సాదా సీదాగా...

ABN , First Publish Date - 2022-09-25T06:11:46+05:30 IST

జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన స్టాండింగ్‌ కమిటీల సమావేశం సాదా సీదాగా సాగింది. ఉదయం 9 గంటల నుంచి వధ్యాహ్నం 12-30 గంటల వరకు కొనసాగించి సప్పగా ముగించేశారు. ఆరు స్టాండింగ్‌ కమిటీ సమావేశాలకు గాను ఒక్కో

సాదా సీదాగా...
అధికారులతో సమీక్షిస్తున్న జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథరెడ్డి

అధికారులు పుల్‌... ప్రజాప్రతినిధులు డల్‌

సమస్యలపై అరకొరగా చర్చ

జడ్పీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం ప్రగతి నివేదికలతో సరి

కడప(రూరల్‌) సెప్టెంబర్‌ 24 : జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన స్టాండింగ్‌ కమిటీల సమావేశం సాదా సీదాగా సాగింది. ఉదయం 9 గంటల నుంచి వధ్యాహ్నం 12-30 గంటల వరకు కొనసాగించి సప్పగా ముగించేశారు. ఆరు స్టాండింగ్‌ కమిటీ సమావేశాలకు గాను ఒక్కో కమిటీకి 40 నిమిషాలు మాత్రమే లభించింది. ఈ 40 నిమిషాల వ్యవధి కూడా ఒక్కొక్క కమిటీలో 5 నుంచి 10 మంది వరకు ఉన్న జిల్లా శాఖల అధికారులు వారి ప్రగతి నివేదికలు చదివి వినిపించడానికే సరిపోయింది. సమోస-బిస్కెట్‌, టీ-కాఫీల సమయాన్ని కూడా ఇందులోనే సరిపుచ్చారు. ఈ కాస్త సమయంలో ఎంతమేర చర్చ జరపడానికి వీలుపడుతుందో ఏలికలకే ఎరుక. వెరసి స్టాండింగ్‌ కమిటీల సమావేశ లక్ష్యం ఆమడ దూరంలో ఉండిపోయింది...


ప్రశ్నలు లేదు.. నివేదికలే

జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథరెడ్డి అధ్యక్షతన తన చాంబర్‌లో గ్రామీణ అభివృద్ధ్ది స్థాయి సంఘం, విద్య, వైద్యసేవల స్థాయి సంఘం, ప్రణాళిక, ఆర్థిక స్థాయి సంఘం సమావేశాలు నిర్వహించారు. అలాగే వైస్‌ చైర్‌పర్సన్‌-1 జె.శారద అధ్యక్షతన మహిళా సంక్షేమం స్థాయి సంఘ సమావేశం, వైస్‌ చైర్మన్‌-2 పిట్టు బాలయ్య ఆధ్యక్షతన వ్యవసాయ స్థాయి సంఘం సమావేశం, చిట్వేలి జడ్పీటీసీ సి.పుష్పలత అధ్యక్షతన సాంఘిక సంక్షేమ స్థాయి సంఘం సమావేశాలు కొనసాగాయి. ఈ సమావేశాలకు కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన ఆయా శాఖల జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో హాజరై వారి ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో జడ్పీ చైర్మన్‌ సైతం ఎప్పటిలాగానే జిల్లా వాసి సీఎం కావడంతో అందరి దృష్టి ఇక్కడే ఉంటుందని, అధికారులు బాధ్యతగా పనిచేసి జిల్లాకు మంచిపేరు తేవాలని చెప్పుకొచ్చారు.

జడ్పీ స్థాయి సంఘాల సమావేశాలంటే గతంలో అధికారులు సమాధానాలు చెప్పలేక హడలిపోయేవారు. ఇప్పుడు జరుగుతున్న సమావేశాల నిర్వహణ చూసి అదేముందిలే అనే పరిస్థితికి వచ్చారు. ఆయా స్టాండింగ్‌ కమిటీల అధ్యక్షులతో పాటు జడ్పీటీసీ సభ్యుల నుంచి పెద్దగా ప్రశ్నలు లేకపోవడంతో అధికారులు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేకుండా పోతోంది. ఈ కోవలోనే సమీక్షలు తూతూ మంత్రంగా సాగుతున్నాయన్న అరోపణలు వినిపిస్తున్నాయి. స్థాయి సంఘాలు ఏర్పడిన నాటి నుంచి ఇప్పటికి నాలుగు దఫాలు సమావేశాలు నిర్వహించి ఎలాంటి నిర్ణయాలు లేకుండానే మమ అనిపించారు. అలాంటప్పుడు సమీక్షలు నిర్వహించి ఏమి ఫలితమని ప్రజలు పెదవి విరుస్తున్నారు. 


సమస్యలపై అరకొరగా చర్చ

స్టాండింగ్‌ కమిటీ సమావేశాలలో ప్రణాళిక ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య వైద్యసేవలు, స్త్రీ సంక్షేమం, సాంఘిక సంక్షేమంపై సమీక్షించారు. ఇందులోని సభ్యులు (జడ్పీటీసీలు) ఆయా శాఖలపై చర్చసాగించి సమస్యలపై అరకొరగా మాట్లాడారు. బి.కోడూరు జడ్పీటీసీ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిసరాలు ఆపరిశుభ్రంగా ఉండడంతో విషపురుగులు సంచరిస్తున్నాయన్నారు. పోరుమామిళ్ల జడ్పీటీసీ మాట్లాడుతూ గైనకాలజిస్టు పోస్టు ఖాళీగా ఉందన్నారు. కో-ఆపరేటివ్‌ సభ్యులు ఖాదర్‌ అంగన్‌వాడీ సెంటర్లలో ఉండాల్సిన కోడి గుండ్లు టిఫిన్‌ సెంటర్లలో లభ్యమవుతున్నాయని చెప్పారు. పోరుమామిళ్ల జడ్పీటీసీ మాట్లాడుతూ అంగన్‌వాడీ సెంటర్లకు కుళ్లిపోయిన కోడిగుడ్లు వస్తున్నాయన్నారు. కాశినాయన మండల జడ్పీటీసీ డ్రైన్లు సరిగా లేవన్నారు. చక్రాయపేట జడ్పీటీసీ రబీ సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందించాలన్నారు.


వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి

ముఖ్యమంత్రి వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారని ఇందుకు తగ్గట్టుగా అధికారులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని కమిటీ అధ్యక్షుడు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలయ్య పేర్కొన్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖలపై సంబంధిత జిల్లా అధికారులతో చర్చించారు. గ్రామ స్థాయిలో ఏర్పాటుచేసిన ఆర్‌బీకేల ద్వారా ప్రభుత్వం సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు నేరుగా వారి గ్రామాలలోనే రైతులకు అందుతున్నాయన్నారు. రబీ సీజన్‌కు సంబంధించిన వాటిని రైతులకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - 2022-09-25T06:11:46+05:30 IST