ఇసుక తవ్వకాలపై అధికారుల సీరియస్‌

ABN , First Publish Date - 2022-09-19T05:50:18+05:30 IST

మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి..మేం మాత్రం ఇసుక తీస్తూనే ఉంటాం..తోలుతూనే ఉంటాం. మీకు ఉద్యోగం చేయడం చేతకాకుంటే సైలెంట్‌గా ఉండండి అంటూ పెద్దతిప్పసముద్రం మండలం బూర్లపల్లెకు చెందిన ఓ చోటా నాయకుడు పోలీసు, రెవెన్యూ అధికారులతో చెప్పిన మాటలివి.

ఇసుక తవ్వకాలపై అధికారుల సీరియస్‌
ఇసుక డంప్‌భాగంలో కొంత తరలించిన ప్రాంతం

డంప్‌ల తరలింపునకు తాత్కాలిక బ్రేక్‌  

పెద్దనేత ఫోన్‌తో మెత్తబడిన అధికారులు

ఇసుకను తవ్వుతాం..తరలిస్తాం... మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి 

అధికారులకు చోటా నాయకుడి వార్నింగ్‌


మదనపల్లె, సెప్టెంబరు 18: మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి..మేం మాత్రం ఇసుక తీస్తూనే ఉంటాం..తోలుతూనే ఉంటాం. మీకు ఉద్యోగం చేయడం చేతకాకుంటే సైలెంట్‌గా ఉండండి అంటూ పెద్దతిప్పసముద్రం మండలం బూర్లపల్లెకు చెందిన ఓ చోటా నాయకుడు పోలీసు, రెవెన్యూ అధికారులతో చెప్పిన మాటలివి. అధికారిక దందా పేరుతో పీటీఎం మండలం సంపతికోటవాగులో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వెలువడింది. దీనికి రెవెన్యూ, పోలీసు, ఎస్‌ఈబీ అధికారులు స్పందించారు. వాగులోని ఇసుక రాసులను పరిశీలించారు. వాటిని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసే క్రమంలో ఓ చోటా నాయకుడికి, రెవెన్యూ, పోలీసుల మధ్య చిన్నపాటి వివాదమే జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. కర్ణాటక నుంచి మొదలైం పీటీఎం మండలంలో సంపతికోటవాగు ప్రవహిస్తోంది. ఇందులో భాగంగా వాగునకు అటు జెట్టివారిపల్లె, ఇటు అంకిరెడ్డిపల్లె వద్ద యంత్రాలతో ఇసుకతోడి రాసులు పోసిన అధికార పార్టీ చోటా నాయకుడిని అక్కడి  ఎస్‌ఐ మధురామచంద్రుడు పిలిపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇసుక స్వాధీనం చేసుకుని సీజ్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఇసుకను బయటకు అక్రమంగా తరలించకూడదని ప్రభుత్వ పనులకు మాత్రమే వినియోగించాలని సూచించారు. 

ఇందులో భాగంగా ప్రభుత్వ పనులకు సంబంధించిన వర్క్‌ ఆర్డర్‌ను బట్టి పనులకు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో బూర్లపల్లెకు చెందిన ఆ చోటా ప్రజాప్రతినిధి నిరాకరించారు. ఇసుక తీస్తాం, తరలిస్తాం. మీకు చేతనైంది చేసుకోండి..మొదటగా మీరు ఉద్యోగం చేయడం నేర్చుకోండనే విధంగా ఎస్‌ఐతో వాదించినట్లు తెలిసింది. ఎస్‌ఐ కూడా చోటా నాయకుడికి తనదైన శైలిలోనే సమాధానం చెప్పారు. దీంతో అసహనానికి గురైన ఆ నాయకుడు వెంటనే ఓ పెద్దస్థాయి ప్రజాప్రతినిధికి ఫోన్‌ కలిపి మాట్లాడమని ఎస్‌ఐకి ఇచ్చారు. ఎస్‌ఐగారు ఆయన మనవాడే..మీరు కాస్త చూసుకుని వెళ్లండనే సమాధానం రావడంతో ఆయన కాస్తా వెనక్కి తగ్గడంతో చోటా నాయకుడికి మరింత ఊపు వచ్చినట్లయింది. అప్పటికే ఎస్‌ఐ.. ఇసుక డంప్‌లను సీజ్‌ చేయాలని రెవెన్యూ అధికారులకు లేఖ పంపారు. ఇందులో భాగంగా ఆ ఇసుక వ్యాపారి తర్వాత రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి అక్కడా ఇన్‌ఛార్జి తహసీల్దార్‌ విద్యాసాగర్‌తో వాదనకు దిగినట్లు సమాచారం. ఇసుక తవ్వకం, తరలింపులో ఏమాత్రం ఉపేక్షించబోమని, సీజ్‌ చేయమని ఎస్‌ఐ పంపిన లేఖను చూపించారు. అనుమతి లేకుండా ఎలా తవ్వుతారని ఆయన చోటా నాయకుడిని ప్రశ్నించారు. డంప్‌లను సీజ్‌ చేయండి చూద్దాం, మీరెలా చేస్తారో అది కూడా చూస్తాననే విధంగా వాదించినట్లు తెలుస్తోంది. 

