‘ఇంటింటికీ టీడీపీ - మీ కోసం మీ ప్రవీణ్‌’

ABN , First Publish Date - 2022-12-30T23:22:43+05:30 IST

నియోజకవర్గంలో ప్రజల సమస్యలు, ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునే క్రమంలో జనవరిలో ‘ఇంటింటికీ టీడీపీ - మీ కోసం మీ ప్రవీణ్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

‘ఇంటింటికీ టీడీపీ - మీ కోసం మీ ప్రవీణ్‌’
సమావేశం మాట్లాడుతున్న టీడీపీ ఇన్‌చార్జి జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, డిసెంబరు 30: నియోజకవర్గంలో ప్రజల సమస్యలు, ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునే క్రమంలో జనవరిలో ‘ఇంటింటికీ టీడీపీ - మీ కోసం మీ ప్రవీణ్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తన కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీఎస్‌ ముక్తియార్‌, పట్టణ అధ్యక్షుడు ఈవీ సుధాకర్‌రెడ్డి, తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజుతో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 2170 మందికి పింఛన్ల తొలగింపునకు నోటీసులు జారీ చేశారన్నారు. జగనన్న ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే స్థానిక ఎమ్మెల్యే ఈ పింఛన్ల తొలగింపుపై ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. పింఛన్‌ కోల్పోయిన వారికి తాము అండగా ఉంటామన్నారు. జనవరి 1 నుంచి 5 వరకు ఎవరికైనా పింఛన్‌ అందకపోతే తమను ఆశ్రయిస్తే, న్యాయం జరిగేలా చేస్తామన్నారు. కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో 8 మంది ప్రాణాలు కోల్పోతే, ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందిస్తూ సంఘటన బాధాకరమని ప్రకటించారన్నారు. అయితే దీనిని కూడా ఇక్కడి ఎమ్మెల్యే రాజకీయం చేస్తూ.. లోకేశ్‌ పాదయాత్ర ప్రకటిస్తునే ఘటన జరిగిందని చెబుతూ చంద్రబాబుది దరిద్రపాదం అని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిజానికి రాచమల్లుదే దరిద్రపాదమంటూ, ఈ మూడున్నర ఏళ్లలో స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి 57 వివిధ వ్యాపారసంస్థలకు ప్రారంభోత్సవం చేశారని, ఇందులో 41 వ్యాపారసంస్థలు దివాళా తీసి మూతపడ్డాయన్నారు. దీనిని బట్టి ఎవరిది దరిద్రపాదమో ప్రజలే తెలుసుకోవాలన్నారు. టీడీపీ శ్రేణులతో చర్చించి ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి తేదీ ఖరారు చేస్తామన్నారు. ముక్తియార్‌, సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. యువత భవిష్యత్తు ప్రశ్నార్థకమైన క్రమంలో యువదళం పేరిట నారా లోకేశ్‌ జనవరి 27వ తేదీ నుంచి 400 రోజుల్లో 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారని, దీనికి యువత కలిసి రావాలని, ప్రవీణ్‌ నేతృత్వంలో ఇక్కడి టీడీపీ శ్రేణులు ఆ పాదయాత్రలో పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో టీడీపీ నాయకులు సిద్దయ్య, గుర్రప్పయాదవ్‌, ఖలీల్‌, అలీబేగ్‌, వెంకటసుబ్బారెడ్డి, శ్రీనివాసయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T23:23:11+05:30 IST

Read more