సమరానికి సన్నద్ధం

ABN , First Publish Date - 2022-11-24T00:24:35+05:30 IST

వైసీపీ మూడున్నరేళ్ల పాలనపై జగన్‌ వీరాభిమానులే అసంతృప్తిలో ఉన్నారు. జిల్లాలో రాజశేఖర్‌రెడ్డి హయంలో జరిగిన అభివృద్ధి, జగన్‌పాలనలో జరిగిన అభివృద్ధి పోల్చుకుంటూ వైసీపీ శ్రేణులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు జిల్లాలోని

సమరానికి సన్నద్ధం

1 నుంచి ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తూ ‘ఇదేం ఖర్మ’ అంటూ ఇంటింటికీ

నియోజకవర్గాల్లో 60 శాతం ఓటర్లను కలిసేలా ప్లానింగ్‌

వైసీపీ వైఫల్యాలను 8.40 లక్షల మందికి వివరించేందుకు ప్లాన్‌

లోకల్‌ సమస్యలపై ప్రత్యేక గురి

జనం నుంచి సమస్యల సేకరణ.. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పూర్తి చేస్తామని హామీ

ప్రతి నియోజకవర్గంలో 50 చోట్ల కార్యక్రమం

30 చోట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కచ్చితంగా పాల్గొనాల్సిందే

టీడీపీ ఎన్నికల వ్యూహకర్త రాబిన్‌శర్మ టీం పర్యవేక్షణ

డిసెంబరు లేదా జనవరి మొదటివారంలో జిల్లాకు చంద్రబాబు రాక

రానున్న సార్వత్రిక ఎన్నికలు ఈసారి హోరాహోరీగా సాగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఇప్పటినుంచే టీడీపీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళుతోంది. జగన్‌ సర్కారు జనంపై వేసిన పన్నుల భారాన్ని వివరిస్తూ ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ‘ఇదేం ఖర్మ’ పేరుతో మూడున్నరేళ్ల జగన్‌ పాలన వైఫల్యాలను వివరిస్తూ నియోజకవర్గాల్లో 60 శాతం ఓటర్లను కలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి నియోజకవర్గాల క్లస్టర్‌ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసింది. ఇటీవల మైదుకూరులో బద్వేలు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాలకు సంబంధించి నిర్వహించగా బుధవారం కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాలకు చెందిన క్లస్టరు స్థాయి పరిధిలోని కార్యకర్తలతో కడపలో సమావేశం నిర్వహించారు. ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని ఇంటింటికీ ఎలా తీసుకెళ్లాలి, ప్రతి ఒక్కరినీ కలిసి జగన్‌ వైఫల్యాలు ఎలా తెలపాలి, స్థానిక సమస్యలపై రచ్చబండ, జనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి ఏ విధంగా నమోదు చేయాలో కార్యకర్తలకు నేతలు దిశానిర్దేశం చేశారు.

(కడప - ఆంధ్రజ్యోతి): వైసీపీ మూడున్నరేళ్ల పాలనపై జగన్‌ వీరాభిమానులే అసంతృప్తిలో ఉన్నారు. జిల్లాలో రాజశేఖర్‌రెడ్డి హయంలో జరిగిన అభివృద్ధి, జగన్‌పాలనలో జరిగిన అభివృద్ధి పోల్చుకుంటూ వైసీపీ శ్రేణులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు జిల్లాలోని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు భూములను, ఇసుకను కొల్లగొట్టి పేదల కడుపు కొడుతున్నారు. జగన్‌ పాలనపై ఉన్న అసంతృప్తిని సీఎం జిల్లాలో ప్రతిపక్ష హోదాలో టీడీపీ క్యాచ్‌ చేసుకోవాల్సి ఉంది. కేవలం కొందరు షోకుల రాయుళ్లుగా మారి ప్రెస్‌మీట్లకే పరిమితమవుతున్నారు. టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చే కార్యక్రమాలు తప్ప స్థానికంగా ఉన్న సమస్యలపై దృష్టి పెట్టలేదు. నిజం చెప్పాలంటే మొద్దునిద్రలో ఉన్నారు. పసుపు జెండా అంటే ప్రాణమిచ్చే అసలు సిసలు కార్యకర్తలే కొందరు ఇన్‌చార్జిలు, జిల్లా నేతల తీరు చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో చంద్రబాబు పర్యటన సక్సెస్‌ కావడం వీరిలో ఉత్తేజాన్ని నింపింది. వచ్చే ఎన్నికల్లో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే అందుకు తగ్గట్లుగా పైస్థాయి నాయకులు లేరంటూ వీరు వాపోతున్నారు.

ఇదేం ఖర్మ

జగన్‌ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లేందుకు ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమాన్ని టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని సక్సెస్‌ చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. గతంలోలా మొక్కుబడిగా కాకుండా ఈసారి పకడ్బందీగా రూపొందిస్తోంది. డిసెంబరు నెల అంతా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఆయా నియోజకవర్గంలో కలియతిరిగేలా ప్లాన్‌ చేశారు. ఫొటోలకు ఫోజు కాకుండా ప్రభుత్వ వైఫల్యాలు వివరించాలంటూ సూచించారు.

