రోడ్లా..? బావులా.?

ABN , First Publish Date - 2022-10-07T04:48:34+05:30 IST

జిల్లా వ్యాప్తంగా పలు రోడ్లు బావులను తలపిస్తున్నాయి.

రోడ్లా..? బావులా.?
గాలివీడు మండల కేంద్రంలో రోడ్డు దుస్థితి

అధ్వానంగా ఉన్న రోడ్లు.. 

ఆ మార్గాల్లో ప్రయాణించాలంటేనే హడలిపోతున్న ప్రజలు

మరమ్మతులకూ నోచుకోని వైనం


జిల్లా వ్యాప్తంగా పలు రోడ్లు బావులను తలపిస్తున్నాయి. అసలు తాము వెళుతోంది రోడ్డుపైనా.. లేక చిన్న బావుల్లో వెళుతున్నామా.. అనే అనుమానం ప్రయాణీకులకు కలుగుతోంది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. కనీసం నడవడానికి కూడా వీలులేనంత దుస్థితిలో రోడ్లు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న పలు రోడ్లపైన ప్రయాణం చేయాలంటే ప్రజలు హడలెత్తిపోతున్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ నీటిమడుగులను తలపిస్తున్నాయి. ద్విచక్రవాహనదారులు నీరున్న ఆ గుంతల్లో దిగితే ప్రమాదానికి గురి కావలసిందే. రోజూ వేలాది మంది ప్రజలు ప్రయాణించే ఈ రోడ్లను ఒకసారి పరిశీలిస్తే.. 


(రాయచోటి - ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రమైన రాయచోటి రింగు రోడ్డులో పలుచోట్ల పెద్ద గుంతలు పడి ద్విచక్రవాహనాలు వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఉంది. వాహనదారులు కూడా నడవలేక అవస్థలు పడుతున్నారు. సుండుపల్లె మండల కేంద్రానికి ఆనుకుని ఉన్న బైరాగిగుట్ట సమీపంలో సుండుపల్లె-రాయవరం రోడ్డు మార్గంలో ఆర్‌అండ్‌బీ రోడ్డుపైన పెద్ద పెద్ద గుంతలు పడి ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు వెళ్లేటప్పుడు టైర్లు సైతం ఆ గుంతల్లో మునిగిపోతున్నాయి. ఇక ఆటోలు, ద్విచక్రవాహనాల సంగతి సరేసరి. గాలివీడు మండల కేంద్రంలో తారు రోడ్డుపైన పలుచోట్ల గుంతలు పడ్డాయి. వాహనదారులు ఏమాత్రం అజాగ్రత్తగా వెళ్లినా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అదే విధంగా అరవీడు వద్ద నడిరోడ్డుపైన మోకాటిపైన లోతులో గుంతలు ఉన్నాయి. మండలంలోని గరుగుపల్లె రోడ్డు, కమలామర్రి రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాజంపేట మండలం కట్టకిందపల్లె రోడ్డులో తారురోడ్డు మీద పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. ఇక్కడ అడుగు తీసి అడుగు వేయాలన్నా.. కష్టమే.. చిన్నమండెం మండలం దేవగుడిపల్లె-దుర్గం రోడ్డులో పెద్ద గుంతలు ఉన్నాయి. చుట్టూ బురద ఉండడంతో.. కనీసం నడవడానికి సైతం జనం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మీద గుంతల్లో బురద ఉండడంతో వాహనాలు సైతం జారి పడుతున్నాయని జనం వాపోతున్నారు. మండల కేంద్రం నుంచి కొండమూల వెళ్లే దారిలో ఎక్కడ చూసినా గుంతలే కనిపిస్తున్నాయి. సంబేపల్లె మండలం నరసారెడ్డిగారిపల్లె రోడ్డు నుంచి వడ్లపల్లె నాయనివారిపల్లెకు వెళ్లే రోడ్డులో అడుగడుగునా గుంతలు పడి ఉన్నాయి. ప్రతి గుంతా నీటిమడుగును తలపిస్తున్నాయి. వడ్లపల్లె నుంచి కోటకాడపల్లె రోడ్డు కూడా ఇదే పరిస్థితి. మారుమూల గ్రామాలైన మర్రిమాకులపల్లె, ఎర్రమొరంపల్లె, పెద్దకోడివాండ్లపల్లె రోడ్లు కంకర పరిచి వదిలేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రామాపురం మండలం చిత్తూరు-కడప రోడ్డు నుంచి నీలకంఠరావుపేట వెళ్లే దారి సుమారు రెండు కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా దెబ్బతిని గుంతలు పడి వాహనాలు రాలేని పరిస్థితి ఉంది. రోడ్డు సరిగా లేకపోవడంతో ఈ మార్గంలో కనీసం ఆటోలు కూడా రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సుగాలిబిడికి రోడ్డుపై కంకర వేసి వదిలేశారు. ఇంతవరకు మట్టి కూడా వేయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా పలు గ్రామాల రోడ్లు గుంతలతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. మదనపల్లె మండలం కోటవారిపల్లె రోడ్డు పూర్తిగా రాళ్లు తేలి, గుంతలు పడింది. 

పీలేరు పట్టణంలోని చిత్తూరు మార్గంలో ఉన్న రైల్వేగేటు వద్ద రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారి ప్రయాణీకులను ఇబ్బంది పెడుతోంది. అక్కడ ఆర్‌వోబీ రానున్నదన్న కారణంతో ఆర్‌అండ్‌బీ అధికారులు ఆ గుంతలకు మరమ్మతులు చేయడం పూర్తిగా మరిచారు. దీంతో నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతంలో పలు వాహనాలు గుంతల్లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్నాయి. 

గుర్రంకొండ మండలం సరిమడుగు పంచాయతీ గుండ్లగుట్ట తాండాకు వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. కంకర తేలి వాహనాలు వెళ్లడానికి వీలు లేకుండా ఉంది. కలకడ మండలం గోపాలపురం హంద్రీ-నీవా కాలువ పక్క నుంచి గంగాపురం వెళ్లే రోడ్డు పూర్తిగా పాడైంది. గుంతలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అలాగే చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపై కలకడ వద్ద సత్యవతీ నదిపై నిర్మించిన బ్రిడ్జిపై తారు లేచి గుంతలు ఏర్పడడంతో అందులో వర్షం నీరు చేరుతోంది. దాని కారణంగా గుంతలు ఎక్కడున్నాయో తెలియక వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. వాల్మీకిపురం-తిరుపతి రహదారిలో వాల్మీకిపురం సమీపంలోని రోడ్డు గుంతలు ఏర్పడి దుస్థితికి చేరుకుంది. మరీ దుస్థితిలో ఉన్న రోడ్లు ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.. గ్రామీణ ప్రాంత రోడ్లు మరీ దారుణంగా ఉంటున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్లను మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 


త్వరలోనే రోడ్ల మరమ్మతులు

- అరవిందదేవి,  ఈఈ, ఆర్‌అండ్‌బీ మదనపల్లె డివిజన్‌

మదనపల్లె డివిజన్‌లో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. టెండర్లు పూర్తయ్యాయి. అగ్రిమెంటు ప్రక్రియ జరుగుతోంది. త్వరలోనే రోడ్ల మరమ్మతులు చేపడతాం. Read more