ఇసుక అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-09-14T04:23:11+05:30 IST

జిల్లా పరిధిలో అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇసుక అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు

అక్రమ రవాణాపై 14500కు సమాచారం ఇవ్వండి

ఎస్పీ హర్షవర్ధన్‌రాజు


రాయచోటి టౌన్‌, సెప్టెంబరు 13: జిల్లా పరిధిలో అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నిషేధిత గుట్కా, మద్యం, నాటుసారా తయారీ, విక్రయాలు, జూదం, కోడిపందాలు, ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం అక్రమ రవాణా తదితర అసాంఘీక కార్యకలాపాలపై పోలీసు, ఎస్‌ఈబీ శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా, నాటుసారా తయారీ, విక్రయాలు, ఎర్రచందనం అక్రమ రవాణా తదితర వాటిని నిరోధించేందుకు 14500 అనే టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. జిల్లాలో ఎవరైనా, ఎక్కడైనా ఇసుకను అక్రమంగా తరలించినా, అధిక ధరలకు విక్రయించినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ప్రభుత్వం కేటాయించిన ఇసుక రీచ్‌లు, స్టాక్‌ పాయింట్ల ద్వారానే ఇసుకను తరలించాలని సూచించారు. అలా కాకుండా ఎవరైనా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలను, విక్రయాలను నిర్వహించేందుకు జయప్రకాష్‌ పవర్‌ వెంచర్‌ లిమిటెడ్‌ వారు టెండర్ల ద్వారా అనుమతి పొందారన్నారు. జేపీవీఎల్‌ నుంచి అనుమతి పొందిన వారికి మాత్రమే రాష్ట్రంలో ఇసుక తరలించేందుకు, విక్రయించేందుకు అనుమతి ఉందన్నారు. ఇతరులు ఎవరైనా తాము ఇసుక సబ్‌ కాంట్రాక్టర్స్‌ అని, ఇతర పేర్లతో ఎటువంటి లావాదేవీలు జరిపినా అటువంటి వారిపై క్రమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Read more