పోలింగ్‌స్టేషన్లపై అభ్యంతరాలు తెలపండి

ABN , First Publish Date - 2022-10-07T04:45:18+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, వాటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.

పోలింగ్‌స్టేషన్లపై అభ్యంతరాలు తెలపండి
సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం తప్పక చేయించాలి

జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా


రాయచోటి (కలెక్టరేట్‌), అక్టోబరు 6: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, వాటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. జిల్లాలో నూతన పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, పోలింగ్‌ స్టేషన్ల చేర్పులు, మార్పులపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈనెల 10వ తేదీ లోపు జిల్లాలో పోలింగ్‌ స్టేషన్ల గుర్తింపు పోలింగ్‌ స్టేషన్ల చేర్పులు, మార్పులపై నివేదిక పంపుతామన్నారు. 1500 ఓటర్లకు ఒక పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలోని రాయచోటి, రాజంపేట, మదనపల్లె డివిజన్లలో పోలింగ్‌స్టేషన్‌లకు సంబంధించి ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా రెండు రోజుల్లో తమకు రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం చేసేందుకు ఎవరైతే ఓటరు కార్డు ఇస్తున్నారో వారి దగ్గర నుంచి 6-బీ ఫారం పొంది జాగ్రత్తగా పరిశీలించి ఓటరు కార్డుకు ఆధార్‌ లింక్‌ చేస్తారని తెలిపారు. సమావేశంలో డీఆర్‌వో సత్యనారాయణ, రాయచోటి, రాజంపేట, మదనపల్లె ఆర్డీవోలు రంగస్వామి, కోదండరామిరెడ్డి, మురళి, ఎన్నికల విభాగ తహసీల్దార్‌ శ్రావణి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

Read more