టిడ్కో ఇళ్ల రిజిస్ర్టేషన్లు ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-18T04:17:17+05:30 IST

మదనపల్లె మున్సిపాలిటీలో ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు రిజిస్ర్టేషన్లు చేసే ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది.

టిడ్కో ఇళ్ల రిజిస్ర్టేషన్లు ప్రారంభం
లబ్ధిదారులకు రిజిస్ర్టేషన్‌ పత్రాలు అందజేస్తున్న టీపీవో జకీరాఖతూన్‌

మదనపల్లె, ఆగస్టు 17: మదనపల్లె మున్సిపాలిటీలో ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు రిజిస్ర్టేషన్లు చేసే ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. మొదటి రోజు 26 మందికి రిజిస్ర్టేషన్లు చేశారు. టీడీపీ హయాంలో ప్రారంభమైన ఈ బహుళ అంతస్థుల నిర్మాణాలు ప్రారంభించగా, తర్వాత వివిధ కారణాలతో జాప్యమైంది. మూడు విభాగాల్లో, మూడు సైజుల విస్తీర్ణంతో నిర్మాణాలు ప్రారంభం కాగా, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రెండు విభాగాలను రద్దు చేసి, కేవలం 300 చ.అ.విస్తీర్ణంతో కూడిన విభాగాన్నే కొనసాగించింది. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో వీటి నిర్మాణం చేపట్టింది. లబ్ధిదారుడి వాటా రూ.500 ఉన్న వీటిని, తాజాగా ప్రభుత్వం ఉచితంగా కేటాయించింది. ఇందులో భాగంగా పట్టణంలోని 35 వార్డుల నుంచి 1872 మంది లబ్ధిదారులను గుర్తించారు. వీటిని మదనపల్లెకు సమీపంలోని వెంకటప్పకోట రెవెన్యూ గ్రామం, మదనపల్లె-తిరుపతి ప్రధాన రహదారి పక్కన మొత్తం 35 ఎకరాల విస్తీర్ణంలో 39 బ్లాకుల్లో బహుళ అంతస్థులను నిర్మిస్తున్నారు. ఒక్కోబ్లాకులో 48 గృహాల చొప్పున 29 బ్లాకుల్లో 1392 పూర్తి చేయగా, మిగిలిన పది బ్లాకుల్లో 480 గృహాలు పునాదుల నిర్మాణం పూర్తయింది. ఇదిలా ఉండగా పూర్తయిన గృహాలను పేదలకు కేటాయించాలంటూ ప్రతిపక్ష టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు ఆందోళన చేపట్టాయు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లబ్ధిదారులకు ఆయా ప్లాట్లను ఆన్‌లైన్‌ లాటరీ పద్ధతిలో కేటాయించగా, పనులు పూర్తయిన వాటిని ప్రస్తుతం లబ్ధిదారులకు రిజిస్ర్టేషన్‌ చేయిస్తున్నారు. మూడు నెలల క్రితమే నిర్మాణాలు పూర్తయినా, ఈ భూమి రిజిస్ర్టేషన్ల నిషిద్ధ జాబితా 22ఏలో ఉండటంతో జాప్యం అయింది. ఈ నేపథ్యంలో 22ఏ నుంచి తొలగించాలని రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు కలెక్టర్‌కు నివేదిక పంపారు. ఈ మేరకు కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేయడంతో రిజిస్ర్టేషన్లకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో బుధవారం మొదటిరోజు 26 మందికి రిజిస్ర్టేషన్లు చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వి.మనూజకు చెందిన 28వ వార్డులోని లబ్ధిదారులకు రిజిస్ర్టేషన్‌ పత్రా లు అప్పగించారు. మున్సిపల్‌ కమిషనర్‌ తరపున టిడ్కో ఇళ్లను మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారి జకీరాఖతూన్‌ లబ్ధిదారులకు రిజిస్ర్టేషన్‌ చేయిస్తుండగా, సబ్‌ రిజిస్ర్టార్‌ వి.హేమంత్‌రాజు ఆమోదిస్తున్నారు. ఈ ప్రక్రియలో మున్సిపల్‌ సర్వేయర్‌ పూర్ణచంద్‌, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.


Read more