అప్రకటిత కర్ఫ్యూ

ABN , First Publish Date - 2022-10-01T07:18:25+05:30 IST

ప్రొద్దుటూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం వందలాది మంది పోలీసుల పహారాలో జరిగింది. కార్యాలయం చుట్టూ 100 మీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ఉండే దుకాణాలను మూసివేయించారు. మున్సిపల్‌, పోస్టాఫీసు,

అప్రకటిత కర్ఫ్యూ
ప్రొద్దుటూరు మున్సిపల్‌ కార్యాయం గేటు వద్ద పోలీసుల పహారా

పోలీసుల పహారాలో ప్రొద్దుటూరు మున్సిపల్‌ సమావేశం

మీడియానూ అనుమతించని వైనం

కార్యాలయం చుట్టూ 100 మీటర్ల మేర బారికేడ్లు

పరిసరాల్లో దుకాణాల మూసివేత..

ప్రొద్దుటూరు అర్బన్‌, సెప్టెంబరు 30: ప్రొద్దుటూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం వందలాది మంది పోలీసుల పహారాలో జరిగింది.  కార్యాలయం చుట్టూ 100 మీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ఉండే దుకాణాలను మూసివేయించారు. మున్సిపల్‌, పోస్టాఫీసు, టెలికాం కార్యాలాయాలకు ఎవ్వరినీ వెళ్లనివ్వలేదు. దీంతో ప్రొద్దుటూరులో ఒకరకంగా అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. 

ప్రొద్దుటూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం శుక్రవారం ఉదయం 11.30 గంటలకు  చైర్‌పర్సన్‌ భీమునిపల్లె లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగింది. ఇందులో 14 అంశాల అజెండాపై చర్చించి ఆమోదించాల్సి ఉంది. అజెండాలో పెద్దగా ప్రాధాన్యత గల అంశాలు లేకున్నా ఏఎస్పీ ప్రేర్ణ కుమార్‌ నేతృత్వంలో ప్రొద్దుటూరు సబ్‌బివిజన్‌ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల నుంచి సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది, స్పెషల్‌ పోలీసులను మొత్తం మున్సిపల్‌ కార్యాలయం చుట్టూ బందోబస్తు పెట్టారు. వంద మీటర్లమేర బారికేడ్లు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో జనసంచారాన్ని అనుమతించలేదు. దుకాణాలు సైతం మూసివేయించారు.ప్రింట్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్‌ మీడియాను ఎవ్వరినీ మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలోనికి కూడా పోనివ్వకుండా రోడ్డుమీదనే అడ్డుకున్నారు. 

కౌన్సిల్‌ మీటింగుకు ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం అయిన ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ ఖాజా, కౌన్సిలర్లు మురళీధర్‌ రెడ్డి, మహమ్మద్‌ గౌస్‌, మునీర్‌ హాజరుకావడం వల్ల ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని పోలీసులు ఈ అత్యుత్సాహం ప్రదర్శించినట్లు పలువురు భావిస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 41 వార్డు కౌన్సిలర్లకు గాను 40 మంది అధికారపార్టీకి చెందిన వారే ఉన్నారు. టీడీపీకి ఒక్క మహిళా కౌన్సిలర్‌ మాత్రమే ఉన్నారు. అయినా మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని వందలాది మంది పోలీసుల పహారాతో జరుపుకోవాల్సి రావడంపై పలువురు ఆశ్చర్యపోతున్నారు.

Read more