పవర్‌ లేని పదవులు..

ABN , First Publish Date - 2022-09-25T06:15:21+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీకి కొన్ని సామాజిక వర్గాలు ఓటు బ్యాంకుగా ఉండేవి. జగన్‌ సొంత పార్టీ వైసీపీ పెట్టడంతో ఆ ఓటు బ్యాంకులో చాలా మటుకు అందులోకి బదిలీ అయింది. జిల్లాలో వైసీపీ ఆవిర్భవించిన తరువాత జరిగిన ఉప ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు,

పవర్‌ లేని పదవులు..

పేరుకే కార్పొరేషన్‌ పదవులు

ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే పిలుపు

ఓ సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత

ఇద్దరికి కేబినెట్‌ హోదా


‘జగన్‌ పాలనలో సామాజిక న్యాయం వర్ధిల్లుతోంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సీఎం పెద్ద పీట వేశారు. కార్పొరేషన్‌ పదవుల్లో సామాజిక న్యాయం పాటించి పదవులు కట్టబెట్టారు..’ అంటూ మంత్రుల మొదలుకొని వైసీపీ నేతల వరకు గొప్పలు చెబుతుంటారు. ఇంతవరకూ ఏ ప్రభుత్వాలు పదవులు, నామినేటెడ్‌ పోస్టుల పంపిణీలో సామాజిక న్యాయం పాటించలేదంటూ సొంత డబ్బా కొడుతుంటారు. అయితే.. కావాల్సిన వారికి ప్రధానమైన కార్పొరేషన్‌ పదవులు కట్టబెట్టారు. బడుగు, బలహీన వర్గాలకు మాత్రం పవర్‌ లేని పదవులు, కులాల కార్పొరేషన్‌ పదవులు మాత్రం కట్టబెట్టారు. ఆ చైర్మన్లకు ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రం పిలుపు వస్తుంటుంది. అక్కడికి వెళ్లడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం అంతే. జగన్‌ సారధ్యంలోనే సామాజిక న్యాయం జరిగినట్లు ఊదరగొడుతున్నా.. కార్పొరేషన్‌ చైర్మన్ల పదవులు కట్టబెట్టడంలో వైసీపీ పెద్దలు కపట ప్రేమ చూపించినట్లు విమర్శలున్నాయి. 


(కడప - ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ పార్టీకి కొన్ని సామాజిక వర్గాలు ఓటు బ్యాంకుగా ఉండేవి. జగన్‌ సొంత పార్టీ  వైసీపీ పెట్టడంతో ఆ ఓటు బ్యాంకులో చాలా మటుకు అందులోకి బదిలీ అయింది. జిల్లాలో వైసీపీ ఆవిర్భవించిన తరువాత జరిగిన ఉప ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లావాసులు ఫ్యాను గుర్తునే ఆదరించారు. దీంతో సొంత జిల్లాలో తిరుగులేని నేతగా జగన్‌ గుర్తింపు పొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్‌ను సీఎం చేయాలన్న లక్ష్యంతో అందరూ కష్టపడ్డారు. జగన్‌ సీఎం అయితే పదవులు వస్తాయి, కష్టాలు తీరుతాయి అని ఆశించారు. 


పేరుకే పదవులు

టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, బ్రాహ్మణ కార్పొరేషన్లు ఉండేవి. వాటి ద్వారా నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం రుణాలు ఇచ్చేవారు. అలాగే కులవృత్తిదారులకు అధునాతనమైన పనిముట్లు అందించేవారు. ఆయా కార్పొరేషన్లకు చెందిన వారికి పదవులు ఇచ్చేవారు. అయితే జగన్‌ సీఎం అయిన తరువాత ఆయా కార్పొరేషన్లను కులాల వారీగా విభజించి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులను కట్టబెట్టారు. పదవులు తీసుకున్నవారు సంతోషించారు. అన్ని చోట్ల ప్రోటోకాల్‌ ఉంటుందని, కార్పొరేషన్ల ద్వారా సంక్షేమ పథకాలను అందించవచ్చని ఆశించారు. అయితే నామినేటెడ్‌ పోస్టులను కట్టబెట్టడంలోనే వైసీపీ మార్కు చూపించినట్లు కనిపిస్తుంది. ప్రధాన చైర్మన్‌ పదవులు మాత్రం కావాల్పిన వారికి కట్టబెట్టి, బడుగులకు ఆయా కులాల కార్పొరేషన్‌ లేదా ప్రాధాన్యం లేని పదవులు మాత్రమే ఇచ్చి సామాజిక న్యాయం పాటించినట్లు బిల్డప్‌ ఇచ్చారు.


