ఉపాధ్యాయుల యాప్‌.. సోపాలు

ABN , First Publish Date - 2022-08-17T05:34:23+05:30 IST

నిమిషం ఆలస్యమైనా ఆబ్సెంట్‌ నిబంధనపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తమ విషయంలో రోజుకో రూల్‌ తెస్తోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. గతంలో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి బయోమెట్రిక్‌ ఐరిస్‌ హాజరు విధానం ఉండేది. కరోనా వల్ల అది నిలిచిపోయింది.

ఉపాధ్యాయుల యాప్‌.. సోపాలు

మొరాయించిన సిమ్స్‌ ఏపీ మొబైల్స్‌ యాప్‌ 

పరుగులు తీసిన ఉపాధ్యాయులు

తొలిరోజు హాజరు 22 శాతమే..!


ఉపాధ్యాయులు ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరితే పిల్లలకు ఈ రోజు ఏ పాఠం చెప్పాలి.. ఎలా చెప్పాలి అని ఆలోచించేవారు. ఇప్పుడు సమయానికి చేరతామా లేదా.. ఒక నిమిషం ఆలస్యమైతే యాప్‌లో హాజరు నమోదు కాదు.. సెలవు పెడదామంటే ఏదైనా అత్యవసరం అయితే ఎలా.. అని భయపడే రోజులు వచ్చాయి. పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయుల హాజరు కోసం తీసుకువచ్చిన ముఖ యాప్‌ తొలిరోజే పని చేయలేదు. ఉదయం 8.30 గంటలకే పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయులు ముఖ యాప్‌తో కుస్తీ పట్టారు. చాలా చోట్ల సర్వర్‌ పనిచేయక, కొన్నిచోట్ల యాప్‌ తీసుకోక ఇబ్బంది పడ్డారు. ఎంత ప్రయత్నం చేసినా జిల్లాలో తొలిరోజు 22 శాతం మాత్రమే హాజరు నమోదైందంటే ఈ యాప్‌తో ఉపాధ్యాయులు ఎంత అపసోపాలు పడ్డారే ఇట్టే తెలుస్తోంది.


కడప(ఎడ్యుకేషన్‌), ఆగస్టు 16: నిమిషం ఆలస్యమైనా ఆబ్సెంట్‌ నిబంధనపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తమ విషయంలో రోజుకో రూల్‌ తెస్తోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. గతంలో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి బయోమెట్రిక్‌ ఐరిస్‌ హాజరు విధానం ఉండేది. కరోనా వల్ల అది నిలిచిపోయింది. దీని స్థానంలో ఇప్పుడు పాఠశాల విద్యాశాఖ ఫేషియల్‌ రికగ్నిషన్‌ (ముఖహాజరు) విధానాన్ని తీసుకు వచ్చింది. ఇందుకోసం ‘సిమ్స్‌ ఏపీ’ అనే మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. ఉపాధ్యాయులు, సిబ్బంది తమ మొబైల్‌ ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని లాగిన్‌ అవ్వాలి. పాఠశాలకు ఉదయం 9 గంటల లోపు చేరుకుని తమ లైవ్‌ సెల్ఫీ ఫొటోను యాప్లో అప్లోడ్‌ చేయాలి. ఒక నిమిషం ఆలస్యమైనా హాజరును యాప్‌ అంగీకరించదు. ఆ రోజు సెలవు పెట్టుకోవాల్సి ఉంటుంది. పాఠశాల ఆవరణలోకి వస్తేనే యాప్‌ హాజరు తీసుకుంటుంది. బయట ఉన్నా తీసుకోదు.


తొలి రోజు పరుగో పరుగు

ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఉపాధ్యాయులు స్కూల్‌ అటెండెన్స్‌ యాప్‌లో ముఖ ఆధారిత హాజరు వెయ్యాలని విద్యాశాఖ జీవో విడుదల చేసింది. 16వ తేదీ నుంచే కొత్త విధానం అమలు చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో తొలి రోజైన మంగళవారం యాప్‌ డౌన్లోడ్‌ చేసుకోవటం నుంచి ఆన్‌లైన్‌ హాజరు వరకు ఉపాధ్యాయులు పడ్డ తిప్పలు అంతా ఇంతా కాదు. డీడీఓ లాగిన్‌లో రిజిస్ర్టేషన్‌ కోసం సెల్ఫీలతో కుస్తీ పట్టారు. ఇప్పటికీ చాలా మంది రిజిస్ర్టేషన్‌కు నోచుకోలేదు. ప్రతి టీచర్‌ 9 గంటల లోపే ముఖ చిత్ర హాజరు వేయాలి, లేకుంటే గైర్హాజరయినట్లే అనే నిబంధనతో.. ఉపాధ్యాయులు తమ హాజరు నమోదు చేసుకునేందుకు అటు ఇటు పరుగులు పెట్టారు. ఈ యాప్‌లో ఇన్‌టైం, ఔట్‌ టైమ్‌ తప్పక రికార్డ్‌ అవుతుందన్నారు. రిజిస్ర్టేషన్‌ కాని వారికి సంజాయిషీలు ఉంటాయని భావిస్తున్నారు. సెలవులు కూడా ఎప్పటికప్పుడు ఉదయం 9లోపే హెడ్‌మాస్టర్‌ యాప్‌లో అప్రూవల్‌ చేస్తేనే ఆన్‌లైన్‌ అనుమతి ఉంటుంది. ఒకే యాప్‌లోనే విద్యార్థులు హాజరు కూడా తీసుకోవాలని విద్యాశాఖ ఒత్తిడి ఉంది.


