పదిలో ‘పది’

ABN , First Publish Date - 2022-06-07T06:31:15+05:30 IST

పదిలో ‘పది’

పదిలో ‘పది’

రాష్ట్రంలో పదో స్థానానికి పడిపోయిన ఉమ్మడి జిల్లా

పది పరీక్షా ఫలితాల్లో నిరాశ

ఉత్తీర్ణతా శాతం 65.21

గతంతో పోలిస్తే 30 శాతం డౌన్‌

బాలికలదే పైచేయి

రెండేళ్లుగా ఆల్‌పాస్‌తో తిరగబడిన ఫలితాలు

భారీగా పడిన కరోనా ప్రభావం


ఉమ్మడి జిల్లాలో ‘పది’ పరీక్షా ఫలితాలు నిరాశ పరిచాయి. గత ఫలితాలతో పోలిస్తే 30 శాతం వరకూ తగ్గి రాష్ట్రంలో పదో స్థానానికి పడిపోయాయి. కరోనా, ఓమైక్రాన్‌ కారణంగా తరగతులు సరిగ్గా జరగకపోవడం, పనిదినాల సంఖ్యను తగ్గించడం, సిలబస్‌ను కుదించడం, బిట్‌ పేపరును తొలగించడం వంటి కారణాలు ఫలితాలపై ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా గతంలో వరుసగా 95.85, 93.96 శాతాలు సాధించిన జిల్లా ఈసారి 65.21 శాతానికి దిగిపోయింది.


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : పది ఫలితాల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా రాష్ట్రంలో పదో స్థానానికే పరిమితమైంది. రెండేళ్లుగా కొవిడ్‌-19 విపత్తు కారణంగా తరగతులు సక్రమంగా జరగకపోవడం, విద్యార్థులు చదువుకు దూరం కావడంతో ఈ ఏడాది ఫలితాల్లో విద్యార్థులు వెనకబడ్డారు. గడిచిన విద్యా సంవత్సరంలో తరగతులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కరోనా, ఒమైక్రాన్‌ నేపథ్యంలో తరగతులు భయంభయంగానే గడిచాయి. అంతేకాదు.. పాఠశాలల పనిదినాల సంఖ్య కూడా తగ్గింది. అందుకు అనుగుణంగానే సిలబస్‌ను కూడా కుదించారు. 2020-21 విద్యా సంవత్సరంలో 9వ తరగతి విద్యార్థులకు కేవలం 120 రోజులే తరగతులు నిర్వహించారు. రెండేళ్లుగా పాఠశాలలు సక్రమంగా జరగకపోవడం, కరోనా భయం వెంటాడటం, ఈసారి జరిగిన పరీక్షల్లో 25 మార్కులకు సంబంధించిన బిట్‌ పేపర్‌ లేకపోవడం పది ఫలితాలపై ప్రభావాన్ని చూపిందని కూడా అంటున్నారు. 

35 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత

పదో తరగతి ఫలితాల వివరాలను డీఈవో తాహెరా సుల్తానా సోమవారం తన కార్యాలయంలో వెల్లడించారు. ఈ ఏడాది ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి పదో తరగతి పరీక్షలకు 54,666 మంది హాజరు కాగా, వీరిలో 28,319 మంది బాలురు, 26,347 మంది బాలికలు. 17,509 (61.82 శాతం) మంది బాలురు, 18,138 (68.84 శాతం) బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతా శాతం 65.21గా నమోదైంది. బాలురు 10,810 మంది, బాలికలు 8,209 మంది కలిపి మొత్తం 19,010 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు. మొదటి డివిజన్‌లో 28,207 మంది, రెండో డివిజన్‌లో 5,533 మంది, మూడో డివిజన్‌లో 1,907 మంది ఉత్తీర్ణత పొందారు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో ఐదోస్థానం,  ద్వితీయ శ్రేణిలో ఆరోస్థానం, తృతీయ శ్రేణిలో ఏడోస్థానంలో ఉమ్మడి జిల్లా నిలిచింది. 35 పాఠశాలలు నూరుశాతం ఉత్తీర్ణత సాధించాయి. 

ఫలితాలు ఇలా..

