భూముల నమోదులో తిర‘కాసు’లు..

ABN , First Publish Date - 2022-09-17T11:40:17+05:30 IST

భూముల నమోదులో పలు చోట్ల రెవెన్యూ సిబ్బంది తిరకాసు పెడుతున్నా రని రైతులు వాపోతున్నారు. కాసులిచ్చే వారికే నమోదు అవుతున్నాయని పేదలను పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వమిచ్చే రాయితీ విత్తనాలు,

భూముల నమోదులో తిర‘కాసు’లు..

ఆన్‌లైన్‌ నమోదులో అవస్థలు

ఆప్షన్‌ లేదంటున్న అధికారులు

ఇబ్బందుల్లో రైతులు

ప్రొద్దుటూరు, సెప్టెంబరు 16: భూముల నమోదులో పలు చోట్ల రెవెన్యూ సిబ్బంది తిరకాసు పెడుతున్నా రని రైతులు వాపోతున్నారు. కాసులిచ్చే వారికే నమోదు అవుతున్నాయని పేదలను పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వమిచ్చే రాయితీ విత్తనాలు, ఎరువులు, రుణాలు లాంటి ప్రయోజనాలు పొందాలంటే రెవెన్యూ రికార్డుల్లో రైతులకు సంబంధించి వ్యక్తిగత వివరాలతో పాటు భూమి వివరాల నమోదు తప్పనిసరి. ఏదైనా కారణం చేత రైతు తన భూమి వివరాలను ఆన్‌లైన్‌ చేయించుకోకపోతే ఇక వారికి తిప్పలు తప్పడంలేదు. సంవత్సరాల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం ఉండడం లేదని రైతులు వాపోతున్నారు. వాస్తవంగా క్షేత్ర స్థాయిలో భూములు సాగు చేసుకోవడంతో పాటు అన్ని రకాల ధ్రువపత్రాలు రైతుల వద్ద ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల రీత్యా గతంలో ఆన్‌లైన్‌ చేయకపోవడం, విస్తీర్ణం నమోదు విషయంలో తప్పులు దొర్లాయి. వాటిని సరిదిద్దాలని కోరుతూ అధికారులు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా 

సమస్య పరిష్కారం కావడంలేదని రైతులు అంటు న్నారు.


నమోదులో తిరకాసులు

- భూములను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో పలు మండలాల్లో తిరకాసులు చోటు చేసుకున్నట్లు తెలిసింది. వీరపునాయునిపల్లె మండలంలోని సౌత్‌ పాలగిరి రెవెన్యూ పొలంలో గతంలో ఎస్సీ కార్పొరేషన్‌ భూమి కొనుగోలు పథకం ద్వారా పాలగిరికి చెందిన దళితులకు భూ పంపిణీ చేశారు. ఇది జరిగి 20 ఏళ్లకు పైగా అవుతోంది. అయితే ఆ భూముల్లో మరో సామాజిక వర్గానికి చెందిన వారి పేర్లను నమోదు చేశారు. విషయం తెలిసి బాధితులు పట్టాదారు పాసుపుస్తకాలు, రిజిస్టరు దస్తావేజులు, ఈసీలాంటి ఽధ్రువపత్రాలు చూపించి ఆన్‌లైన్‌ చేయాలంటూ సంబంధిత తహసీల్దారు కార్యాలయం చుట్టూ దాదాపు ఐదేళ్లుగా తిరుగుతు న్నా మార్పులు చేయడంలేదు. దీంతో భూమితో ఎలాంటి సంబం ధం లేని వ్యక్తి కేవలం ఆన్‌లైన్‌ ఆధారంగా ప్రభుత్వం నుంచి అందు తున్న ప్రయోజనాలు పొందుతున్నారు. 

- చాపాడు మండలం పల్లవోలు గ్రామ పొలంలో ఏప్రిల్‌ నెలలో ఆన్‌లైన్‌ చేశారు. ఇందుకు రైతు, అఽధికారుల మధ్య లక్షలాది రూపాయల ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఒప్పందం చేసుకున్న మొత్తంలో కొంత తగ్గించి ఇవ్వడంతో సంబంధిత రైతుకు పాసు పుస్తకం ఇవ్వకుండా దరఖాస్తు తిరస్కరించినట్లు తెలుస్తోంది. 

- ఇదే మండలంలో మృతిచెందిన భార్య పేరుతో ఉన్న భూమిని భర్త పేరుతో ఆన్‌లైన్‌ చేసేందుకు లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు సమాచా రం. నిబంధనలకు విరుద్ధంగా చుక్కల భూములను కూడా చాపాడు మండలంలో ఆన్‌లైన్‌ చేసి లక్షలాది రూపాయలు రెవెన్యూ యంత్రాంగం తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. 

- మరికొన్ని మండలాల్లో ఆన్‌లైన్‌ చేయాలని రెవెన్యూ అధికారులకు వినతులు ఇచ్చినా పట్టించుకో వడం లేదని రైతులు అంటున్నారు. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. పిత్రార్జితం రీత్యా వచ్చిన ఆస్తులకు సంబంధించి సర్వే నెంబరును సబ్‌ డివిజను చేయకపోవడం వల్ల రైతుల వివరాలు ఎక్కించడం లేదని కొన్నిచోట్ల అంటున్నారు. అర్హులైన పేదలు మాత్రం తమ భూములు ఆన్‌లైన కాక, ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రయోజనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. 


మూడేళ్లుగా తిరుగుతున్నాం..

- ఆలమూరు సుభాన్‌, రైతు, టంగుటూరు

నాకు దువ్వూరు మండలం జిల్లెల్ల రెవెన్యూ గ్రామంలో పొలం ఉంది. ఆ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌ పుస్తకం తదితర రికార్డులు నా వద్ద ఉన్నాయి. కానీ ఆన్‌లైన్‌ చేయకపోవడంతో ప్రభుత్వం అందించే ప్రయోజనాలు నాకు దక్కడంలేదు. ఆన్‌లైన్‌లో నా వివరాలు నమోదు చేయాలని మూడేళ్లుగా తిరుగుతున్నాం. అధికారులు సాంతికేతిక కారణాలు అంటూ సమస్య పరిష్కరించడం లేదు.


ఐదేళ్లుగా తిరుగుతున్నాం..

- ధనలక్షుమ్మ, రైతు, పాలగిరి

జీవనాధారం కోసం ఎస్సీ కార్పొరేషన్‌ దాదాపు 20 సంవత్సరాల క్రితం భూమి కొనుగోలు పథకం కింద మాకు భూమిని ఇచ్చింది. అయితే ఆన్‌లైన్‌ నమోదులో మాకు ఉండాల్సిన 1.90 ఎకరాలకు బదులు 60 సెంట్లు మాత్రమే ఎక్కించారు. మిగిలిన భూమి ఆన్‌లైన్‌ చేయాలని పలు దఫాలుగా వినతులు ఇచ్చినాం. మా భూమి ఎటువంటి సంబంధం లేని వ్యక్తి పేరు మీద ఆన్‌లైన్‌లో నమోదైంది. ఐదేళ్లుగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరిగినా సమస్య పరిష్కరించలేదు. ఆన్‌లైన్‌లో భూమి నమోదు కాకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు పొందలేకపోతున్నాను.

Updated Date - 2022-09-17T11:40:17+05:30 IST