‘బై.. బై.. విజయవాడ.’

ABN , First Publish Date - 2022-10-05T06:15:38+05:30 IST

‘బై.. బై.. విజయవాడ.’

‘బై.. బై.. విజయవాడ.’

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన కాసేపటికే ముగ్గురు యువకులు దుర్మరణం

మరో ముగ్గురు గల్లంతు

బాపట్ల బీచ్‌ ప్రమాదంలో విషాదం

అందరూ అజిత్‌సింగ్‌నగర్‌ వాసులే..

దుర్గమ్మ దర్శనానికి అని ఇంట్లో చెప్పి..

ఇద్దరు యువకులు సురక్షితం


‘బై.. బై.. విజయవాడ.’ బాపట్ల సముద్ర విహారయాత్రకు వెళ్లిన యువకులు ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన చివరి పోస్ట్‌ ఇది. సరదా కోసం కొద్దిగంటల పాటు విజయవాడకు వీడ్కోలు చెప్పాలనుకున్న ఆ యువకులు శాశ్వతంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఉన్న ఊరికే కాదు.. కన్న వారికీ దూరమై విషాదాన్ని మిగిల్చారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో ముగ్గురు గల్లంతు కావడంతో అజిత్‌సింగ్‌నర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి.


విజయవాడ/అజిత్‌సింగ్‌నగర్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : బాపట్లలోని సూర్యలంక బీచ్‌లో మంగళవారం జరిగిన ప్రమాదంలో అజిత్‌సింగ్‌నగర్‌ సమీపంలోని శాంతినగర్‌కు చెందిన ముగ్గురు యువకులు మరణించారు. బాజం అభిలాష్‌ (17), చింతల సాయిప్రదీప్‌ అలియాస్‌ సిద్ధు (19), చెరుకూరి సాయిమధు (15), సర్వశుద్ధి వెంకట ఫణికుమార్‌ (14), ప్రభుదాసు, నల్లపు రాఘవ (17), చందాల కైలాష్‌ (11), వసంత పరిశుద్ధలో అభిలాష్‌, సాయిమధు, సాయిప్రదీప్‌ మరణించగా, రాఘవ, ప్రభుదాసు, ఫణికుమార్‌ గల్లంతయ్యారు. వీరిలో అభిలాష్‌ పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. తండ్రి ఏసురత్నం బీరువాల తయారీ కంపెనీలో కార్మికుడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండటంతో అభిలాష్‌ వాటర్‌ప్లాంట్‌లో పనిచేస్తున్నాడు. చెరుకూరి సాయిమధు అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎంకే బేగ్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. తండ్రి అంజయ్య కత్తులకు సాన పెడుతుంటాడు. సాయిప్రదీప్‌ గుడ్లవల్లేరులోని పాలిటెక్నిక్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి రమేశ్‌ కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్‌లో గుమస్తా. వల్లపు రాఘవ సత్యనారాయణ పురంలోని ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి సూరి ప్రైవేట్‌ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డు. ప్రభుదాసు పదో తరగతి ఉత్తీర్ణత సాధించలేదు. ప్రస్తుతం క్యాటరింగ్‌ సప్లయర్‌గా చేస్తున్నాడు. తండ్రి వెంకటేశ్వరరావు డోర్‌మ్యాట్ల వ్యాపారి. ఫణికుమార్‌ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తండ్రి శ్రీను చెప్పుల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. 

ఇంట్లో అబద్ధం చెప్పి..

వీరంతా దగ్గరి ప్రాంతాలవారు కావడంతో దసరా సెలవులకు విహారయాత్రకు వెళ్లాలని ప్రణాళికలు వేసుకున్నారు. బాపట్లలోని సూర్యలంక సముద్ర తీరానికి వెళ్లి సరదాగా గడపాలనుకున్నారు. తల్లిదండ్రులు అంగీకరించరని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నామని చెప్పారు. ఫణికుమార్‌ మాత్రం పెళ్లికి వెళ్తున్నానని చెప్పాడు. వీరంతా మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు ఆటోలో వన్‌టౌన్‌లోని వినాయకుడి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ విఘ్నేశ్వరుడిని దర్శించుకుని పక్కనే ఉన్న రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. అక్కడి నుంచి పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో బాపట్లకు చేరుకున్నారు. రైలు విజయవాడ స్టేషన్‌ దాటుతుండగా, కొంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు, ఫొటోలు పోస్ట్‌ చేశారు. బై..బై.. విజయవాడ, గో టూ సూర్యలంక బీచ్‌ అని పోస్ట్‌ చేశారు.

కానిస్టేబుల్‌ వారించినా వినకుండా..

సూర్యలంక బీచ్‌కు చేరుకోగానే అంతా కలిసి సముద్రంలోకి దిగాలనుకున్నారు. అక్కడే ఉన్న కానిస్టేబుల్‌ లోపలకు వెళ్లొద్దని వారించాడు. సముద్రంలోకి వెళ్తే స్టేషన్‌లో కూర్చోబెడతానని హెచ్చరించాడు. అయినా ఖాతరు చేయలేదు. కాసేపు తీరంలో అటూ ఇటూ తిరిగి సముద్రంలోకి దిగారు. మొదట కైలాష్‌ను కెరటం లోపలకు లాక్కెళ్లింది. ఎలాగోలా ఒడ్డున పడి ప్రాణాలు నిలుపుకొన్నాడు. పరిశుద్ధ మాత్రం నీళ్లలోకి వెళ్లకుండా ఒడ్డున నిలబడ్డాడు. అభిలాష్‌, రాఘవ, సాయిమధు, ఫణికుమార్‌, సాయిప్రదీప్‌, ప్రభుదాసు నీళ్లలోకి దిగారు. ఒక దశ దాటి లోపలకు వెళ్లడంతో కెరటాలు లాక్కెళ్లిపోయాయి. ఏసురత్నం, సాయిమధు, సాయిప్రదీప్‌ మృతదేహాలకు బాపట్ల ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. మంగళవారం రాత్రి విజయవాడకు పంపారు. Read more