ఓ బొజ్జ గణపయ్య..

ABN , First Publish Date - 2022-08-31T06:13:45+05:30 IST

తొలిపూజలు అందుకునే బొజ్జగణపయ్య నేడు ఊరూరా మండపాలలో కొలువుతీరనున్నాడు. నిర్వాహకులు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో రంగురంగుల విద్యుత్‌దీప కాంతులతో స్వామివారి మండపాలను అందంగా ముస్తాబు చేశారు. వారం రోజులుగా స్వామివారి చవితి వేడుకలకు నిర్వాహకులు మండపాలను సిద్ధం చేశారు.

ఓ బొజ్జ గణపయ్య..
రాజీవ్‌ పార్క్‌ దగ్గర ఏర్పాటు చేసిన గణేశుడి మండపం

కొలువుతీరనున్న గణపయ్యలు

వివిధ రూపాలలో దర్శనం

జిల్లా వ్యాప్తంగా వందలాదిగా స్వామివారి మండపాలు

నేడు వినాయక చవితి

కరోనా తర్వాత ఉత్సాహంగా వేడుకలకు ముస్తాబు

కడప(కల్చరల్‌), ఆగస్టు 30: తొలిపూజలు అందుకునే బొజ్జగణపయ్య నేడు ఊరూరా మండపాలలో కొలువుతీరనున్నాడు. నిర్వాహకులు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో రంగురంగుల విద్యుత్‌దీప కాంతులతో స్వామివారి మండపాలను అందంగా ముస్తాబు చేశారు. వారం రోజులుగా స్వామివారి చవితి వేడుకలకు నిర్వాహకులు మండపాలను సిద్ధం చేశారు. అందులో వివిధ రూపాలలో వినాయకుడు ప్రజలకు దర్శనమివ్వనున్నారు. ఒక్కోచోట ఒక్కో రూపంలో విఘ్నేశ్వరుడి ప్రతిమలను అందంగా రూపొందించారు. కాగా గణపయ్య విగ్రహాలకు నేడు సంప్రదాయ బద్ధంగా భక్తులు పూజలు చేయనున్నారు. ఒక్కో చోట మూడు రోజులు, మరికొన్ని చోట్ల ఐదు రోజుల పాటు గణనాఽథుడు నిండు కుండలా కుదురుగా కూర్చొని భక్తులకు దర్శనమివ్వనన్నాడు.


యువత రెట్టించిన ఉత్సాహంతో

చవితి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు యువత రెట్టించిన ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. గణపయ్య విగ్రహాలను ట్రాక్టర్లలో వారి వారి వీధులకు తరలించే క్రమంలో యువత ఆనందానికి అవధులు లేవన్నట్లుగా మారింది. ఎందుకంటే కరోనా ప్రభావంతో గత రెండు సంవత్సరాలుగా చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించలేదు. మండపాలకు అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో చవితి వేడుకలకు ఆంక్షలు లేకపోవడంతో యువత ఆనందానికి అవధులు లేవన్నట్లుగా ఉంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా  వినాయకుడి విగ్రహాల తాలూకు మండపాల వద్ద సందడి నెలకొంది. ముఖ్యంగా జిల్లాలోని ముఖ్య నగరాలైన కడప, ప్రొద్దుటూరు, పులివెందుల తదితర ప్రాంతాలలో స్వామివారి భారీ విగ్రహాలను ఏర్పాటు చేశారు.


పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తెరగాలి. అందుకు వీలుగా మట్టితో తయారు చేసిన వినాయకుడి విగ్రహాలను ఇళ్లలో, మంటపాలలో పూజించి పర్యావరణ పరిరక్షణకు కంకణబద్ధులు కావాలి. అందుకు ఒకరిని ఒకరు జాగృత పరచుకోవాల్సి ఉంది. తద్వారా ప్రజల్లో అవగాహన రెట్టింపై మట్టితో చేసిన స్వామివారి విగ్రహాలను మాత్రమే కొనుగోలు చేయగలరు. ఆ దిశగా ప్రజల్లో చైతన్యం రాగలదని ఆశిద్దాం.


ఆలయాలు కాదు.. గణపయ్య మండపాలు

జిల్లా కేంద్రమైన కడపలో వినాయక చవితికి కొన్ని ప్రాంతాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఆయాలను తలపించేలా భారీ మండపాలను సిద్ధం చేశారు. దీనికోసం  వేలాది రూపాయలు వెచ్చించగా కార్మికులు, నిపుణులు సుమారు రెండువారాల పాటు రేయింబవళ్లు శ్రమించి వీటిని రూపొందించారు. 47వ డివిజన్‌లోని అక్కయ్యపల్లి యూత్‌ ఆధ్వర్యంలో 54 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఆకుల రూపంలో పర్యావరణ హితంగా తయారు చేయడం విశేషం.







Updated Date - 2022-08-31T06:13:45+05:30 IST