జిల్లాకు జొర్రమొచ్చింది

ABN , First Publish Date - 2022-09-14T04:27:55+05:30 IST

జిల్లా జ్వరం కోరల్లో చిక్కుకుంది. ఏ ఇంట్లో చూసినా.. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారే కనిపిస్తున్నారు.

జిల్లాకు జొర్రమొచ్చింది
రాయచోటి ప్రభుత్వాసుపత్రిలో ల్యాబ్‌ వద్ద కిటకిటలాడుతున్న రోగులు

ఏ ఇంట్లో చూసినా జ్వర పీడితులే

విజృంభిస్తున్న మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌

కనిపించని దోమల నివారణా చర్యలు

పట్టించుకోని సంబంధిత శాఖల అధికారులు

కలెక్టర్‌ జోక్యం చేసుకోవాల్సిందేనా ?


జిల్లా జ్వరం కోరల్లో చిక్కుకుంది. ఏ ఇంట్లో చూసినా.. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారే కనిపిస్తున్నారు. దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో మలేరియా, డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. అదే సమయంలో కొత్తగా వర్షపునీళ్లు భూమిలోకి ఇంకి ప్రజలు తాగేనీళ్లు కూడా కలుషితం కావడంతో టైఫాయిడ్‌ బాధితులు ఎక్కువగానే ఉన్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. అయితే చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు సక్రమంగా అందుబాటులో లేకపోవడంతో పల్లెల నుంచి ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చి జేబులు గుల్ల చేసుకుంటున్నామని బాధితులు వాపోతున్నారు.


(రాయచోటి - ఆంధ్రజ్యోతి): 

జిల్లాలో ఏ ఆస్పత్రి చూసినా జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. అటు పట్టణాలు, ఇటు పల్లెల్లో పారిశుధ్యం లోపించడంతోనే జ్వరాలు విజృంభిస్తున్నాయి. చాలా పల్లెల్లో ఇప్పటికీ వర్షపు నీళ్లు, మురికి నీళ్లు రోడ్డుపైనే ప్రవహిస్తున్నాయి. రాయచోటి పట్టణం కొత్తపేట రామాపురంలో మురికినీళ్లు రోడ్డుపైనే ప్రవహిస్తున్నాయి. మదనపల్లె రోడ్డులో ప్రధాన వీధిలో వర్షపు నీళ్లు నిలువ ఉన్నాయి. కొత్తపేట, బోస్‌నగర్‌, కొత్తపల్లె, భట్టువీఽధి, పాతరాయచోటి ప్రాంతాలలో మురికినీటి కాలువలు సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో దోమలకు నిలయాలుగా మారిపోయాయని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఎక్కడ చూసినా ప్రజలు ఈ స్థాయిలో జ్వరాలతో ఇబ్బందులు పడుతుంటే ఎక్కడా దోమల నివారణా చర్యలు చేపట్టడం లేదని, కనీసం జ్వరాలపైన ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా క్రమంగా జ్వరాల కోరల్లో చిక్కుకుంటున్నప్పటికీ.. ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు జోరుగా ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖాధికారులు కేవలం కంటితుడుపుగా మాత్రమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సంబేపల్లె మండలం పెద్ద జంగంపల్లెలో వీధుల్లో వర్షపునీటితో మురికినీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇదే పరిస్థితి జిల్లా అంతటా చాలా పల్లెల్లో ఉంది. దీంతో ఎక్కడ చూసినా జ్వరాలు అధికంగా ఉంటున్నాయి. టైఫాయిడ్‌ జ్వరంతో తీవ్ర ఇబ్బందులు పడ్డానని కొత్తపేట రామాపురానికి చెందిన శివశంకర్‌ తెలిపారు. రక్తపరీక్షలు, చికిత్స కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలిపారు. 