ఒకసారి పదవులు పరిశీలిస్తే.. 


ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ రాజోలి వీరారెడ్డి

ఐటీ దేవిరెడ్డి శ్రీనాధ్‌

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ చల్లా మధుసూధన్‌రెడ్డి

ఐటీ పాలసీ పాటూరి శేషిరెడ్డి

ఆప్కాబ్‌ చైర్‌పర్సన్‌ మల్లెల ఝాన్సీరెడి

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంటు కార్పొరేషన్‌ కొండూరు అజయ్‌రెడ్డి

ఏపీఎండీసీ బోర్డు డైరెక్టర్లు ఎం.బాలమునిరెడ్డి, సల్మా, ఎల్‌.వీరప్రతాప్‌రెడ్డి

ఆర్టీసీ చైర్మన్‌ మల్లికార్జునరెడ్డిని

స్టేట్‌ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయప్రతాప్‌రెడ్డి

డిస్ట్రిక్ట్‌ లైబ్రరీ సొసైటీ చైర్‌పర్సన్‌ ఉషారాణి

కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ చైర్‌పర్సన్‌ చంద్రలీల

అన్నమయ్య అర్బన్‌ డెవలప్‌మెంటు అథారిటీ గురుమోహన్‌

యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎన్‌.హరీష్‌కుమార్‌

నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ యానాదయ్య

పద్మశాలి కార్పొరేషన్‌ విజయలక్ష్మి

దూదేకుల కార్పొరేషన్‌ ఫకృబీ

సగర ఉప్పర కార్పొరేషన్‌ రమణమ్మ

వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ కరీముల్లా

హ్యాండిక్రాఫ్ట్‌ డెవలప్‌మెంటు కార్పొరేషన్‌ విజయలక్ష్మి

సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డు పులి సునీల్‌కుమార్‌

హజ్‌ కమిటీ చైర్మన్‌ షేక్‌ గౌస్‌లాజం

అర్బన్‌ ఫైనాన్స్‌ ఇన్‌ఫా్ట్రస్ట్రక్చర్‌ డెవలప్‌మెంటు కార్పొరేషన్‌ లీలావతి

- వీరిలో చివరి ఇద్దరికీ క్యాబినెట్‌ హోదా ఉంది. వీరందరిలో ప్రధానమైన పదవులు పొందిన వారిలో ఎక్కువమంది ఓ సామాజిక వర్గం వారే ఉన్నారు. మిగిలిన వారికి పదవులు ఉన్నా.. అవి చెప్పుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరావడం లేదని అంటున్నారు.


ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం

ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు పిలుపు అందుతుంది. ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కి ఖాతాల్లో డబ్బులు జమ చేసే కార్యక్రమాలను కలెక్టరేట్‌లో నిర్వహిస్తుంటారు. ఆ కార్యక్రమాలకు వివిధ కార్పొరేషన్‌ చైౖర్మన్లు హాజరవుతుంటారు. ఆ కార్యక్రమాలకు హాజరుకావడానికి తప్ప ఆ పదవులు ఎందుకూ ఉపయోగపడవనే విమర్శలున్నాయి. పవర్‌ లేని పదవులు ఇవ్వడంతో తమ పరిధిలో ఏం న్యాయం చేయలేని పరిస్థితి నెలకొందంటూ కొందరు కార్పొరేషన్‌ చైర్మన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఉన్నామంటే ఉన్నాం.. అనేలా మా పని తయారైంది. సామాజిక వర్గాల పరంగా పదవులు ఇవ్వాల్సి రావడంతో అవి కట్టబెట్టారంటూ కొందరు గొణగడం గమనార్హం.

Read more