వీళ్లు చేసిన నేరమేమిటో..?

ABN , First Publish Date - 2022-08-02T04:28:11+05:30 IST

జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులను జూలై మొదటి వారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్‌ (ప్రొబెషనరీ పీరియడ్‌ డిక్లేర్‌) చేస్తోంది.

వీళ్లు చేసిన నేరమేమిటో..?
డెవల్‌పమెంట్‌ ఏవో మనోహర్‌రాజుతో తమ ప్రొబెషనరీ పీరియడ్‌ గురించి మాట్లాడుతున్న సచివాలయ ఉద్యోగులు (ఫైల్‌)

ప్రొబెషనరీ పీరియడ్‌ డిక్లేర్‌ చేయని ప్రభుత్వం

34 మంది ఎదురుచూపు

ఆందోళన చేశారనే కక్ష సాధింపా..?


(రాయచోటి - ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులను జూలై మొదటి వారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్‌ (ప్రొబెషనరీ పీరియడ్‌ డిక్లేర్‌) చేస్తోంది. శాఖల వారీగా రెగ్యులర్‌ చేస్తూ వస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలోని దాదాపు అందరు సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్‌ చేశారు. అయితే ఇంకా 34 మందిని చేయలేదు. దీనిపైన మేం చేసిన నేరమేంటని ఆ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొబెషనరీ పీరియడ్‌ చేసి వేతనాలు పెంచాలని, ఈ ఏడాది జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఈ ఆందోళన తమకు వ్యతిరేకంగా అని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆందోళనలో చురుకుగా పాల్గొన్నారనే నెపంతో రెండేళ్లకు పైగా సర్వీసు పూర్తయినా రెగ్యులర్‌ చేయకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వాపోతున్నారు. తమ సమస్యలు చెప్పుకోవడం.. ప్రశ్నించడం నేరమేనా? అని ఆవేదన చెందుతున్నారు. 


34 మందికి మొండిచేయి

రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలందించేందుకు ప్రతి సచివాలయంలోనూ సుమారు 22 శాఖలకు ఉద్యోగులను నియమించింది. పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్‌-2), డిజిటల్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌, విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్‌, విలేజ్‌ వెటర్నరీ అసిస్టెంట్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, విలేజ్‌/వార్డు రెవెన్యూ ఆఫీసర్‌, విలేజ్‌ సర్వేయర్‌ అసిస్టెంట్‌, సెరికల్చర్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌-2), వార్డు శానిటేషన్‌/ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ (గ్రేడ్‌-2), వార్డు ప్లానింగ్‌  అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీ (గ్రేడ్‌-2), వార్డు ఎడ్యుకేషన్‌, డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్‌, డెవల్‌పమెంట్‌ సెక్రటరీ (గ్రేడ్‌-2), వార్డు అమినిటీస్‌ సెక్రటరీ, మహిళా పోలీసు/వార్డు ఉమెన్‌, వీకర్‌ సెక్షన్‌ ప్రొటెక్షన్‌ సెక్రటరీ (మహిళ), ఎనర్జీ అసిస్టెంట్‌/వార్డు ఎనర్జీ సెక్రటరీ,  ఏఎన్‌ఎం/వార్డు హెల్త్‌ సెక్రటరీ పోస్టులను భర్తీ చేసింది. రెండేళ్ల సర్వీసుతో ప్రొబెషనరీ పీరియడ్‌ పూర్తయ్యేటట్లు నిర్ణయించింది. ఈ లెక్కన 2021 అక్టోబరు నాటికి ప్రొబెషనరీ పీరియడ్‌ పూర్తి కావాలి. 2022 జనవరి వరకు ప్రభుత్వం ఈ ఊసే ఎత్తలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల ఉద్యోగులు ఒకసారిగా ఆందోళన బాట పట్టారు. సచివాలయాల వాట్సప్‌ గ్రూపుల నుంచి బయటకు వచ్చేశారు. తమను వెంటనే రెగ్యులర్‌ చేయాలని, వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రప్రభుత్వం సామదాన దండోపాయాలు ప్రయోగించడంతో.. రోజుల వ్యవధిలోనే సచివాలయాల ఆందోళన ముగిసిపోయింది. జూలై నాటికి ప్రొబెషనరీ పీరియడ్‌ పూర్తి చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. తర్వాత ప్రభుత్వం ప్రొబెషనరీ పీరియడ్‌ డిక్లేర్‌ కోసం కూడా శాఖాపరంగా పరీక్షలు నిర్వహించింది. అందులో దాదాపుగా అందరూ ఉత్తీర్ణత సాఽధించారు. జూలై మొదటి వారం నుంచీ రాష్ట్ర ప్రభుత్వం ప్రొబెషనరీ పీరియడ్‌ డిక్లేర్‌ చేస్తోంది. 


