తలమానికానికి.. తలవంపులు!

ABN , First Publish Date - 2022-09-10T06:07:42+05:30 IST

అమరావతి రాజధాని ఏర్పాటుతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నవ్యాంధ్రకే తలమానికంగా మారింది.

తలమానికానికి.. తలవంపులు!

గత ప్రభుత్వంలో వైభవంగా వెలుగొందిన బెజవాడ ఎయిర్‌పోర్టు

వైసీపీ ప్రభుత్వంలో తగ్గిన సర్వీసులు.. మందగించిన అభివృద్ధి 

అమరావతి విధ్వంసంతో.. విమానాశ్రయ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం 

రైతుల త్యాగాన్ని గాలి కొదిలేసిన వైసీపీ సర్కార్‌ 

నత్తనడకన ఇంటిగ్రేటెడ్‌ బిల్డింగ్‌ పనులు

ఇప్పటి వరకు 30 శాతం మాత్రమే పనులు పూర్తి 

అమరావతి రాజధాని ఏర్పాటుతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నవ్యాంధ్రకే తలమానికంగా మారింది. రాష్ట్రంలోనే అతి పెద్ద రన్‌వే విమానాశ్రయంగా నిలిచింది. ఎంతో ఘనత సాధించిన విమానాశ్రయం నేడు.. ఆ ప్రభను కోల్పోయింది. రాజధాని విధ్వంసంతో రాకపోకలు తగ్గాయి. ప్రయాణాలు తగ్గాయి. సర్వీసులు తగ్గిపోయాయి. ఓవరాల్‌గా విజయవాడ ఎయిర్‌పోర్టు అభివృద్ధే మసక బారిపోయింది. అంతర్జాతీయ విమానాశ్రయంగా దేశంలోనే వెలుగు వెలగాల్సిన విజయవాడ ఎయిర్‌పోర్టు నేడు దీనస్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

ఆంధ్రజ్యోతి, విజయవాడ :

విజయవాడ విమానాశ్రయం రాజఽధానికి తలమానికంగా ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం రైతులను ఒప్పించి అమరావతిలో ప్యాకేజీ కల్పిస్తామని హామీ ఇచ్చి 700 ఎకరాలు సేకరించి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియాకు అప్పగించింది.   విమానాశ్రయంలో రూ.1000 కోట్ల మేర అభివృద్ధి పనులకు బీజం పడింది. భూములు సేకరించటం ద్వారానే ఇదంతా జరిగింది. మరి ఇప్పుడు చూస్తే.. ఎయిర్‌పోర్టు అభివృద్ధికి భూములిచ్చిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారికి నాలుగు విడతలుగా కౌలు లేదు. ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం లేదు. ఇళ్లు కట్టుకోవటానికి డబ్బులు ఇస్తామని ఇచ్చిన జీవోను కూడా తూచ్‌ అన్నారు. నిర్వాసితులకు అద్దె బకాయిలు చెల్లించలేదు. ఇళ్ల సంగతి దేవుడెరుగు ఆఖరికి నిర్వాసితులకు రిజిస్ర్టేషన్‌ డాక్యుమెంట్లను కూడా ఇవ్వలేదు. వైసీపీ ప్రభుత్వం విమానాశ్రయ అభివృద్ధికి కారకులైన రైతులపై పగ పట్టింది. రైతులు భూములు కోల్పోయి.. ప్యాకేజీలు అందక.. నానా ఇబ్బందులు పడుతున్నారు. పోనీ భూములు తీసుకుందామంటే.. ఆ భూములలో నిర్మాణాలు ఉన్నాయి. ఏం చేయాలో పాలుపోక.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక రైతులు కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. రైతులు, నిర్వాసితులే కాకుండా.. ప్రైవేటు రియల్‌ వెంచర్లలో ప్లాట్లు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. వారికి ప్లాట్‌ టు ప్లాట్‌ ఇవ్వాల్సి ఉండగా.. దానిని కూడా వైసీపీ సర్కార్‌ గాలికొదిలేసింది. 

నత్తనడకన ఇంటి గ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులు

దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దేశంలోని మెట్రోపాలిటన్‌ ఎయిర్‌పోర్టుల తరహాలో అత్యద్భుతమైన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ పూర్తి కాలేక అపసోపాలు పడుతోంది. పనులు నత్తనడకగా సాగుతున్నాయి. ఈ సెప్టెంబరు నెలలోనే బిల్డింగ్‌ పూర్తి కావటానికి 24 నెలల గడువు ముగుస్తోంది. ఇప్పటి వరకు క్షేత్ర స్థాయిలో పనులు చూస్తే అత్యంత దారుణంగా ఉన్నాయి. ఫిజికల్‌గా 30 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. అదే  పైనాన్షియల్‌గా చూస్తే 18 శాతం మేర మాత్రమే పురోగతి ఉంది. చేసిన పనులకు బిల్లులు కూడా రాని రాలేదు.  కాంట్రాక్టు సంస్థ .. సొంతగా డబ్బులు ఖర్చు చేసే పరిస్థితిలో లేదు. కేంద్రం బిల్లులు ఇస్తే వాటితోనే పనులు చేపడుతోంది. దీంతో పనులలో అంతులేని తాత్సారం, జాప్యం నడుస్తోంది. రూ. 411 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులను ప్రారంభించింది.  పనులకు రూ. 71 కోట్ల మేర మాత్రమే కాంట్రాక్టు సంస్థకు బిల్లులు వచ్చాయి.   ఆర్థిక  స్థోమత లేని కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించటం ఒక ఎత్తు అయితే.. ఆ సంస్థ మీద పర్యవేక్షణ చేయకపోవటం కూడా పనుల్లో తీవ్ర జాప్యానికి కారణమైంది. బిల్డింగ్‌ పనులను వైసీపీ సర్కార్‌ గాలి కొదిలేసింది. మరోవైపు విమాన సర్వీసుల విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించటం లేదు. 

పడిపోయిన విమాన సర్వీసులు

అమరావతి వైభవంగా ఉన్న రోజుల్లో ప్రతి ఏడాదీ విజయవాడ విమానాశ్రయం రికార్డులను సాధించేంది. తొలిసారిగా ఒక ఏడాదిలో పది లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించిన  విమానాశ్రయంగా మిలియన్‌ మార్క్‌ను సాధించింది. ఆ రోజుల్లో మొత్తం 58 విమాన సర్వీసులు ఉండేవి. ప్రస్తుతం విమాన సర్వీసులు 18 కూడా లేవు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలకు విమానాలు తగ్గిపోయాయి. ముంబాయి విమానం రద్దు అయింది. వారణాసి విమానం కూడా రద్దు అయింది. 


Read more