ఖరీఫ్‌లో తగ్గిన వరిసాగు

ABN , First Publish Date - 2022-09-12T05:00:27+05:30 IST

దుక్కి దున్ని.. సేద్యం చేసి.. పైరు మొదలు పెట్టినప్పటి నుంచి పంట చేతికొచ్చినంత వరకు రైతుకు నిద్ర పట్టదు. అప్పో.. సప్పో చేసి కంటికి రెప్పలా పంటను సాగు చేసినా... ఎప్పుడు ఏ రూపంలో ప్రకృతి కన్నెర్ర చేస్తుందో.. పంటకు ఏ రోగం వచ్చి నాశనమవుతుందో తెలియని పరిస్థితి. చివరకు పెట్టిన పెట్టుబడులు రాక అప్పుల పాలవుతున్నారు. అందుకే రానురానూ పంటల సాగు తగ్గించేస్తున్నారు.

ఖరీఫ్‌లో తగ్గిన వరిసాగు
నీరు లేక ఎండిపోయిన చెరువులు

ఆసక్తి చూపని రైతులు 

వర్షాలు లేకపోవడం 

చెరువులు, కుంటలు ఎండిపోవడమే కారణమా ? 

రామాపురం, సెప్టెంబరు 11: దుక్కి దున్ని.. సేద్యం చేసి.. పైరు మొదలు పెట్టినప్పటి నుంచి పంట చేతికొచ్చినంత వరకు రైతుకు నిద్ర పట్టదు. అప్పో.. సప్పో చేసి కంటికి రెప్పలా పంటను సాగు చేసినా... ఎప్పుడు ఏ రూపంలో ప్రకృతి కన్నెర్ర చేస్తుందో.. పంటకు ఏ రోగం వచ్చి నాశనమవుతుందో తెలియని పరిస్థితి. చివరకు పెట్టిన పెట్టుబడులు రాక అప్పుల పాలవుతున్నారు. అందుకే రానురానూ పంటల సాగు తగ్గించేస్తున్నారు. 

ప్రస్తుత ఖరీ్‌ఫ సీజన్‌లో మండలంలో వరిసాగు సగానికి పైగా తగ్గిందంటే ఏ మేరకు రైతులు ఇబ్బందులు పడుతున్నారో అర్థం చేసు కోవచ్చు. ఆశించిన మేరకు వర్షాలు కురవకపోవడం, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో రైతులు సాగుకు ఆసక్తి చూపడం లేదు. గతేడాది 900 హెక్టార్లలో వరిసాగు చేయగా, ఈ ఏడాది 640 హెక్టార్లు మాత్రమే సాగు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరంలో వర్షాలు బాగా కురవడంతో వరిని అధికంగా రైతులు సాగు చేశారు. కానీ పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు కురవడంతో పంటలు పూర్తిగా నష్టపోయి రైతులు కోలుకోలేని స్థితిలో ఉండిపోయారు. తెచ్చిన అప్పులు ఇప్పటికీ తీరలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు ఎండిపోయి పంటలు బీడుగా కనిపిస్తున్నాయి. అలాగే ఆయకట్టు భూములు కూడా గడ్డి, పిచ్చిమొక్కలతో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బావుల కింద అరకొరగా కొందరు రైతులు అప్పులు చేసి మరీ వరి పంట సాగు చేసినా... పంట చేతికి వచ్చే సమయానికి దిగుబడి వస్తుందో రాదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతులపై కనికరించి రైతులకు కావాల్సిన పనిముట్లు, సబ్సిడీ ఎరువులు అందజేయాలని సంబంధిత అధికారులను రైతులు కోరుతున్నారు. మండలంలో ఏ గ్రామంలో చూసినా చెరువులు ఎండిపోయి భూముల్లో జమ్ము కనిపిస్తోంది. 


వరిసాగు చేస్తే అప్పుల్లోకి వెళ్లాల్సిందే

- నరసింహారెడ్డి, రైతు, యర్రంగివాండ్లపల్లె

గత సంవత్సరంలో వరిసాగు రెండు ఎకరాల్లో సాగు చేశాను. పంట చేతికొచ్చే సమయానికి ఏదోక రూపంలో ప్రకృతి మమ్మల్ని ఇబ్బందులు పెడుతోంది. పంటను దక్కించు కునేందుకు అప్పో సప్పో చేసి సాగు చేస్తే చివరకు కన్నీళ్లే మిగులుతున్నాయి. గతేడాది తెచ్చిన అప్పులే ఇంకా తీరలేదు. 


వరిసాగు తగ్గడం వాస్తవమే

- నాగమణి, మండల వ్యవసాయాధికారి 

ఈ ఏడాది వర్షాలు లేక వరి సాగు గణనీయంగా తగ్గింది. ఖరీ్‌ఫ సీజన్‌లో వర్షాలు బాగా కురిస్తే రైతులు ఎక్కువ శాతం వరిసాగుపై మొగ్గు చూపిస్తారు. సరిగ్గా కురవకపోవడంతో మొగ్గు చూప డం లేదు. Read more