పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షలు

ABN , First Publish Date - 2022-11-03T00:33:02+05:30 IST

జిల్లాలో ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు జగననున్న ఏపీపీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు.

పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షలు

మచిలీపట్నం టౌన్‌, నవంబరు 2 : జిల్లాలో ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు జగననున్న ఏపీపీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. బుధవారం డీఆర్వో తన ఛాంబర్‌లో ఏపీపీఎస్సీ అధికారులు, వివిధ శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ, జిల్లాలో మూడు సెంటర్లలో ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కానూరులోని ఐయాన్‌ఇన్‌ డిజిటల్‌ జోన్‌, సైలేష్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ, ఆటోనగర్‌లోని విజయదుర్గ ఐటీ ఇన్‌ఫో సొల్యూషన్స్‌ సెంటర్లలో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టులలో పరీక్షలు జరుగుతాయన్నారు. మూడు కేంద్రాల్లో 2060 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. పరీక్షా కేంద్రానికి దగ్గరలో ఇంటర్‌నెట్‌, జెరాక్స్‌ సెంటర్లు మూసివేయాలని, 144 సెక్షన్‌ అమలు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. విద్యుత్‌ సరఫరాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సెల్‌ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఎలక్ర్టానిక్‌ వస్తువులు అనుమతించరాదన్నారు. అభ్యర్థులు ఐడీ కార్డులు తమ వెంట తీసుకురావాలన్నారు. విభిన్న ప్రతిభావంతులకు గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే పరీక్షా కేంద్రాన్ని కేటాయించడంతో పాటు అంధులకు స్ర్కైబ్‌ ఏర్పాటు చేశామన్నారు. అంధులకు 50 నిమిషాలు అదనంగా సమయం కేటాయిస్తామన్నారు. సమావేశంలో ఏపీపీఎస్సీ అసిస్టెంట్‌ సెక్రటరీ బి. దేవేంద్రనాథ్‌, సెక్షన్‌ ఆఫీసర్‌ మాధవీలత, కలెక్టరేట్‌ తహసీల్దార్‌ ఎం.హరనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-03T00:33:02+05:30 IST
Read more