హాజరు నమోదు 22 శాతమే..

సిమ్స్‌ ఏపీ మొబైల్‌ యాప్‌ (ఫేస్‌యాప్‌లో) తొలి రోజు మంగళవారం 22 శాతం మంది ఉపాధ్యా యులు మాత్రమే తమ హాజరును నమోదు చేసు కున్నారు. జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాలకు సంబంధించి 7,720 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఫేస్‌ యాప్‌లో 4131 మంది (53.51 శాతం) మాత్రమే ఇంతవరకు రిజిస్టర్‌ అయ్యారు. తొలిరోజు మంగళ వారం జిల్లా వ్యాప్తంగా 1754 మంది (22.74 శాతం) ఉపాధ్యాయులు మాత్రమే ఫేస్‌ యాప్‌ ద్వారా నమోదు చేసుకున్నారు. మిగతా 5,966 మంది(77 శాతం) ఉపాధ్యాయులు తొలిరోజు గైర్హాజరైనట్లు యాప్‌ చూపిస్తుంది.  


నాణ్యమైన డివైజులివ్వాలి

- సి.విప్రసాద్‌, ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి 

పాఠశాలకు నాణ్యమైన డివైజులు, నెట్‌వర్కు ప్రభుత్వమే కల్పించాలి. బయోమెట్రిక్‌ హాజరును స్వాగతిస్తున్నాం. పలు సమస్యలతో కూడిన యాప్‌ హాజరు తప్పించాలి. నెట్‌ లేని ప్రాంతాల్లో ప్రత్యేక పరిస్థితులు కల్పించాలి. నెట్‌ స్పీడ్‌ తగ్గినప్పుడు సర్వ ర్‌ సమస్యలు వచ్చినా బాధ్య త వహించాల్సింది 

ఎవరు?


ఇబ్బందికి గురిచేయడం తగదు

- పి.రమణారెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు

నాణ్యత లేని సక్రమంగా పనిచేయని యాప్‌లను రోజుకొకటి ప్రవేశపెట్టి ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసం? ఎలాంటి బయోమెట్రిక్‌ యంత్రాలు కానీ, ట్యాబ్‌లు కానీ సరఫరా చేయకుండా ఉపాధ్యాయులు సొంత మొబైల్స్‌తోనే యాప్‌లు నిర్వహించాల్సిందే అని ఆదేశాలు జారీ చేయడం సరికాదు. సర్వర్‌ సక్రమంగా పనిచేయని కారణంగా విద్యా ప్రమాణాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ యాప్‌లు ఉండాల్సిందే అని మీరు భావిస్తే ప్రత్యేక యంత్రాంగంతో నిర్వహణ చేపట్టాలి. విద్యా రంగానికి తీవ్ర నష్టం కలిగించే యాప్‌లను రద్దు చేయకపోతే ఉద్యమం చేపట్టక తప్పదన్నారు. 


డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలి

- వెంకటసుబ్బారెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు

ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదు చేయడానికి ఆగస్టు 16 నుంచి ప్రారంభించిన ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌లో నమోదు చేయడానికి గంటల కొద్ది సమయం తీసుకుంది. అయినా కొద్దిమందికి మాత్రమే నమోదైంది. హాజరు నమోదు చేయడానికి సిమ్‌కార్డుతో కూడిన అధిక స్పీడు కలిగిన ఎలక్ర్టానిక్‌ డివై్‌సను పాఠశాలకు అందించాలి. బోధనేతర పనులకు డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలి.


ఆశయం మంచిదే.. ఆచరణ బాలేదు

- కొండూరు శ్రీనివాసరాజు, పీఆర్టీయూ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్‌

ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌ను స్వాగతిస్తున్నాం. దీని అమలు విధానమే సరిగా లేదు. నెట్‌ పనిచేస్తుందా లేదా.. హాజరు పడుతుందా లేదా... సెలవు వేస్ట్‌ అవుతుందేమో జీతం రాదేమో అని ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి రోజే గంటల కొద్ది ఆ యాప్‌ పనిచేయక, నెట్వర్క్‌ సరిగా లేక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. చక్కటి వాతావరణంలో ఉపాధ్యాయులు పనిచేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలి.Read more