పేరుకు బీఎల్వోలు.. పని వలంటీర్లది

ABN , First Publish Date - 2022-09-19T05:52:38+05:30 IST

బీఎల్వోల పేరుతో ఉత్తర్వులిచ్చినా క్షేత్ర స్థాయిలో వారికి బదులుగా వలంటీర్లు పని పూర్తి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

పేరుకు బీఎల్వోలు.. పని వలంటీర్లది

ఎన్నికల కమిషన్‌ హెచ్చరిస్తున్నా అధికారుల బేఖాతరు

ఆధార్‌ అనుసంధానం ఐచ్ఛికమే అయినా ఏకపక్షంగా నమోదు

వలంటీర్ల దగ్గరున్న సమాచారంతో అనుసంధానం


ఓటర్ల జాబితాను ఆధార్‌ నెంబరుతో అనుసంధించడానికి కేంద్ర ఎన్నికల సంఘం అవకాశమిచ్చింది. ఎవరైనా తన ఓటరు ఐడీకి ఆధార్‌ నెంబరును అనుసంధానించుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం ఐచ్ఛికం మాత్రమే. ఓటరు స్వచ్ఛంద అంగీకారంతో మాత్రమే ఆధార్‌ నెంబరును అనుసంధానించాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ పక్కదారి పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పనికి బాధ్యతాయుతమైన ఉద్యోగులను నియమిస్తూ పైకి బీఎల్వోల పేరుతో ఉత్తర్వులిచ్చినా క్షేత్ర స్థాయిలో వారికి బదులుగా వలంటీర్లు పని పూర్తి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామ, వార్డు వలంటీర్లను ఇందులోకి దించడం వివాదాస్పదమవుతోంది. తాజాగా వలంటీర్లకు ఇలాంటి విధులు అప్పగించరాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖే్‌షకుమార్‌ మీనా శుక్రవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 


కలికిరి, సెప్టెంబరు 18:  జిల్లాలో ఓటరు ఐడీకి ఆధార్‌ నెంబరు లింకేజీ చేసే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా చాప కింద నీరులా ఇది కొనసాగుతోంది. ఓటరు ఐడీకి ఆధార్‌ నెంబరు అనుసంధానించుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. అయితే ఇది కేవలం ఓటరుకు ఐచ్ఛికం మాత్రమే. ఓటర్ల నుంచి రాతమూలకంగా అంగీకారపత్రం తీసుకుని వారి ఆధార్‌ నెంబరును అనుసంఽధించాల్సి ఉంది. ఓటర్ల జాబితాల సవరణ, మార్పులు, చేర్పులు వంటి పనుల కోసం ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక బీఎల్‌ఓ (బూత్‌ లెవెల్‌ ఆఫీసరు)ను నియమించారు. ఆధార్‌ నెంబరు అనుసంఽధానించే పని కూడా అధికారికంగా వీరికే అప్పగించారు. గతంలో బీఎల్వోలుగా వీఆర్వోలు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఉండేవారు. ఈ దఫా పంచాయతీ స్థాయిలోని పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, వీఆర్‌ఏలు, విలేజి సర్వేయర్లు, ఉద్యాన శాఖ అసిస్టెంట్లు, చైల్డ్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు ఇలా అందుబాటులో ఉన్న సచివాలయాల ఉద్యోగులను నియమించారు. వీరు మాత్రమే ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి వారి అంగీకరించిన మేరకు ఆధార్‌ నెంబరును సేకరించి ఓటరు ఐడీకి అనుసంధానించాల్సి ఉంది. దీని కోసం ఓటరు నుంచి ప్రత్యేకంగా అంగీకారపత్రం పైన సంతకం చేయించి తీసుకోవలసి ఉంది. అయితే ఇది చివరికి పర్యవేక్షణాలోపం కారణంగా పక్కదారి పట్టిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తమకు తమ స్వంత శాఖ పనుల ఒత్తిడి ఉందనే సాకు చెబుతూ బీఎల్వోలు ఈ పనిని వారి పరిధిలోని వలంటీర్లకు అప్పగించారని చెబుతున్నారు. ఇక వలంటీర్లు సైతం వివిధ పథకాల కోసం సేకరించి తమ వద్ద సిద్ధంగా ఉంచుకున్న ఆధార్‌ నెంబర్లను ఓటర్ల ఐడీకి లింకేజీ చేస్తున్నారని అంటున్నారు. ఇలా ఓటరు అంగీకారం లేకుండానే, ఇళ్ల వద్దకు వెళ్లకుండానే ఏకపక్షంగా ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో మొత్తం ప్రక్రియ తూతూ మంత్రంగా సాగిపోతోందనే విమర్శలున్నాయి. ఈ వ్యవహారమంతా ఆలస్యంగా ఎన్నికల కమిషను దృష్టికి వెళ్లడంతో శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖే్‌షకుమార్‌ మీనా ఆధార్‌ అనుసంధాన ప్రక్రియతో పాటు ఎన్నికలకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ వలంటీర్ల ప్రమేయం లేకుండా చేయాలని ఆదేశించారు. అంతేగాకుండా ఎన్నికల్లో వలంటీర్లు అభ్యర్థులకు ఏజెంట్లుగా కూడా వ్యవహరించరాదని సీఈవో పునరుద్ఘాటించారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా 2021 ఏప్రిల్‌ 13న ఎన్నికల సంఘం వ్యవహారాల్లో వలంటీర్ల ప్రమేయం లేకుండా స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు కూడా గుర్తు  చేశారు. జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టరు, రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఈవో ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో ఉన్న దాదాపు 1500 పోలింగ్‌ కేంద్రాల్లో యాభై శాతం ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ పూర్తి కావచ్చినట్లు తెలుస్తోంది. పనుల ఒత్తిడి కారణంగా ఇంటింటికీ వెళ్లి ఆధార్‌ అనుసంఽధాన ప్రక్రియను చేపట్టడం ఆలస్యమవుతున్న కారణంగా వలంటీర్ల సాయం తీసుకోవలసి వచ్చిందని బీఎల్వోలు చెబుతున్నారు. వలంటీర్ల వద్ద ఓటర్లకు సంబంధించిన ఆధార్‌ నెంబర్లు ఉన్నందువల్ల పని తేలిగ్గా జరుగుతుందని భావించామని, అలా వలంటీర్ల సేవలను తీసుకోరాదని ముందుగా తమకు చెప్పలేదని వీరు అంటున్నారు. తమకు సంబంధం లేని పనులను అప్పగించి తమను వివాదాల్లోకి నెడుతున్నారని వలంటీర్లు మరోవైపు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 


