గండికోటలో ఒబెరాయ్‌ సీఈవో

ABN , First Publish Date - 2022-10-12T05:19:30+05:30 IST

పర్యాటక ప్రాంతం గండికోట గ్రామాన్ని మంగళవారం సాయంత్రం ప్రముఖ ఒబెరాయ్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ సీఈవో అర్జున్‌సింగ్‌ ఒబెరాయ్‌ సందర్శించారు. ఈయన వెంట కలెక్టర్‌ విజయరామరాజు, జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ, పలువురు అధికారులు ఉన్నారు.

గండికోటలో ఒబెరాయ్‌ సీఈవో
గండికోట వద్ద పెన్నాలోయను పరిశీలిస్తున్న ఒబెరాయ్‌ హోటల్స్‌ సీఈవో అర్జున్‌ సింగ్‌ ఒబెరాయ్‌, కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఇతర అధికారులు

వెంట కలెక్టర్‌, జేసీ

హోటల్‌ ఏర్పాటుకు సందర్శన?

జమ్మలమడుగు రూరల్‌, అక్టోబరు 11: పర్యాటక ప్రాంతం గండికోట గ్రామాన్ని మంగళవారం సాయంత్రం ప్రముఖ ఒబెరాయ్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ సీఈవో అర్జున్‌సింగ్‌ ఒబెరాయ్‌ సందర్శించారు. ఈయన వెంట కలెక్టర్‌ విజయరామరాజు, జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ, పలువురు అధికారులు ఉన్నారు. వీరు కడప నుంచి నేరుగా ముద్దనూరు మీదుగా గండికోటను చేరుకున్నారు. ముందుగా గండికోట కొట్టాలపల్లె దగ్గరలో రోడ్డుకు ఇరువైపులా భూములను పరిశీలించారు. అక్కడి నుంచి గండికోట ప్రధాన ద్వారం గండికోట ప్రాంగణంలోకి వెళ్లి సహజసిద్ధంగా ఏర్పడిన లోయ ప్రాంతాన్ని, జుమ్మా మసీదును, ఎదురుగా ఉన్న కత్తుల కోనేరును పరిశీలించారు. అనంతరం గండికోట గ్రామంలో పావురాళ్ల మండపం, చార్మినార్‌, ప్రధాన ద్వారం గుండా వెళ్లి చుట్టుపక్కలా చూశారు. అయితే అధికారులు ఎవ్వరూ మీడియాకు మొదట ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఫొటోలు తీసుకుంటున్నా వద్దని వారించారు. కాగా.. ఈ విషయంపై జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులును వివరణ కోరగా... ఇటీవల ఒబెరాయ్‌ హోటల్స్‌ వారికి 50 ఎకరాలు కేటాయిస్తూ క్యాబినెట్‌లో ఆమోదం తెలిపారని అన్నారు. ఇందులో భాగంగా వీరు గండికోట పర్యాటక ప్రాంతంలో ఐదు స్థలాలను పరిశీలించారన్నారు. అయితే ఇక్కడ హోటల్‌ ఏర్పాటు చేస్తారా లేదా అనే విషయంలో వారు స్పష్టత ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు రవీంద్రారెడ్డి, జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం, ముద్దనూరు, కొండాపురం మండలాలకు చెందిన రెవెన్యూ సిబ్బంది, పోలీసు అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.


పర్యాటక ప్రాంతం అభివృద్ధి జరిగేనా..?

గండికోట గ్రామాన్ని ఒబెరాయ్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ సీఈవో సందర్శించడంతో పర్యాటకంగా ఈ ప్రాంతం ఇకనైనా అభివృద్ధి జరగాలని స్థానికులు కోరుతు న్నారు. గతంలో, రెండు రోజుల క్రితం కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ గండికోటలోని ఏపీ టూరిజంకు సంబంధించిన భూములను పరిశీలించారు. ఈ నేప థ్యంలో ఒబెరాయ్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ సీఈవో మంగళవారం ఇక్కడకు రావడం ప్రాధాన్యత సంతరించు కుంది. గండికోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ప్రజా ప్రతినిధులు, అధికారులు చెప్పడం ఇప్పటి వరకూ ప్రకటనలకే పరిమితమైందని స్థానికులు విమర్శిస్తున్నారు. గండికోట ప్రాంతంలో ఒక్క జియో టవర్‌ మాత్రమే పనిచేస్తుందని, మిగతా సెల్‌ టవర్స్‌ పనిచేయక ఇబ్బంది పడుతున్నామని ప్రజలు వాపో తున్నారు. టీడీపీ హయాంలో జరిగిన గండికోట ఉత్సవాల సమయంలో కాస్త అభివృద్ధి జరిగిందని తర్వాత.. ఈ ప్రాంతాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇకనైనా గండికోటను పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Read more