పదోన్నతిలో పైరవీలు..

ABN , First Publish Date - 2022-09-27T06:00:17+05:30 IST

జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలు ఎన్నో ఏళ్లుగా గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కార్యకర్తలుగా పదేళ్లు పూర్తయిన వారికి గ్రేడ్‌-2 సూపర్‌వైజరుగా అవకాశం ఇస్తూ అఽధికారులు నోటిఫికేషన్‌ విడుదల

పదోన్నతిలో పైరవీలు..

అంగన్వాడీ గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టుల్లో గోల్‌మాల్‌

పదోన్నతి పరీక్షల్లో రాజకీయ పెత్తనం

చక్రం తిప్పిన ఓ నేత 

ఒక్కో పోస్టుకు రూ.8 నుంచి రూ.10 లక్షలు వసూళ్లు


అంగన్‌వాడీ గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టుల పదోన్నతుల్లో భారీ ఎత్తున గోల్‌మాల్‌ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పదోన్నతి పరీక్షల్లో రాజకీయ పైరవీలు చోటు చేసుకున్నట్లు విమర్శలున్నాయి. డీల్‌ కుదుర్చుకున్న కొందరు పరీక్షల్లో ఉత్తీర్ణులైనట్లు అంటున్నారు. ఒక్కో పోస్టుకు రూ.5లక్షల నుంచి 8లక్షల దాకా వసూలు చేసినట్లు ప్రచారం ఉంది. ఈ వ్యవహారంలో జిల్లాకు చెందిన ఓ నేత ప్రధాన పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. పరీక్షల కీ వదలకుండానే గుట్టుచప్పుడు కాకుండా ఆదివారం లిస్టు ప్రకటించడం దుమారం రేపుతోంది. పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలనే  డిమాండ్‌ వినిపిస్తోంది.


(కడప - ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలు ఎన్నో ఏళ్లుగా గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కార్యకర్తలుగా పదేళ్లు పూర్తయిన వారికి గ్రేడ్‌-2 సూపర్‌వైజరుగా అవకాశం ఇస్తూ అఽధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లాకు సంబంధించి 60 సూపర్‌వైజరు పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. మహిళా స్ర్తీ శిశు సంక్షేమశాఖ ఈ నెల 5న నోటిఫికేషన్‌ జారీ చేసింది. 18న కర్నూలులో పరీక్ష నిర్వహించారు. నోటిిఫికేషన్‌, పరీక్షను కేవలం 13 రోజుల వ్యవధిలోనే నిర్వహించారు. ఇంత తక్కువ వ్యవధిలో పదోన్నతి పరీక్ష నిర్వహించడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. విమర్శలూ చేశారు.


రాజకీయ పైరవీలు

జిల్లాలో అవుట్‌ సోర్సింగ్‌ మొదలుకుని ఏ ఉద్యోగ నియామకాలు చేపట్టినా కొందరు నేతలు బేరం పెడతారనే ఆరోపణలున్నాయి. సుమారు 60 సూపర్‌వైజరు పోస్టులు ఉండడం, వేతనం రూ.35వేల వరకు ఉండడంతో ఈ పోస్టులకు గిరాకీ ఏర్పడిందని చెబుతున్నారు. దీంతో కొందరు ఓ నేత అనుచరులతో డీల్‌ కుదుర్చుకున్నట్లు సమాచారం. జిల్లాలో కీలక నేత కావడంతో ఆయన ఓకే.. అంటే పోస్టు వస్తుందన్న నమ్మకంతో పలువురు డీల్‌ కుదుర్చుకున్నట్లు చెబుతున్నారు. రూ.8లక్షల నుంచి రూ.10 లక్షల దాకా కొందరు డీల్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18న కర్నూలులో పరీక్ష నిర్వహించగా జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే డీల్‌ కుదుర్చుకున్న కొందరి పేర్లు జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

పరీక్షకు 45 మార్కులు, ఇందులో ఉత్తీర్ణులైన వారికి 5 మార్కులకు సంబంధించి స్పోకెన్‌ ఇంగ్లీషు ఆడియో పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో క్వాలిఫై అయిన వారికి సూపర్‌వైజరు పోస్టు కేటాయించాల్సి ఉంది. అయితే స్పోకెన్‌ ఇంగ్లీషుకు సంబంధించి వీడియో తీసి పంపించాలని కొందరి పేర్లతో కూడుకున్న జాబితా బయటికి రావడం విమర్శలకు తావిచ్చింది. అంగన్వాడీ కార్యకర్తల స్పోకెన్‌ ఇంగ్లీషుకు సంబంధించి మూడు నిమిషాల వీడియోను పంపించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆ జాబితా బయటికి వచ్చింది. కీ, రాత పరీక్షల ఫలితాలు విడుదల చేయకుండానే కేవలం కొందరి పేరిట మాత్రమే జాబితా బయటికి రావడంతో అవకతవకలు జరిగాయంటూ పలువురు ఆరోపిస్తున్నారు.


పరీక్ష రద్దు చేయాలి

- ఈశ్వరయ్య, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

అంగన్వాడీ సూపర్‌వైజరు పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఒక్కో పోస్టు కోసం రూ.8లక్షల నుంచి రూ.పది లక్షలు వసూలు చేశారు. నాయకులు, అఽధికారులు కుమ్మక్కై అర్హులకు అన్యాయం చేశారు. పరీక్ష నియామకాల్లో పారదర్శకత లేదు. కనుక పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి.


పదోన్నతి పరీక్షల్లో అక్రమాలు

- ఎల్‌.నాగసుబ్బారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి

అంగన్వాడీ గ్రేడ్‌-2 సూపర్‌వైజరు పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఆగమేఘాల మీద ఈ నెల 5న నోటిఫికేషన్‌ జారీ చేసి 12 వతేదీ చివరి తేదిగా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండానే కార్యకర్తల వద్ద మూడు సెట్ల దరఖాస్తులు తీసుకున్నారు. అధికార పార్టీకి అనుకూలమైన వారి పేర్లను మాత్రమే ఐసీడీఎస్‌ అధికారులు అర్హత జాబితాలో చేర్చారు. మళ్లీ పరీక్షలు నిర్వహించాలి.

Read more