వాళ్లపైన కక్ష సాధింపేనా ? 

అన్నమయ్య జిల్లాలో మొత్తం 3227 మందికి (రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు 1556), (మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె 1671) ఇప్పటికి ప్రొబెషనరీ పీరియడ్‌ను ప్రకటించారు. ఇంకా 34 మందికి ప్రకటించాల్సి ఉంది. (ఇందులో మెటర్నటీ లీవ్‌, ఇతర అనారోగ్య కారణాలతో రెండేళ్లు సర్వీసు పూర్తి చేయని వాళ్లు కూడా ఉన్నారు.) విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు 9 మంది, సెరికల్చర్‌ అసిస్టెంట్లు 2, వార్డు శానిటేషన్‌/ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ-5, వార్డు ప్లానింగ్‌/రెగ్యులేషన్‌ సెక్రటరీ (గ్రేడ్‌-2) 3, వార్డు ఎడ్యుకేషన్‌, డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ 3, వార్డు వెల్ఫేర్‌, డెవల్‌పమెంట్‌ సెక్రటరీ ( గ్రేడ్‌-2) 5,  వార్డు అమినిటీస్‌ సెక్రటరీ నలుగురికి ప్రొబెషనరీ పీరియడ్‌ డిక్లేర్‌ చేయలేదు. రాయచోటి మండలంలోని పెమ్మాడపల్లెలో ఇద్దరు, దిగువఅబ్బవరంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ మినహా మిగిలిన వారికి ఇంకా ప్రొబెషనరీ పీరియడ్‌ ప్రకటించలేదు. జనవరిలో జరిగిన ఆందోళనా కార్యక్రమాలలో తొలుత వాట్సప్‌ గ్రూపుల నుంచి బయటకు వచ్చిన వాళ్లు. మిగిలిన ఉద్యోగులను ఐక్యం చేయాలని చూసిన వాళ్లపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. తమకు ప్రొబెషనరీ పీరియడ్‌ ప్రకటించాలని గత వారంలో కొందరు సచివాలయ ఉద్యోగులు కలెక్టరేట్‌లోని గ్రామ సచివాలయాల ఏవోను కలిసి వినతిపత్రం ఇచ్చారు. తన చేతిలో ఏమీ లేదని, ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకెళతానని ఆయన తెలిపారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో తమను కూడా రెగ్యులర్‌ చేయాలని పలువురు కోరుతున్నారు. 


కక్ష సాధింపు కాదు

- మనోహర్‌రాజు, డెవల్‌పమెంట్‌ ఏవో

ఇంకా జిల్లాలో 34 మందికి ప్రొబెషనరీ పీరియడ్‌ డిక్లేర్‌ చేయాల్సి ఉంది. అందులో కొందరు మెటర్నిటీ లీవు, ఇంకా కొందరు అనారోగ్య కారణాలతో రెండేళ్ల సర్వీసు పూర్తి కాని వాళ్లు ఉన్నారు. జనవరిలో ఆందోళన చేశారని, వాళ్లపై కక్ష సాధింపుగా రెగ్యులర్‌ చేయడం లేదనేది నిజం కాదు. 

Updated Date - 2022-08-02T04:28:11+05:30 IST