పోలీసులు ఇచ్చిన ఆదేశాలను తాము పాటించాల్సిందేనని, ఇందులో ఎలాంటి మినహాయింపు లేదని కాస్త గట్టిగా చెప్పినట్లు తెలిసింది. అంతలో ఆయన మరోసారి అదే నాయకుడికి ఫోన్‌ చేసి మాట్లాడమని ఇవ్వడంతో ఇన్‌ఛార్జి తహసీల్దార్‌ కాస్త మెత్తబడ్డారు. సార్‌ చెప్పారు..కాబట్టి వదిలేస్తున్నా..ఇంకోసారి చేస్తే ఉపేక్షించబోమనే విధంగా చెప్పి పంపినట్లు తెలిసింది. ఇలా అటు ఎస్‌ఐ, ఇటు ఇన్‌ఛార్జి తహసీల్దార్‌తోనూ ఓ పెద్దస్థాయి ప్రజాప్రతినిధి నుంచి ఫోన్‌ చేయించడంతో అధికారులు కొంత మెత్తబడి వదిలేసినట్లు చెబుతున్నారు. ఇదిలావుండగా అంతకుముందే ఎస్‌ఈబీ సీఐ, డీఎస్పీ, ఆర్డీవో అందరూ సంబంధింత శాఖల అధికారులపై ఒత్తిడి పెంచి ఇసుక డంప్‌లు సీజ్‌ చేయాలని ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ పనులకు కేటాయించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇన్‌ఛార్జి తహసీల్దార్‌ వివిధ పనుల వారీగా మొత్తం 130 ట్రాక్టర్‌ లోడులు కేటాయించారు. అయితే సంపతికోటవాగులో సుమారు 500 ట్రాక్టర్ల లోడులు ఇసుక ఉంటుందని అటు ఎస్‌ఐ, ఇటు ఎస్‌ఈబీ సీఐలు అధికారులకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతిలో కథనం రావడంతో అప్రమత్తమైన ఇసుక వ్యాపారులు..రాత్రికి రాత్రే అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నించారు. ఇందులోభాగంగా వాగునకు ఓ వైపున ఉన్న డంప్‌ నుంచి కొంత మరోచోటికి తరలించారు. తర్వాత ఉన్నతాధికారుల జోక్యంతో చోటానాయకుడు, మండల స్థాయి అధికారుల మధ్య ఏర్పడిన వివాదంతో తరలింపునకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. అప్పటికే ఆటుపోట్లు ఎదుర్కొన్న చోటా నాయకుడికి నియోజకవర్గం నేత నుంచి కూడా చుక్కెదురైంది. ఈ వ్యవహారంలో తనను సంప్రదించకుండా, డైరెక్ట్‌గా పెద్ద స్థాయి ప్రజాప్రతినిధిని ఆశ్రయించడం పట్ల..ఆయన చోటా నాయకుడిపై గుర్రుగా ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా చోటా నాయకులు (ఇసుక వ్యాపారులు)ను పిలిపించి గట్టిగానే క్లాస్‌ తీసుకున్నట్ల్లు తెలిసింది. 

ఇంతకాలం మండలంలో ఎక్కడ చూసినా కూలీల ద్వారా ట్రాక్టర్లు పెట్టి ఇసుక వ్యాపారం చేసుకుంటున్నా.. తాము అడ్డు చెప్పలేదని, ఇప్పుడెందుకు యంత్రాలు పెట్టి వాగు వెంబడి గుట్టలు పోశారని ప్రశ్నించారు. తద్వారా ప్రతిపక్షాలకు తామేమీ బదులిచ్చేదని, ప్రజల్లోకి ఏం సంకేతాలు పోతాయని మీరు చేసే పనులకు మేం సమాధానం చెప్పాలా? అంటూ చోటా నాయకులకు ఆ ప్రజాప్రతినిధి గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలిసింది. అయితే వాగు వెంట తవ్విన ఇసును ప్రభుత్వ పనులకే వాడతారా? లేక ముందులాగే బయటకు తరలించి సొమ్ముచేసుకుంటారా?అన్నది అధికారులకే తెలియాలి. మరోవైపు ఆ నేత ఇచ్చిన వార్నింగ్‌కు చోటా నాయకులు ఇక నుంచి ఇసుక తవ్వకాలకు చెక్‌ పెడతారా? తరలింపును ఆపేస్తారా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Updated Date - 2022-09-19T05:50:18+05:30 IST