ప్రైవేట్‌ బస్సులపై ఆకస్మిక దాడులు

ABN , First Publish Date - 2022-03-18T06:37:32+05:30 IST

ప్రైవేట్‌ బస్సులపై ఆకస్మిక దాడులు

ప్రైవేట్‌ బస్సులపై ఆకస్మిక దాడులు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

అధిక సరుకు లోడ్‌ చేస్తున్న 38 బస్సులపై కేసులు

రూ.12 లక్షల జరిమానా

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నగరంలోని సాంబమూర్తి రోడ్డు అడ్డాగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో అక్రమంగా జరుగుతున్న సరుకు లోడింగ్‌పై రవాణా శాఖ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘అడుగడుగునా అక్రమ లోడింగ్‌’ కథనంపై జిల్లా ఉప రవాణాశాఖ అధికారి (డీటీసీ) ఎం.పురేంద్ర సీరియస్‌గా స్పందించారు. సాంబమూర్తి రోడ్డుతో పాటు జిల్లావ్యాప్తంగా దాడులు చేయాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. సాంబమూర్తి రోడ్డులో బుధవారం రాత్రి ఓ పథకం ప్రకారం దాడులు జరిగాయి. దీంతో భారీగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో లోడింగ్‌ చేపడుతూ పట్టుబడ్డారు. మొత్తం 38 ప్రైవేట్‌ బస్సులను గుర్తించి కేసులు నమోదు చేశారు. ఈ కేసులతో పాటు రూ.12 లక్షల అపరాధ రుసుం విధించారు. ఈ బస్సుల్లో ప్రయాణికుల లగేజీ చాంబర్లన్నింటినీ సరుకు పార్శిల్‌ బాక్సులు, బండిల్స్‌, పెట్టెలు, మూటలతో నింపేశారు. బస్సుల పైభాగంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కాగా, వీటిలో చాలావరకు బస్సులు పన్నులు చెల్లించకుండా కూడా తిరుగుతున్నట్టు రవాణా శాఖ అధికారులు గుర్తించారు. 

ఇకపై ప్రైవేట్‌ బస్సుల్లో సరుకు రవాణా చేస్తే సీజ్‌ : ఎం.పురేంద్ర, డీటీసీ

ప్రైవేట్‌ బస్సుల యజమానులు కొందరు అత్యాశకు పోయి సరుకు రవాణా చేస్తున్నారు. ప్రయాణికులు, వారి లగేజీ తప్ప ఎలాంటి సరుకు లోడింగ్‌ చేపట్టినా, బస్సులపై అధిక లోడు వేసినా, నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ మందిని ఎక్కించుకున్నా చట్టవిరుద్ధమైన చర్యలుగా భావించాల్సి ఉంటుంది. ఇక మీదట నిరంతరాయంగా తనిఖీలు నిర్వహిస్తాం. ఈసారి ఇలాంటివి జరిగితే ఆ బస్సులను సీజ్‌ చేస్తాం.

Read more