అస్లాంది హత్యే..!

ABN , First Publish Date - 2022-09-26T05:47:46+05:30 IST

అస్లాంది హత్యే..!

అస్లాంది హత్యే..!

గొంతు నులిమి చంపేసిన మొదటి భార్య, ప్రియుడు

నిందితుడు వైసీపీ నేత, ప్రజాప్రతినిధికి ముఖ్య అనుచరుడు

హత్యేనని పోలీసులకు ఫిర్యాదు చేసిన రెండో భార్య 

రాజకీయ ఒత్తిళ్లతో 8 నెలలు సాగిన విచారణ

న్యాయస్థానం జోక్యంతో బయటపడిన అసలు నిజం


అధికార పార్టీ ప్రజాప్రతినిఽధి ఒత్తిళ్లు.. సుమారు రూ.కోటికిపైగా ముడుపులతో దాదాపు మరుగునపడిపోయిన ఓ హత్య కేసులో బాధితులకు ఇప్పటికి న్యాయం లభించింది. న్యాయస్థానం ఆదేశాలతో పోలీసులు చకచకా కదిలారు. గతంలో అనుమానాస్పద మృతిగా నమోదైన కేసును హత్య కేసుగా మార్చి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. 


విజయవాడ/చిట్టినగర్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : వన్‌టౌన్‌లోని మహంతిపురంలో ఈ ఏడాది జనవరిలో అస్లాం అనే వ్యాపారవేత్త చనిపోయారు. అస్లాంది అనుమానాస్పద మృతిగా పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు సంచలనమైంది. సయ్యద్‌ అస్లాం ఎంకే ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ను నిర్వహించేవారు. అదే ప్రాంతానికి చెందిన అన్వర్‌ ఆయనకు మంచి స్నేహితుడు. ఈ అన్వర్‌ వైసీపీ 54వ డివిజన్‌ కార్పొరేటర్‌ అర్షద్‌కు ప్రధాన అనుచరుడు. అన్వర్‌ తరచూ అస్లాం ఇంటికి వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే అస్లాం మొదటి భార్య నసీమాతో అతనికి సంబంధం ఏర్పడింది. ఆమెను తీసుకుని హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లేవాడు. ఈ విషయం అస్లాంకు తెలియకుండా జాగ్రత్త పడేవారు. జనవరి 14న అస్లాం వ్యాపారానికి సంబంధించి సుమారు రూ.కోటితో నసీమా ఇంటికి వెళ్లాడు. అతడిని అడ్డు తొలగించుకుంటే అన్వర్‌తో యథేచ్ఛగా ఉండొచ్చని నసీమా భావించింది. అస్లాం వ్యాపారాలను మొత్తం దక్కించుకోవచ్చని అన్వర్‌ ప్లాన్‌ వేశాడు. జనవరి 14న అస్లాం ఇంటికి రాగానే నసీమా ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసింది. తర్వాత అన్వర్‌కు సమాచారం ఇచ్చింది. ముగ్గురూ ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటుండగా, వివాదం జరిగింది. అస్లాంను మంచంపైకి తోసేసి నసీమా, అన్వర్‌ గొంతు నులిమి చంపేశారు. 15వ తేదీ ఉదయం నసీమా ఏమీ తెలియనట్టు అస్లాం గుండెపోటుతో చనిపోయాడన్న వార్తను బంధుమిత్రులకు చేరవేసింది. అస్లాం రెండో భార్య కరీమున్నీసా ఆరోపణలతో పోలీసులు రంగంలోకి దిగారు. అస్లాం ఇంటి సీసీ కెమెరాలను పరిశీలించగా, వాటిలో 13వ తేదీ వరకు ఫుటేజీ మాత్రమే ఉంది. 14వ తేదీది లభించలేదు. పైగా అస్లాం తీసుకెళ్లిన నగదు బ్యాగ్‌ అదృశ్యమమైంది. అప్పటి వరకు నగరంలో కనిపించిన అన్వర్‌ కనిపించకుండా పోయాడు. గుండెపోటుతో చనిపోతే ముఖంపై గాయాలు ఎలా వచ్చాయని కరీమున్నీసా అనుమానం వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు సరైన రీతిలో దర్యాప్తు జరపలేదు. అస్లాం మృతదేహానికి తారాపేటలో ఉన్న ముస్లిం శ్మశానవాటికలో పోస్టుమార్టం నిర్వహించారు. అప్పటికే అస్లాం మృతదేహం చెడిపోవడంతో ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎఫ్‌ఎస్‌ఎల్‌ అధికారులు విజయవాడ పోలీసులకు చెప్పారు. ఇదే సాకుతో పోలీసులు అస్లాం మృతిపై దర్యాప్తును అటకెక్కించారు. నెలలు గడుస్తున్నా తనకు న్యాయం జరగకపోవడంతో కరీమున్నీసా హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల దర్యాప్తు తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కేసును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు అప్పగించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు అసలు నిందితులు నసీమా, అన్వర్‌ అని తేల్చారు. వారిని న్యాయమూర్తి ఎదుట ఆదివారం హాజరుపరచగా, రిమాండ్‌ విధించారు.

వైసీపీ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లతోనే..

నగరానికి చెందిన ఓ వైసీపీ ప్రజాప్రతినిధి పోలీసులపై తీసుకొచ్చిన ఒత్తిళ్ల కారణంగానే అప్పట్లో అస్లాం కేసును ఛేదించడంలో పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరించారు. అస్లాం చనిపోయే ముందు నసీమా ఇంటికి రూ.కోటికిపైగా  తీసుకెళ్లారు. అస్లాం మృతి తర్వాత ఆ మొత్తం ఏమైంది అనే కోణంలో పోలీసులు విచారణే చేయలేదు. ఈ కేసు నుంచి తమను బయటపడేసేందుకు ఆ మొత్తాన్ని నసీమా, అన్వర్‌లు వైసీపీ ప్రజాప్రతినిధికి, ఓ పోలీసు అధికారికి ముట్టజెప్పారన్న ఆరోపణలు వస్తున్నాయి. అస్లాం మృతి తర్వాత అన్వర్‌ కనిపించకుండా పోయాడు. ఆ దిశగానూ పోలీసులు దృష్టి సారించలేదు. అస్లాంను హత్య చేశాక వైసీపీ కార్పొరేటర్‌ ఒకరు అన్వర్‌కు ఆశ్రయం కల్పించారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిపైనా పోలీసులు దృష్టిపెట్టలేదు. రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు ఈ కేసును పక్కదారి పట్టించారని తెలుస్తోంది. అస్లాం రెండో భార్య కరీమున్నీసా పట్టు వదలకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాడటంతో నిందితులు కటకటాల  వెనక్కి వెళ్లారు.

Read more