పాలకుల నిర్లక్ష్యం అన్నదాతలకు శాపం!

ABN , First Publish Date - 2022-09-20T05:28:43+05:30 IST

Negligence of the rulers is a curse for the breadwinners!

పాలకుల నిర్లక్ష్యం అన్నదాతలకు శాపం!
మాట్లాడుతున్న గుజ్జుల ఈశ్వరయ్య

 సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరయ్య

సుండుపల్లె, సెప్టెంబరు 19: పాలకుల నిర్లక్ష్యం రైతు కుటుంబాలకు శాపంగా మారిందని, ఇసుక దందా కారణంగానే ప్రాజెక్టులు తెగిపోయాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, అన్నమయ్య జిల్లా కార్యదర్శి నరసింహులు, జిల్లా కార్యవర్గ సభ్యుడు విశ్వనాఽథ్‌నాయక్‌ ఆరోపించారు. సోమవారం అన్నమయ్య జిల్లా సుండుపల్లె మండలంలోని యర్రపురెడ్డి ఆదినారాయణరెడ్డి పింఛా జలాశయం నుంచి అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌ వరకు సాగే మహాపాదయాత్రను గుజ్జుల ఈశ్వరయ్య జెండా ఊపి ప్రారంభించారు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల తప్పిదాల కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టును నీటి పాలు కావడంతోపాటు, వేలాది కుటుంబాలు  రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన ప్రాజెక్టులు తెగిపోతే పాలకులు ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాయచోటి నుంచి డబుల్‌ రోడ్డు, ఝరికోన ప్రాజెక్టు నుంచి కాలువలు ఏర్పాటు చేస్తే సుమారు పదివేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చునన్నారు. కొంత మంది రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం నీటిని ఏటి పాలు చేస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ల క్రితం సుండుపల్లె, వీరబల్లి మండలాలకు తాగునీటిని అందించే ప్రాజెక్టు పనులకు ఎమ్మెల్యే అప్పటి కలెక్టర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అప్పట్లో సుమారు 60 శాతం పనులు పూర్తి కాగా, మిగిలిన పనుల పూర్తికి పాలకులు పూనుకోకపోవడం దౌర్భాగ్యమన్నారు. రాయచోటి నుంచి సుండుపల్లె, పింఛా వరకు డబుల్‌ రోడ్డు పనులు పూర్తి చేయాలని  డిమాండ్‌ చేశారు.  

ఇకనైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరిచి అన్నదాతలకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు ప్రాజెక్టుల మరమ్మతులకు వెంటనే నిధులు మంజూరు చేయాలన్నారు.  రెండవ రోజు పాదయాత్రను విజయ వంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్‌ నరసింహులు, జిల్లా కార్యదర్శి మహేష్‌, లాయర్‌ రెడ్డెయ్య, పల్లం తాతయ్య, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రెడ్డెప్ప, అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు తప్ప వెంకటేష్‌, అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు రంగారెడ్డి, లంబాడీ సంఘం జాతీయ నాయకులు శంకర్‌నాయక్‌, జనసేన మహిళా అద్యక్షురాలు రెడ్డిరాణి, శ్రీనివాసులు, సంఘ సేవకులు డాక్టర్‌ సయ్యద్‌ అహ్మద్‌, వడ్డెర విద్యావంతుల ఐక్యవేదిక అధ్యక్షుడు వెంకటేష్‌, ప్రధాన కార్యదర్శి సాంబ, టీడీపీ నాయకులు సుబ్బరామరాజు, ప్రసాద్‌రాజు, చాన్‌బాషా, అమర్‌నాధరెడ్డి, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతు సంఘాల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 


Read more