ముళ్లకంపల నడుమ గ్రామీణ రోడ్లు

ABN , First Publish Date - 2022-09-12T05:18:22+05:30 IST

మండలంలోని వివిధ గ్రామీణ రహదారులకు ఇరువైపులా ముళ్లకంపలు విపరీతంగా పెరిగి ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి.

ముళ్లకంపల నడుమ గ్రామీణ రోడ్లు
ముళ్లకంపలతో ప్రమాదకరంగా ఉన్న రంగసముద్రం-పీటీఎంకు వెళ్లే రోడ్డు

పెద్దతిప్పసముద్రం, సెప్టెంబరు 11 : మండలంలోని వివిధ గ్రామీణ రహదారులకు ఇరువైపులా ముళ్లకంపలు విపరీతంగా పెరిగి ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి.  మండల కేంద్రమైన పీటీఎం నుంచి రంగసముద్రం గ్రామం వైపు వెళ్లే రహదారి, అలాగే బి.కొత్తకోట నుంచి మల్లెలకు వెళ్లే రహదారి, పీటీఎంనుంచి అంకిరెడ్డిపల్లెకు వెళ్లే రహదారితో పాటు పీటీఎం నుం చి మడుమూరు గ్రామం మీదుగా కుర్రావాండ్లపల్లె క్రాస్‌కు వెళ్లే రహదారులకు ఇరువైపులా ముళ్లపొదలు దట్టంగా పెరిగి పోవడంతో అటు ఇటూ వచ్చే వాహనాలు కనపడక పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పా టు పీటీఎం, బి.కొత్తకోట మండలాల నుంచి పాఠశాల విద్యార్థులు   తరచు పీటీఎం నుంచి వయా విసనకర్రవాండ్లపల్లె మీదుగా రంగసముద్రం నుంచి బి.కొత్తకోటకు వివిధ పాఠశాలల స్కూల్‌ బస్సుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఈ రహదారుల్లో రోడ్లకు ఇరువైపులా ముళ్లకంపలు అల్లుకు పోవడంతో రోడ్గు మార్గంలో వాహనాలు అతి కష్టంతో ప్రయాణం చేయాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు. అయితే రోడ్డు మార్గం ఇరుకుగా ఉండడం దీనికి తోడు వర్షాల తాకిడికి రోడ్డు మార్గంలో అక్కడక్కడ గుంతలుగా ఏర్పడడంతో ద్విచక్ర వాహనదారులు అతి కష్టం మీద ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఎది ఏమైనా ఈ రహదారులకు ఇరువైపులా పేరుకు పోయిన ముళ్లపొదలను తొలగిం చి ప్రయాణం సాఫీగా జరిగేలా చూడాలని  గ్రామస్థులు కోరుతున్నారు. ఇకనైనా సంబందిత రోడ్లు, భవనాల శాఖ అధికారులు రహదారులపై ఇరువైపులా ఉన్న ముళ్లపొదలను తొలగించాలని  ప్రజలు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-09-12T05:18:22+05:30 IST