మాబడే కావాలి...

ABN , First Publish Date - 2022-07-07T05:30:00+05:30 IST

ఊరికి దగ్గరలో ఉన్న పాఠశాలల విద్యార్థులను తీసుకెళ్లి దూరంగా ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నారు.

మాబడే కావాలి...
పీలేరులోని యల్లమంద క్రాస్‌లో రోడ్డుపై బైఠాయించిన మహిళలు

పాఠశాలల విలీనంపై రోడ్డెక్కిన విద్యార్థులు, తల్లిదండ్రులు

పాఠశాలలు యధావిధిగా ఉంచాలని డిమాండ్‌ 


ఊరికి దగ్గరలో ఉన్న పాఠశాలల విద్యార్థులను తీసుకెళ్లి దూరంగా ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నారు. చిన్న పిల్లలు ఎంతో దూరంగా ఉన్న పాఠశాలలకు ఎలా వెళతారని ప్రశ్నిస్తున్నారు. పాఠశాలల విలీనాన్ని నిరసిస్తూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు గురువారం రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. తమ పిల్లలను ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లోనే ఉంచాలని లేకుంటే బడికి పంపకుండా ఇంటివద్దే ఉంచుకుంటామని తెగేసి చెబుతున్నారు. 


పీలేరులో రోడ్డుపై బైఠాయింపు...

పీలేరు, జూలై 7: తమ ప్రాంత పాఠశాలను వేరే పాఠశాలలో విలీనం చేయడంపై పీలేరు పట్టణం కావలిపల్లెకు చెందిన మహిళలు గురువారం రోడ్డుపై బైఠాయించారు. పీలేరు పట్టణం కావలిపల్లెలోని ప్రాథమిక పాఠశాలలో 250 మంది పిల్లలుండగా 8 మంది టీచర్లు పనిచేస్తున్నారు. స్కూళ్ల రేషనలైజేషన్‌లో భాగంగా ప్రాథమిక పాఠశాలను పక్కనే ఉన్న కోటపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. ఈ విషయం గురువారం ఉదయం బహిర్గతం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహించారు. ప్రాథమిక దశలో ఉన్న తమ పిల్లలు ఉన్నత పాఠశాల పిల్లలతో ఎలా కలిసి ఉండగలరని, అది వారి చదువుపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పాఠశాలను మూసివేయకుండా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ వారు పీలేరు-తలపుల మార్గంపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ తిప్పేస్వామి, ఎంఈవో బాలాజీనాయక్‌ అక్కడకు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారిని శాంతింపజేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలపడంతో వారు శాంతించి ఇళ్లకు వెళ్లారు. 


సిద్దవటంలో విద్యార్థుల ఆందోళన 

సిద్దవటం, జూలై 7 : మండల కేంద్రమైన సిద్దవటం ఎంఆర్‌సీ ఎదుట గురువారం ఉదయం దిగువపేట ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు ఆందోళన చేశారు. జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో విలీనంపై పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ మా పిల్లలు దిగువపేట స్కూల్‌లో ఉండేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని, జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో విలీనం చేస్తే మా పిల్లలకు ఏమైనా రోడ్డు ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నించారు. అభం శుభం తెలియని విద్యార్థులను జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో విలీనం చేయడం అన్యాయమన్నారు. ప్రాథమిక పాఠశాలలు నాడు-నేడు కింద అభివృద్ధి చేసి ఈరోజు ఉన్న ఫలంగా జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో విలీనం చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులు ఎంఈవో కార్యాలయంలోని కో-ఆర్డినేటర్‌ గౌతమికి వినతిపత్రం అందచేశారు.


నిమ్మనపల్లెలో...

నిమ్మనపల్లె, జూలై 7: ఉన్న పాఠశాలను మరో పాఠశాలలో విలీనం చేయరాదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం రోడ్డుపై బైఠాయించారు. మండలంలోని ముష్టూరు పంచాయతీ దిగువపల్లె ప్రాఽథమిక పాఠశాలలో చదివే విద్యార్థులు ఒక కిలోమీటర్‌ పరిధిలో ఉండడంతో ప్రభుత్వం ఈ పాఠశాలను విలీనం చేసింది. ఈ నిర ్ణయంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఇదే పాఠశాలలో ఉండాలంటూ రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా  విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇంతకాలం 1 నుంచి 5వ తరగతి వరకు ఉండేదని ఇప్పుడు కొత్తగా కిలోమీటరు పరిధిలోని పిల్లలంతా మరో పాఠశాలకు వెళ్లమనడం సమంజసం కాదన్నారు. 3వ తరగతి చదివే పిల్లలు కాలినడన ఎలా వెళతారని ప్రశ్నించారు. అలాగే తమ పాఠశాలలో 67 మంది విద్యార్థులు ఉండగా 30 మంది పిల్లలను కొమ్మిరెడ్డిగారిపల్లె పాఠశాలకు వెళ్లమనడం అన్యాయమన్నారు. విద్యార్థులకు టీసీ ఇవ్వరాదని అదే జరిగితే పిల్లలను ఇళ్ల వద్దే ఉంచుకుంటామని తెలిపారు. టీడీపీ నాయకులు మునిరత్నం, లక్ష్మన్న, అన్వర్‌బాషా, వెంకటరమణ, విజయ్‌, చినబాబు, రెడ్డిప్రసాద్‌ కూడా ధర్నాలో పాల్గొని గ్రామస్తులకు మద్దతు తెలిపారు. దీంతో స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.   Read more