- సంబేపల్లె మండలం దుద్యాల గ్రామం పెద్ద జంగంపల్లెలో జ్వరాలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ పలువురు జ్వరాల బారిన పడి బెంగళూరు, తిరుపతికి వెళ్లి చికిత్స పొంది వచ్చారు. కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. దుద్యాల గ్రామం కోటకాడపల్లెలో రేవతి అనే మహిళకు ఇప్పటి వరకు తెలియని కొత్త జ్వరం వచ్చింది. బెంగళూరులో పది రోజుల పాటు చికిత్స తీసుకుని వచ్చారు. దుద్యాల గ్రామం పెద్దజంగంపల్లె, ఊరగాయగుట్ట హరిజనవాడ, వడ్డెపల్లె, గురిగింజకుంట, చిన్నపాపయ్యగారిఇళ్లు, ఇలా ప్రతి ఒక్కచోట నలుగురు నుంచి ఐదుమంది జ్వరం బారిన పడ్డారు. 

- మదనపల్లె మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో సుమారు వంద మందికిపైగా ప్రజలు వైరల్‌ ఫీవర్లతో బాధపడుతున్నారు. జ్వర బాధితులు బొమ్మనచెరువు, సీటీయం పీహెచ్‌సీలో చికిత్సలు పొందుతుండగా మదనపల్లె పట్టణ శివారులోని పంచాయతీలకు చెందిన ప్రజలు ప్రైవేటు ప్రథమ చికిత్సా కేంద్రాల్లో ఆర్‌ఎంపీలతో చికిత్సలు చేయించుకుంటున్నారు. మదనపల్లె పట్టణంలో రెండు లక్షల మందికిపైగా ప్రజలు ఉండగా సుమారు 5 వేల మంది వరకు జ్వరాల బారిన పడి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ ఇద్దరు ముఖ్య ప్రజాప్రతినిధులు సైతం జ్వరాల బారినపడి చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆగస్టు 1 నుంచి ఈనెల 12 వరకు టైఫాయిడ్‌ కేసులు 144, మలేరియా 5, డెంగీ 32 కేసులు నమోదైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అవుట్‌ పేషెంట్లు 21 వేలు, ఇన్‌పేషంట్లు 2500 మంది ఉన్నారు. అవుట్‌ పేషంట్లు, ఇన్‌పేషంట్లలో ఎక్కువగా జ్వరపీడితులు ఉన్నట్లు సమాచారం. 

- రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు సుమారు 600 మందికి పైగా ఓపీ ఉంటుంది. రోజుకు సుమారు 70 వరకు రక్తనమూనాలు సేకరిస్తారు. గత రెండు నెలలుగా ఇందులో ఎక్కువగా జ్వర బాధితులే ఉన్నట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి. సేకరించిన రక్త నమూనాల్లో 30 శాతం జ్వరాలు ఉన్నట్లు తెలిపారు. 

- పీలేరు పట్టణంలోని మూడు ప్రైవేటు ఆసుపత్రులలో గత వారం రోజులుగా రోజుకు సుమారు 60 మంది చిన్నపిల్లలు జ్వరంతో బాఽధపడుతూ చేరుతున్నట్లు సమాచారం. ఇలా జిల్లా అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. డెంగ్యూ జ్వరం వస్తే ఇక్కడ ఎంతగా చికిత్స పొందినప్పటికీ నయం కాకపోవడంతో ఎక్కువగా బెంగుళూరు సెయింట్‌జాన్స్‌ ఆసుపత్రికి వెళ్తున్నారు. అక్కడ వేలాది రూపాయలు ఖర్చు అవుతోంది. రాయచోటి చుట్టు  పక్కల ప్రాంతాల నుంచి ఎక్కువగా ప్రైవేటు ఆసుపత్రులకు వైద్యం కోసం వస్తున్నారు. రక్త పరీక్షలు, మందులు, సూదులకు వేల రూపాయలు వ్యయం అవుతోందని ప్రజలు వాపోతున్నారు. 


