రాష్ట్రం అప్పులపాలు కావట్లేదు

ABN , First Publish Date - 2022-05-18T09:07:42+05:30 IST

రాష్ట్రం అప్పులపాలు కావట్లేదు

రాష్ట్రం అప్పులపాలు కావట్లేదు

రుణం తీసుకోకుండా ఏ రాష్ట్రమూ ముందుకెళ్లడం లేదు

ఉపముఖ్యమంత్రి కొట్టు


అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రం ఏమీ అప్పులపాలు కావట్లేదు. దేశంలో ఏ రాష్ట్రం అప్పులు చేయకుండా ముందుకెళ్లట్లేదు. కావాలంటే రికార్డు చూసుకోండి. జగన్‌ పాలన, ప్రభుత్వ పాలసీపై ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు మాత్రమే అసహనంతో ఉన్నారు’’ అని ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మంగళవారం అమరావతి సచివాలయంలో తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘ప్రభుత్వంపై ఇంత సంతృప్తి అనేది గతంలో ఎన్నడూ లేదు. మూడేళ్ల తర్వాత ప్రజల్లోకి వెళ్లి మా ప్రభుత్వం ఎలా ఉందని అడిగే దమ్ము, ధైర్యం ఎవరికుండేది? జగన్‌ ఎక్కడికెళ్లినా ప్రజలు ఆదరిస్తుంటే.. ఒకట్రెండు పేపర్లలో ఏదో రాసుకుంటున్నాయి. అప్పుల చేస్తున్నామంటున్న నాయకులు.. తాము అధికారంలోకి వస్తే, ఈ పథకాలు రద్దు చేస్తామని చెప్పి ప్రజల్లోకి వెళ్లమనండి’’ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం రూ.7 లక్షలు అందిందని తేల్చి చెప్పారు. చంద్రబాబు ఏది చెప్తే అది చెప్పడానికి వచ్చినవాడికి వాస్తవాలు తెలియవని ఎద్దేవా చేశారు. ఈ పథకాలన్నీ ఉండటం వల్లే రాష్ట్రం అప్పుల పాలవుతోందని పవన్‌ కానీ, చంద్రబాబు కానీ చెప్పదలుచుకుంటే చెప్పాలంటూ సవాల్‌ చేశారు.  సంక్షేమ పథకాల రద్దే మీ పాలసీనా అంటూ ప్రశ్నించారు.  

Read more