గాలివాన బీభత్సం

ABN , First Publish Date - 2022-06-07T06:33:53+05:30 IST

పులివెందులలో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు 110 హెక్టార్లలో అరటి తోటలు నేలకొరిగాయి. వర్షంతో పాటు పాటు వడగండ్లు పడ్డాయి. పట్టణం, గ్రామాలలో పెద్దపెద్ద వృక్షాలు సైతం ఈదురుగాలులకు విరిగిపోయాయి. ఈదురు గాలుల దెబ్బకు విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం సాయంత్రం 5గంటల వరకు పులివెందుల పట్టణంలో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దాదాపు రూ.23కోట్ల మేర రైతులకు నష్టం వాటిలినట్లు అంచనా వేస్తున్నారు. వివరాలిలా..

గాలివాన బీభత్సం
పులివెందులలో వర్షపు నీటి ఉధృతికి దెబ్బతిన్న దుకాణాల షట్టర్లు

పులివెందులలో 110 హెక్టార్లలో నేలకొరిగిన అరటి

సుమారు రూ.23 కోట్లు నష్టపోయిన రైతన్న

ఈదురు గాలులకు విరిగిపడిన చెట్లు

విద్యుత్‌కు తీవ్ర అంతరాయం 

రూ.20 లక్షల మేర ట్రాన్స్‌కోకు నష్టం 

పులివెందుల, జూన్‌ 6: పులివెందులలో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు 110 హెక్టార్లలో అరటి తోటలు నేలకొరిగాయి. వర్షంతో పాటు పాటు వడగండ్లు పడ్డాయి. పట్టణం, గ్రామాలలో పెద్దపెద్ద వృక్షాలు సైతం ఈదురుగాలులకు విరిగిపోయాయి. ఈదురు గాలుల దెబ్బకు విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం అర్ధరాత్రి  నుంచి సోమవారం సాయంత్రం 5గంటల వరకు పులివెందుల పట్టణంలో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దాదాపు రూ.23కోట్ల మేర రైతులకు నష్టం వాటిలినట్లు అంచనా వేస్తున్నారు. వివరాలిలా..

పులివెందుల నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. పులివెందుల మండలల విషయానికొస్తే గాలివాన బీభత్సం సృష్టించింది. పులివెందుల మండలం మినహా మిగిలిన మండలాల్లో ఈదురుగాలులు పెద్దగా లేకపోయినా వర్షం మాత్రం మోస్తరుగా కురిసింది. పులివెందులలో అరటి తోటలు సాగులో ఉన్నాయి. ఆదివారం రాత్రి వచ్చిన గాలివానతో 110హెక్టార్లలో అరటితోటలు నేలకూలాయి. అలాగే బొప్పాయి, చీనినిమ్మ తదితర ఉద్యాన పంటలు 38 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. దాదాపు రూ.23కోట్ల మేర రైతులకు నష్టం వాటిల్లినట్లు ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు.


వడగండ్ల వానతో..

అరటితోటల్లో పక్వానికి వచ్చిన గెలలు సైతం నేలకొరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అరటి ధరలు రోజురోజుకు పెరుగుతుండడంతో రైతులు ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో ఈ గాలివాన  వీరికి కంటిమీద కునుకులేకుండా చేసింది. గాలివానే కాకుండా వడగండ్లు పడడం అరటి తోటలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. పక్వానికి వచ్చిన గెలలపై వడగండ్లు పడడంతో కాయలపై మచ్చలు ఏర్పడ్డాయి. వీటిని కొనేందుకు వ్యాపారులు సుముఖత చూపరని రైతులు అంటున్నారు. ఈదురుగాలులు అరటి తోటలను ఒకవిధంగా నష్టపరిస్తే వడగండ్ల వాన మరో విధంగా నష్టం చేకూర్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


నేల కూలిన వృక్షాలు

పులివెందుల పట్టణంతో పాటు చుట్టుపక్కల పల్లెల్లో ఈదురుగాలుల దెబ్బకు పెద్దపెద్ద వృక్షాలు సైతం నేలకూలాయి. కొన్నిచోట్ల కొమ్మలు విరిగితే మరికొన్ని చోట్ల వృక్షాలే కూలిపోయాయి. 


దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాలు

ఈదురుగాలుల దెబ్బకు మరోపక్క విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం సాయంత్రం 5గంటల వరకు పులివెందుల పట్టణంలో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. విద్యుత్‌ లైన్లను పరిశీలించి దెబ్బతిన్నవాటిని ఒక్కొక్కటిగా మరమ్మతులు చేసుకుంటూ ఎట్టకేలకు సాయంత్రానికి విద్యుత్‌ను పునరుద్ధరించారు. ఈ ఈదురుగాల దెబ్బకు 114 విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. దీనితో దాదాపు రూ.20లక్షల మేర నష్టం వాటిలినట్లు ట్రాన్స్‌కో అధికారులు అంచనా వేశారు.


దుకాణాల్లోకి వాన నీరు

పులివెందుల పట్టణంలో కురిసిన భారీ వర్షంతో కొన్ని దుకాణాల్లోకి నీరు చేరింది. ప్రధాన రహదారిలో ఉన్న యూనియన్‌ బ్యాంక్‌ సమీపంలో కొన్ని దుకాణాలలోకి వర్షపునీరు చేరడంతో వాటికి వేసిన షట్టర్లు సైతం దెబ్బతిన్నాయి. మూడు రోజులుగా తీవ్ర ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చిందని చెప్పాలి. ఉద్యాన పంటలకు మాత్రం పులివెందుల మండలం మినహా మిగిలిన చోట్ల ఈ వర్షంతో మేలే జరిగిందని రైతులు అంటున్నారు.




Updated Date - 2022-06-07T06:33:53+05:30 IST