కనిపించని దోమల నివారణా చర్యలు

సాధారణంగా వర్షాలు కురిసి సీజనల్‌ వ్యాధులు ప్రబలే సమయంలో విస్తృతంగా దోమల నివారణా చర్యలు చేపట్టాలి. అయితే జిల్లాలో ఎక్కడా కనుచూపు మేర ఇటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సాధారణంగా దోమల నివారణకు మురికినీరు నిలువ లేకుండా చేయాలి. ఒకవేళ నీరు నిలువ ఉంటే.. ఆయిల్‌ బాల్స్‌ వేయాలి. ఇంకా ఎక్కువగా నీళ్లు నిలువ ఉంటే.. గంబూషియా చేపలను వదలాలి. తరచూ వీధుల్లో పైరిత్రయంం పిచికారి చేయాలి. ఇంకా ఎక్కువ తీవ్రత ఉంటే.. మలాథియాన్‌, డీజిల్‌ కలిపి ఫాగింగ్‌ చేయాలి.

రాయచోటి మునిసిపాలిటీలో లక్షకు పైగా జనాభా ఉన్నారు. 34 మునిసిపల్‌ వార్డులు ఉన్నాయి. ఇందులో ఎక్కడా ఫాగింగ్‌ చేపట్టలేదనే ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్‌ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు మునిసిపాలిటీలో ప్రస్తుతానికి ఒక ఫాగింగ్‌ మిషన్‌ అందుబాటులో ఉంది. రెండు ఉండగా.. ఒకటి మరమ్మతుకు గురైంది. ఇప్పటి వరకు 1, 2, 4, 21, 23, 25 సచివాలయ వార్డులతో పాటు పాత రాయచోటిలో ఇప్పటి వరకు ఫాగింగ్‌ చేశారు. కలెక్టరేట్‌, కలెక్టర్‌ బంగ్లా, మాండవ్యా నది పరిసర ప్రాంతాలలో ఫాగింగ్‌ చేశారు. నెలకు సుమారు రూ.80 వేల వరకు ఫాగింగ్‌కు ఖర్చు చేస్తున్నారు. (జ్వరాల తీవ్రత ఎక్కుగా ఉన్నప్పుడు.. ప్రతి రెండు వారాలకు ఫాగింగ్‌ చేయాల్సి ఉంటుంది.)ఈ లెక్కన రాయచోటి మునిసిపాలిటీ మొత్తం ఫాగింగ్‌ చేయడానికి ఎన్ని నెలలు పడుతుందోనని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మునిసిపల్‌ పాలకవర్గం వెంటనే స్పందించి తగినన్ని ఫాగింగ్‌ మిషన్లు ఏర్పాటు చేసి పట్టణమంతా ఫాగింగ్‌ చేయాలని ప్రజలు కోరుతున్నారు.


కలెక్టర్‌ జోక్యం చేసుకోవాల్సిందేనా.? 

జిల్లా అంతటా జ్వరాలు విజృంభిస్తున్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖాధికారులు సక్రమంగా పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఒక్కో ప్రాంతానికి వెళ్లి పర్యవేక్షించాల్సిన జిల్లా స్థాయి వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఎక్కడైనా పీహెచ్‌సీలు సందర్శించడానికి గుంపులు గుంపులుగా వెళుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తరచూ సందర్శించి అక్కడ పనిచేసే సిబ్బందిని సమన్వయం చేయడం లేదని, చాలావరకు జిల్లా కేంద్రంలోనే ఉంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపఽధ్యంలో జిల్లా ప్రజలను జ్వరాల బారి నుంచి కాపాడేందుకు స్వయంగా కలెక్టర్‌ జోక్యం చేసుకుని.. అధికారులను సమన్వయం చేయాల్సిందేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 


మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తాం

- కొండయ్య, జిల్లా వైద్యాధికారి

జిల్లావ్యాప్తంగా జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న పల్లెల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే మా శాఖ ద్వారా పరిశుభ్రతపై, దోమల నివారణ కోసం అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దోమల నివారణ కోసం గ్రామాల్లో ఫాగింగ్‌ను ఆయా గ్రామ పంచాయతీలే చేపట్టాలి. దాదాపు అన్ని పంచాయతీలు ఫాగింగ్‌ మిషన్లు కొన్నాయి. మా సిబ్బందితో అవసరమైన చోట ప్రత్యేక చర్యలు తీసుకుంటాము. Read more