Indrakiladri: దుర్గమ్మ తెప్పోత్సవం రద్దు

ABN , First Publish Date - 2022-10-04T02:02:08+05:30 IST

శరన్నవరాత్రులు ముగింపులో దసరా రోజున దుర్గామల్లేశ్వరస్వామికి నిర్వహించే తెప్పోత్సవాన్ని రద్దు చేశారు.

Indrakiladri: దుర్గమ్మ తెప్పోత్సవం రద్దు

విజయవాడ: శరన్నవరాత్రులు ముగింపులో దసరా రోజున దుర్గామల్లేశ్వరస్వామికి నిర్వహించే తెప్పోత్సవాన్ని రద్దు చేశారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్‌ (Prakasam Barrage)కి ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దసరా రోజున శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి కృష్ణానది (Krishna River)లో హంస వాహనంపై విహరింపచేస్తారు. దసరాకు రెండు రోజుల ముందు ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తారు. వాస్తవానికి సోమవారం ఈ ట్రయల్‌ రన్‌ జరగాల్సి ఉంది. గడచిన నెల రోజులుగా ప్రకాశం బ్యారేజ్‌కి ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి లక్ష  క్యూసెక్కుల వరకు నీరు వస్తోంది.


తెప్సోత్సవంలో జలవనరుల శాఖదే కీలక పాత్ర. ఆ శాఖ నిరభ్యంతర ధ్రువీకరణపత్రం ఇస్తేనే తెప్పోత్సవం నిర్వహిస్తారు. సోమవారం ఇన్‌ఫ్లో ఏమాత్రం తగ్గకపోవడంతో నిరభ్యంతర ధ్రువీకరణపత్రం ఇవ్వలేమని జలవనరుల శాఖ అధికారులు తేల్చి చెప్పారు. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద సాధారణ పరిస్థితి ఉండాలంటే పులిచింతల గేట్లను రెండు రోజులకు ముందుగానే మూసివేయాల్సి ఉంది. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టుకూ ఎగువ నుంచి నీరు వస్తున్నందున ఇది సాధ్యం కాదని తేలిపోయింది. ఈ పరిస్థితుల మధ్య తెప్పోత్సవం నిర్వహించడం కష్టమన్న నిర్ణయానికి ఉత్సవాల సమన్వయ కమిటీ వచ్చింది. గడచిన ఏడాది దసరాకు ప్రకాశం బ్యారేజ్‌కి ఇన్‌ఫ్లో భారీగా ఉండడంతో తెప్పోత్సవాన్ని రద్దు చేశారు.

Updated Date - 2022-10-04T02:02:08+05:30 IST