తులకు పనులు చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తే ఆయుధాలతోనే మద్యంబాబులు బార్లలోకి  ప్రవేశిస్తున్నారని తెలుస్తోంది.  మద్యం పోయించి, కౌంటర్‌లో క్యాష్‌ను నింపుకొంటున్న యజమానులు.. బార్‌ ముందు కొట్లాటలు జరిగినా, వివాదాలు చెలరేగినా పోలీసులకు సమాచారం ఇవ్వడం లేదు. నగరంలోని కొన్ని బార్‌ల వద్ద జరిగిన ఘటనలను వెలుగులోకి రాకుండా చేయడంలో యజమానులు కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించారు. గీత దాటితే ఉపేక్షించం..

బార్‌ అండ్‌ రెస్టారెంట్ల నిర్వాహకులతో ఉప కమిషనర్‌ విశాల్‌ గున్నీ

నగరంలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్లు నిర్వహిస్తున్న యజమానులు కచ్చితంగా నిబంధనలను పాటించాలని తూర్పు జోన్‌ ఉప కమిషనర్‌ విశాల్‌ గున్నీ ఆదేశించారు. బందరు రోడ్డులోని ఆపరేషనల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటరులో బుధవారం ఆయన బార్‌ అండ్‌ రెస్టారెంట్ల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఉదయం 10 గంటల ముందు తెరిచినా, రాత్రి 11 గంటల తర్వాత విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని బార్ల వద్ద వాహనాల పార్కింగ్‌ ఇష్టానుసారంగా ఉండటం వల్ల ఇతర వాహనాలకు ఇబ్బందులు ఉంటున్నట్టు గుర్తించామన్నారు. కేవలం క్యాష్‌ కౌంటర్ల వద్ద మాత్రమే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారన్నారు. బార్‌ అండ్‌ రెస్టారెంట్ల వద్ద జరిగిన వివాదాలను పోలీసుల దృష్టికి తీసుకురాకుండా కప్పిపుచ్చుతున్నట్టు గ్రహించామన్నారు. ఈ లోపాలను సరిచేసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

Read more