ఎండలు బాబోయ్‌..

ABN , First Publish Date - 2022-03-16T05:37:04+05:30 IST

అప్పుడే వేసవి మొదలైంది. భానుడు భగభగమంటున్నాడు. పది రోజుల క్రితం వరకు చల్లటి గాలితో సేదతీరిన జనానికి ఇప్పుడిప్పుడే ఉక్కపోత మొదలవుతోంది. వారం రోజులుగా ఎండ తీవ్రత పెరుగుతూ వస్తోంది. దీంతో అప్పుడే ఎండలు బాబోయ్‌ ఎండలు అంటున్నారు. మార్చి మూడో వారంలోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే ఇక ఏప్రిల్‌, మే నెలలో భానుడి ప్రతాపం ఎలా ఉంటుందో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత 5 రోజులుగా ఉష్ణోగ్రతలు 36 నుంచి 37 డిగ్రీలకు చేరుకున్నాయి.

ఎండలు బాబోయ్‌..
నిర్మానుష్యంగా ఉన్న కడప ఐటీఐ సర్కిల్‌

37 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత 

రోజు రోజుకూ భానుడి ఉగ్రరూపం

వేసవి జాగ్రత్తలు పాటించకపోతే.. వడదెబ్బకు గురయ్యే ప్రమాదం 

కడప, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): అప్పుడే వేసవి మొదలైంది. భానుడు భగభగమంటున్నాడు. పది రోజుల క్రితం వరకు చల్లటి గాలితో సేదతీరిన జనానికి ఇప్పుడిప్పుడే ఉక్కపోత మొదలవుతోంది. వారం రోజులుగా ఎండ తీవ్రత పెరుగుతూ వస్తోంది. దీంతో అప్పుడే ఎండలు బాబోయ్‌ ఎండలు అంటున్నారు. మార్చి మూడో వారంలోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే ఇక ఏప్రిల్‌, మే నెలలో భానుడి ప్రతాపం ఎలా ఉంటుందో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత 5 రోజులుగా ఉష్ణోగ్రతలు 36 నుంచి 37 డిగ్రీలకు చేరుకున్నాయి. వేసవిలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక మండే ఎండలు రోజువారీ కూలీలపై ప్రభావం చూపుతోంది. ఇక వీధి వ్యాపారులపై ప్రభావం చూపనుంది. మంగళవారం 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడపలో ఎండ ధాటికి మధ్యాహ్నం ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. కొందరు ఎండవేడి నుంచి రక్షణ కోసం గొడుగులు, టవల్స్‌ అడ్డుపెట్టుకోగా మహిళలు చున్నీలను కప్పుకుని తిరుగుతుండడం కనిపించింది. ఎండలు పెరుగుతుండడంతో రైతన్నల పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. జిల్లాలో సజ్జ, పత్తి, ఇతర పంటలు సాగులో ఉన్నాయి. పొలాలు నీరు కట్టేందుకు పగటి పూట వెళ్లాల్సి వస్తుండటంతో ఎండ ధాటికి ఇబ్బందులు పడుతున్నారు. 

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు 

జిల్లాలో వారం రోజులుగా పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈనెల 10న 36-21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 12న 36-21, 13న 36-22, 14న 37-23, 15న 37-22 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇలాగే ఉంటే ఉష్ణోగ్రతలు రాబోయే రోజుల్లో 40 డిగ్రీలు కూడా దాటే అవకాశాలున్నాయి. 

జాగ్రత్తలు తప్పని సరి 

వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు కూడా ఏర్పడుతుంది. అలాగే ఇతర వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. కనుక వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవిలో చమట ఎక్కువ పడుతుంది కనుక సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తీసుకోవాలి. కూల్‌డ్రింక్‌కు బదులు మజ్జిగ, పండ్ల రసాలు తాగడం ఉత్తమం. ఎండ నుంచి ఇంటికి వచ్చిన వారు నిమ్మరసం తాగాలి. వేసవి ఉపశమనం కోసం కర్బూజ, దోసకాయలు, ఇతర పండ్లను తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు నల్లటి దుస్తులు ధరించకుండా బాగా వదులుగా ఉండే దుస్తులను ధరించాలి.  ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే తప్ప సాధ్యమైనంత వరకు ఇంటి పట్టునే ఉండడం మంచిది. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే ఉదయం 11 గంటలలోపు పని ముగించుకుని ఇంటికి చేరాలి. బయటకు వెళ్లే వారు ఎండ నుంచి రక్షణ కోసం కూలింగ్‌ గ్లాసెస్‌, టోపి, హెల్మెట్‌, గ్లౌజ్‌లు వాడాలి. బయటకు వెళ్లే ముందు సన్‌ స్ర్కీన్‌ లోషన్‌ రాసుకోవాలి. మసాలాతో కూడిన ఆహారానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. 


Updated Date - 2022-03-16T05:37:04+05:30 IST