దివ్యాంగులకు త్రిచక్ర మోటారు సైకిళ్లు

ABN , First Publish Date - 2022-10-12T04:29:09+05:30 IST

శారీరక వైకల్యం కారణంగా నడవలేని స్థితిలో ఉన్న వికలాంగులకు మూడు చక్రాల మోటారు వాహనాలను ఉచితంగా అందచేసే పథకానికి ఎట్టకేలకు మూడేళ్ల తరువాత తిరిగి మోక్షం లభించింది.

దివ్యాంగులకు త్రిచక్ర మోటారు సైకిళ్లు
త్రిచక్ర మోటారు సైకిలు

మూడేళ్ల తరువాత పాత పథకానికి మోక్షం 


కలికిరి, అక్టోబరు 11: శారీరక వైకల్యం కారణంగా నడవలేని స్థితిలో ఉన్న వికలాంగులకు మూడు చక్రాల మోటారు వాహనాలను ఉచితంగా అందచేసే పథకానికి ఎట్టకేలకు మూడేళ్ల తరువాత తిరిగి మోక్షం లభించింది. టీడీపీ ప్రభుత్వంలో తగిన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకున్న నడవలేని వికలాంగులకు మూడు చక్రాల మోటారు సైకిళ్లను ఉచితంగా అందజేసే పథకానికి బాగా ప్రాచుర్యం లభించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మూడేళ్లుగా ఈ పథకం అటకెక్కింది. అయితే దివ్యాంగుల నుంచి వచ్చిన ఒత్తిడుల నేపథ్యంలో ఎట్టకేలకు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహకార కార్పొరేషన్‌ ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఏపీడీఏఎ్‌ససీఏసీ కార్పొరేషన్‌ తాజాగా వాహనాల మంజూరు ప్రక్రియ కోసం మార్గదర్శకాలు విడుదల చేసింది. అర్హులైన వారు ఆన్‌లైన్‌ ద్వారా ఈనెల 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవలసి ఉంది. పదవ తరగతి ఉత్తీర్ణత కనీస విద్యార్హతగా నిర్ణయించారు. 18 నుంచి 35 ఏళ్ళ మధ్య ఉన్న వారు మాత్రమే అర్హులు. వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలి. ఈ ఆదాయం పరిధిలోకి వచ్చే ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు, ప్రైవేటు ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకొనే నాటికి ఎల్‌ఎల్‌ఆర్‌ ఉన్నా చాలు. అయితే ఎంపిక చేసే నాటికి రెండు నెలల ముందుగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొంది ఉండాలి. అభ్యర్థులకు సొంత వాహనం ఉండకూడదు. గతంలో ఇలాంటి పథకం కింద వాహనం పొంది ఉండకూడదు. గతంలో దరఖాస్తు చేసుకుని అవి పరిశీలనలో ఉన్న ప్రస్తుతం తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగానికి సంబంధించి యాజమాన్యం ఇచ్చిన సర్టిఫికెట్టును జత చేయాలి. అంగ వైకల్యానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన సదరమ్‌ సర్టిఫికెట్టు ప్రామాణికంగా ఉంటుంది. అందులో కనీసం అంగవైకల్య శాతం 70కి పైబడి ఉండాలి. సదరమ్‌ సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డు, పదో తరగతి ఉత్తీర్ణత, ఎస్సీ, ఎస్సీలయితే కుల ధ్రువీకరణ, రూ.3 లక్షల లోగా ఆదాయాలకు సంబంధించిన సర్టిఫికెట్లతో పాటు పాస్‌పోర్టు సైజు ఫొటోను జత చేసి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఏపీడీఏఎ్‌ససీఏసీ వెబ్‌సైటు ద్వారా ఈనెల 31 లోగా సమర్పించాల్సి ఉంటుంది.

Read more