పేదలపై దౌర్జన్యం

ABN , First Publish Date - 2022-11-11T23:23:47+05:30 IST

మాసాపేట పారిశుధ్యకాలనీలో కార్పొరేషన్‌ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసుల అండతో ఇళ్లు కూల్చారు. గతంలో మేమున్నామంటూ చెప్పిన అధికార నేతలు ఇంత జరుగుతున్నా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

పేదలపై దౌర్జన్యం

నోటీసులు లేకుండా ఇళ్ల కూల్చివేత

పారిశుధ్య కార్మికుల ఆందోళన

కడప(కలెక్టరేట్‌), నవంబరు 11: మాసాపేట పారిశుధ్యకాలనీలో కార్పొరేషన్‌ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసుల అండతో ఇళ్లు కూల్చారు. గతంలో మేమున్నామంటూ చెప్పిన అధికార నేతలు ఇంత జరుగుతున్నా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

మాసాపేట ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పారిశుధ్య పనులు, ఇతర కూలీనాలీ చేసే నిరుపేద దళితులు నివాసాలున్నారు. దాదాపు వంద ఏళ్లకు పైగా ఇక్కడ నివాసం ఉన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా అప్పట్లో గాంధీ మహాత్ముడు కడపకు వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఇంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న మాసాపేటలోని దళితుల ఇళ్లను రోడ్డు విస్తరణలో భాగంగా కార్పొరేషన్‌ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా శుక్రవారం దౌర్జన్యంగా ఇళ్లు కూల్చారు. దీంతో రోడ్డు కిరువైపులా నివాసాలుండే నిరుపేద దళితులు, పారిశుధ్య కార్మికులు లబోదిబోమంటున్నారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఉన్నతాధికారుల ఆదేశాలంటూ ఇళ్లు కూల్చి వేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కొంత సమయం కావాలంటూ సాయంత్రం విజిట్‌కు వచ్చిన కమిషనరును వేడుకున్నా కనికరించలేదని వాపోయారు. జగనన్నకు ఓట్లేసినందుకు గుణపాఠం చెప్పారని, ఎదిరిస్తే కేసులు పెడతారని భయంతో ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము నగర అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అయితే తమకు నిలువనీడ లేకుండా చేయడం తగదని వారు అంటున్నారు.

Updated Date - 2022-11-11T23:23:52+05:30 IST