వివేకా హత్య కేసులో అలుపెరుగని మలుపులు!

ABN , First Publish Date - 2022-11-30T03:23:02+05:30 IST

సీఎం జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి సౌమ్యుడుగా గుర్తింపు పొందారు. దివంగత వైఎస్‌ అయితే వివేకాను ‘బుద్ధుడు’ అనేవారు.

వివేకా హత్య కేసులో అలుపెరుగని మలుపులు!

(కడప-ఆంధ్రజ్యోతి)

సీఎం జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి సౌమ్యుడుగా గుర్తింపు పొందారు. దివంగత వైఎస్‌ అయితే వివేకాను ‘బుద్ధుడు’ అనేవారు. అలాంటి వ్యక్తి సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు 2019 మార్చి 15న పులివెందులలోని సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. గొడ్డలితో నరికి హత్య చేశారు. వివేకా మరణాన్ని తొలుత గుండెపోటుగా ప్రచారం చేశారు. ముఖ్యంగా సీఎం జగన్‌ సొంత మీడియాలో ఇదే ప్రచారం చేశారు. అయితే బాత్‌రూంలో రక్తపు మడుగులో ఉన్న వివేకా మృతదేహాన్ని వాచ్‌మెన్‌ రంగన్న, పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి లక్ష్మమ్మలు చూశారు. బెడ్‌రూంలో పరిస్థితిని వివేకా స్టెనో ఇనయతుల్లా ఫొటోలు తీసి వివేకా అల్లుడికి పంపించారు. అక్కడి సీన్‌ చూసిన తర్వాత గుండెపోటు కేసును చివరికి హత్యగా నమోదు చేశారు. వివేకా హత్యపై అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవిలకు అంటగడుతూ వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్‌ సొంత మీడియాలో కూడా ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ కథనాలు రాశారు. అయితే, హత్య కేసు నిగ్గు తేల్చడానికి చంద్రబాబు ప్రభుత్వం అప్పటి కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్‌పై తమకు నమ్మకం లేదంటూ అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ కోర్టుకెళ్లారు. ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ బదిలీ అయ్యారు.

ఆయన స్థానంలో వచ్చిన ఎస్పీ అభిషేక్‌ మహంతి ఆఽధ్వర్యంలో మరో సిట్‌ను ఏర్పాటు చేశారు. కేసులో కీలక సాక్షులు, అనుమానితులను విచారించారు. కేసు కొలిక్కి వస్తుందనుకున్న సమయంలో ఎస్పీ మహంతి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. అప్పటికే వైసీపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆయన తర్వాత వచ్చిన ఎస్పీ అన్బురాజన్‌ ఆధ్వర్యంలో మరో సిట్‌ ఏర్పడింది. కానీ, హంతకులెవరో తేల్చలేకపోయింది. హత్య కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో కేసు విచారణ తీరును గమనించి సిట్‌తో న్యాయం జరగదని భావించిన వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతలు సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 2020 మార్చి 11న వివేకా హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ 2020 జూలై 18న విచారణ చేపట్టి, కడప, పులివెందుల ప్రాంతాల్లో 250 మంది అనుమానితులను విచారించింది. ఇలా ఇప్పటికీ వివేకా హత్య కేసులో సూత్ర, పాత్రధారి అరెస్టు కానప్పటికీ ఎన్నో మలుపులు తిరుగుతూ కడప నుంచి హైదరాబాదుకు వెళ్లింది.

Updated Date - 2022-11-30T03:23:02+05:30 IST

Read more