ప్రభుత్వ వైఫల్యాలు

జగన్‌ పాలనలో ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తూ జనంలోకి వెళ్లనున్నారు. ఇందుకు తగ్గట్లు టీడీపీ ఒక ప్రొఫార్మా తయారు చేసింది. అందులో ఆ వ్యక్తి పేరు, మొబైల్‌ నెంబరు పొందుపరుస్తారు. ఈ ప్రభుత్వంలో మిమ్మల్ని బాధించే అంశాలు ఏవి అంటూ.. నిరుద్యోగ సమస్య, అడ్డగోలుగా నిత్యావసర ధరలు, మద్యపానం, మాదక ద్రవ్య సమస్య, కుంటు పడ్డ అభివృద్ధి, తాగునీటి సమస్య, అవినీతి, మహిళా భద్రత, కరెంటు సమస్య, దుర్భర రోడ్లు, నిధుల దుర్వినియోగం, గిట్టుబాటు ధరలు, రాజధాని రాజకీయాలు, నిలకడలేని పాలనపై జనం నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోనున్నారు.

60 శాతం ఓటర్లు లక్ష్యంగా

ఇదేం ఖర్మ పేరుతో ఒక్కో నియోజకవర్గంలో 1.20 లక్షల ఓటర్లను నేరుగా కలవాలనేది టీడీపీ ఉద్దేశ్యం. అంటే దాదాపు నియోజకవర్గ ఓటర్లలో 60 శాతం ఓటర్లను కనెక్ట్‌ అయ్యే విధంగా కార్యక్రమం రూపొందించారు. అంటే జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో దాదాపు 8.40 లక్షల ఓటర్లను కలిసి ప్రభుత్వ వైఫల్యాలను వివరించనున్నారు.

అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కారం

ఇదేం ఖర్మ.. కార్యక్రమం ఓ విధంగా చూస్తే ఇది స్థానికంగా ఎన్నికల హామీగా భావించవచ్చు. జగన్‌ వైఫల్యాలు వివరించడం, నేరుగా ఇన్‌చార్జి, కార్యకర్తలు జనంతో కలవడంతో పాటు రచ్చబండ నిర్వహించనున్నారు. అలాగే స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను జనం నుంచి విన్నపాలు స్వీకరించనున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పాటు ఆ సమస్యలను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపించనున్నారు.

ప్రతి ఇన్‌చార్జి 30 చోట్ల తప్పనిసరిగా పాల్గొనాల్సిందే

ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి నియోజకవర్గంలో 50 చోట్ల కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. కడప అసెంబ్లీ అంతా కార్పొరేషన్‌ పరిధిలో ఉంది. దీంతో ఇక్కడ అన్నిడివిజన్లలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పులివెందుల నియోజకవర్గంలో మున్సిపాలిటీలో 15వార్డుల్లో, మిగతా 35 చోట్ల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రొద్దుటూరుపై ప్రధాన దృష్టి సారించారు. అక్కడ ఎక్కువగా వార్డుల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో జమ్మలమడుగు మున్సిపాలిటీ, యర్రగుంట్ల మున్సిపాలిటీలో పది చొప్పున సమావేశాలు, గ్రామ పంచాయతీలో 30 చోట్ల నిర్వహించనున్నారు. బద్వేలులో 15 వార్డుల్లో, మరో 30 చోట్ల నిర్వహించనున్నారు. కమలాపురం, మైదుకూరులో 10 చొప్పున వార్డుల్లో, మరో 40 పంచాయతీల్లో కార్యక్రమం చేపట్టనున్నారు.

రాబిన్‌ టీం పర్యవేక్షణ

టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్‌ శర్మ వ్యవహరిస్తున్నారు. నాలుగు రోజుల కిందట విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పార్టీ సమావేశంలో ఇదేం ఖర్మ కార్యక్రమంపై రాబిన్‌ శర్మ బృందం ప్రసంగించింది. జిల్లాలో ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు రాబిన్‌ శర్మ బృందం నియోజకవర్గానికి ఒకరిని నియమించింది. అలాగే పార్లమెంటు పరిధిలో కార్యక్రమం అమలు తీరును పర్యవేక్షిస్తోంది. ఈ మేరకు మైదుకూరు, కడపలో జరిగిన నియోజకవర్గాల క్లస్టరు సమావేశాల్లో రాబిన్‌ శర్మ బృందం పాల్గొని కార్యక్రమం అమలుపై పలు సూచనలు చేశారు.

చంద్రబాబు రాక

బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు జిల్లాలో పర్యటించారు. కడపలో జరిగిన కార్యకర్తల సమావేశంతో పాటు కమలాపురంలో ప్రసంగించారు. ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమానికి డిసెంబరు చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో చంద్రబాబు హాజరవుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Updated Date - 2022-11-24T00:24:35+05:30 IST

Read more