బడికి పోవాలంటే.. నదిని దాటాల్సిందే!

ABN , First Publish Date - 2022-09-08T06:19:49+05:30 IST

బడికి పోవాలంటే.. నదిని దాటాల్సిందే!

బడికి పోవాలంటే..  నదిని దాటాల్సిందే!

- ప్రమాదకర స్థితిలో ఎడ్లంక చిన్నారులు

- వంతెన ఏర్పాటు చేసి ఆదుకోవాలని గ్రామస్థుల వినతి 

అవనిగడ్డ టౌన్‌, సెప్టెంబరు 7 :  అది కృష్ణాజిల్లాలోని దివి గ్రామాల్లో ఒకటైన పాత ఎడ్లంక దీవి.. అక్కడ చిన్నారులు బడికి పోవాలంటే వరద నీటిలో ప్రాణాలకు తెగించి ఒడ్డుకు వెళ్లాల్సిన దుస్థితి.. కృష్ణానదీ గర్భంలో ఉన్న ఈ గ్రామం చుట్టూ సంవత్సరం పొడవునా సముద్రం నీరు ప్రవహిస్తుంది. సుమారు 17ఏళ్ల క్రితం ప్రభుత్వం పాత ఎడ్లంక - కొత్త ఎడ్లంక గ్రామాలను కలుపుతూ కాజ్‌వేను ఏర్పాటు చేసి  ప్రజల రాకపోకలకు వెసులుబాటు కల్పించింది. ఈ గ్రామానికి ప్రతిఏటా వరదలు సర్వ సాధారణమే అయినప్పటికీ వరద సమయంలో మినహా మిగిలిన రోజుల్లో కాజ్‌వే పై నుంచి గ్రామస్థులు రాకపోకలు సాగిస్తుంటారు. కొంత కాలంగా ఎడ్లంక గ్రామం చుట్టూ సహజ సిద్ధంగా ఏర్పడిన ఇసుక, బుసక మేటలపై కన్నెసిన మాఫియా పెద్ద ఎత్తున తవ్వకాలు జరపటంతో కాజ్‌వే పరిసర ప్రాంతాల్లో నేల పటుత్వాన్ని కోల్పోయి మూడేళ్ల క్రితం వచ్చిన వరదల్లో కాజ్‌వే కొట్టుకుపోయింది. వైసీపీ ప్రభుత్వంలో గ్రామాన్ని సందర్శించిన నాటి మంత్రులు కొడాలి నాని, పేర్నినాని, అనిల్‌ కుమార్‌, స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌బాబు ఎడ్లంక వాసులకు శాశ్వత పరిష్కారం  చూపుతామని భరోసా కల్పించారు. ఆ హామీ నేటికీ నెరవేరకపోవటంతో స్థానిక ప్రజలు వరద నీటిలోనే రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. ఎడ్లంక గ్రామంలో 7వ తరగతి వరకు మాత్రమే ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండటంతో పై చదువులకు తప్పనిసరిగా అవనిగడ్డకు వెళ్లాల్సిందే. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు వరదజాలులోనే నదిని దాటడం తప్పనిసరి. పలువురు తమ పిల్లలను అవనిగడ్డలోని ప్రైవేట్‌ కాన్వెంట్లలో చదివిస్తుండటంతో గ్రామానికి వెళ్లాల్సిన బస్సు ఈవల ఒడ్డునే ఆగిపోవటంతో వారు కూడా వరద నీటిలో నడిచి ఒడ్డుకు చేరుకోవాల్సిన పరిస్థితి. పెద్ద స్థాయిలో వరద వస్తే రెవెన్యూ అధికారులు మాత్రం దీవికి వెళ్లివచ్చేందుకు ఓ నాటు పడవను ఏర్పాటు చేసి దాని ప్రయాణికులను చేరవేయటం చేస్తుంటారు. వరద ప్రవాహంలోనే విద్యార్థులు ఎక్కడ ప్రమాదానికి గురవుతారోనని వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు దోవా గోవర్థన్‌ మాట్లాడుతూ.. అవనిగడ్డ నుంచి పాఠశాలకు వెళ్లాలంటే ఒక్కోసారి పడవ అందుబాటులో ఉండదని పేర్కొన్నారు. వరద నీటిలోనే నది దాటి వెళ్తున్నట్లు మహిళా ఉపాధ్యాయులు, మహిళా సిబ్బంది నది దాటి గ్రామానికి వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-09-08T06:19:49+05:30 IST