జిల్లాలో ఆయా పాఠశాలల యాజమాన్యాలకు సంబంధించి పదో తరగతి ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా పరిషత్‌ పాఠశాల నుంచి 20,134 మంది హాజరు కాగా, 9,383 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతా శాతం 46.60గా ఉంది. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల నుంచి 991 మంది హాజరు కాగా, 488 మంది ఉత్తీర్ణత సాధించారు. 48.19 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మునిసిపల్‌ పాఠశాలల నుంచి 3,844 మంది పరీక్షకు హాజరు కాగా, 1,786 మంది ఉత్తీర్ణులయ్యారు. 49.01 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఎయిడెడ్‌ పాఠశాలల నుంచి 2,127 మంది హాజరు కాగా, 1,104 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.09 ఉత్తీర్ణతా శాతం నమోదైంది. మైనారిటీ పాఠశాలల నుంచి 181 మంది పరీక్షకు హాజరు కాగా, 131 మంది ఉత్తీర్ణులయ్యారు. 73.96 శాతం ఉత్తీర్ణత సాధించారు. కేజీబీవీ పాఠశాలల నుంచి 108 మంది పరీక్షకు హాజరు కాగా, 59 మంది ఉత్తీర్ణులయ్యారు. 54.63 ఉత్తీర్ణతా శాతం నమోదైంది. ఏపీ గురుకుల పాఠశాలల నుంచి 286 మంది హాజరు కాగా, 258 మంది ఉత్తీర్ణులయ్యారు. 90.21 ఉత్తీర్ణతా శాతం నమోదైంది. సాంఘిక సంక్షేమ శాఖ వసతీ గృహాల నుంచి 1,069 మంది హాజరు కాగా, 662 మంది ఉత్తీర్ణులయ్యారు. 61.93 ఉత్తీర్ణతా శాతం నమోదైంది. బీసీ సంక్షేమ శాఖ వసతీ గృహాల నుంచి 186 మంది హాజరు కాగా, 102 మంది ఉత్తీర్ణులయ్యారు. 58.75 ఉత్తీర్ణతా శాతం నమోదైంది. గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల నుంచి 257 మంది హాజరు కాగా, 151 మంది ఉత్తీర్ణులయ్యారు. 58.75 ఉత్తీర్ణతా శాతం నమోదైంది. ప్రైవేట్‌ విద్యాసంస్థల నుంచి 25,678 మంది హాజరు కాగా, 21,613 మంది ఉత్తీర్ణులయ్యారు. 83.95 ఉత్తీర్ణతా శాతం నమోదైంది. 

30 శాతం తేడా..

2017-18లో 95.85 శాతం, 2018-19లో 93.96 శాతంగా ఉన్న జిల్లా పదో తరగతి ఉత్తీర్ణతా శాతం 2021-22లో 65.21 శాతానికి తగ్గిపోయింది. గతంలో రాష్ట్రంలో తొమ్మిదో స్థానంలో ఉన్న జిల్లా ఇప్పుడు పదో స్థానానికి తగ్గింది. సుమారు 30 శాతం మేర ఫలితాల్లో తేడా కనిపించింది. 2019-20, 2020-21లో కొవిడ్‌-19 కారణంగా పరీక్షలు జరపకుండా ఆల్‌పాస్‌ చేయడంతో  100 శాతం మేర ఉత్తీర్ణత నమోదైంది. 

20లోపు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించాలి

పది సప్లిమెంటరీ పరీక్షలు జూలై 6 నుంచి 15వ తేదీ వరకు జరుగుతాయని డీఈవో తెలిపారు. ఫీజు ఈనెల 7 నుంచి 20వ తేదీలోగా ఎలాంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించాల్సి ఉంటుందన్నారు. జవాబు పత్రాలను రీకౌంటింగ్‌ చేయించుకునేవారు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఈనెల 20వ తేదీలోపు చెల్లించాలని, జవాబు పత్రాల రీవెరిఫికేషన్‌ చేయించుకునేవారు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చొప్పున సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా చెల్లించి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో హాల్‌ టికెట్‌పై సంతకం చేయించుకుని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. డీడీలు, నగదు చెల్లింపులు అంగీకరించబోవని ఆమె పేర్కొన్నారు. పది మార్కుల మెమోలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల లాగిన్‌లో, డీజీఈ వెబ్‌సైటులో ఉంచామని చెప్పారు. రెండు రోజుల్లో మైగ్రేషన్‌ సర్టిఫికెట్లను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల లాగిన్‌లో ఉంచుతామని, హెచ్‌ఎంలు కలర్‌ ప్రింట్‌ తీసి ఇస్తారని డీఈవో తెలిపారు.
Read more