పర్యవేక్షణా లోపంతోనే..

కాగా అనుసంధాన పనిని పర్యవేక్షించడానికి కొంతమంది బీఎల్వోలకు కలిపి సూపర్‌వైజర్‌లను నియమించారు. తహసీల్దారు కార్యాలయాల్లోని డీటీలు, ఏఎ్‌సఓలు, ఆర్‌ఐలు, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌లను నియమించినా సరైన పర్యవేక్షణ కొరవడిన కారణంగానే అనుసంధాన ప్రక్రియ పక్కదారి పడుతోందని అంటున్నారు. అయితే తాము ఎక్కడా వలంటీర్లకు ఆధార్‌ అనుసంధాన పనిని అప్పగించలేదని, ఇది బీఎల్వోలు, వలంటీర్ల మధ్యలో కుదిరిన అవగాహనతో జరిగినట్టుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అంతేగాకుండా ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ బీఎల్వో లాగిన్‌లోనూ, ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ పబ్లిక్‌ పోర్టల్‌ ద్వారానూ స్వచ్ఛందంగా మాత్రమే చేసుకోవచ్చని వివరిస్తున్నారు. అయితే వలంటీర్ల ప్రమేయంతో జరుగుతున్నట్లు ఫిర్యాదులు లేకుంటే ఆధార్‌ లింకేజీ వ్యవహారాలకు వలంటీర్లను దూరంగా ఉంచాలని సీఈవో స్పష్టమైన ఆదేశాలు ఎందుకు జారీ చేస్తారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.


ఏకపక్ష లింకేజీ వల్ల ప్రమాదం?

ఇప్పటికైతే వలంటీర్ల దగ్గరున్న ఆధార్‌ నెంబర్లతో ఓటరు ఐడీల అనుసంధాన ప్రక్రియ సాఫీగా జరుగుతున్నట్లే కనిపిస్తుంది. అయితే పోలింగ్‌ రోజు ఆధార్‌ను గుర్తింపు కార్డుగా చూపించినప్పుడు జాబితాలోని నెంబరుకు, గుర్తింపు కార్డు నెంబరుకు తేడా ఉండి ఓటు వేయడానికి అభ్యంతరం వస్తే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అదీగాక ఓటర్ల అంగీకారంతో ప్రమేయం లేకుండా వలంటీర్లు తమ వద్ద ఉన్న ఆధార్‌ నెంబర్లను ఎడాపెడా లింకేజీ చేసేటట్లయితే.. ఎలక్ర్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులే తమ వద్ద ఉన్న ఆధార్‌ డాటాతో ఓటర్ల జాబితాను అనుసంధానించుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.


ఎన్నికల వ్యవహారాలకు వలంటీర్లను దూరంగా ఉంచండి

ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి వ్యవహారాల్లోనూ గ్రామ, వార్డు వలంటీర్ల ప్రమేయం లేకుండా దూరంగా ఉంచాల్సిందే. గతంలో 2021 ఏప్రిల్‌ 13న కూడా దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలతో ఆదేశాలిచ్చాము. అభ్యర్థులకు ఏజెంట్లుగా కూడా వలంటీర్లు ఉండరాదు. ఓటర్ల నమోదు, ఆధార్‌ లింకేజీ ఒక్కటేమిటి ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాల్లో ఏ విధంగానూ వలంటీర్ల ప్రమేయం ఉండరాదు. జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లకు గతంలో ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి. ఆ మేరకు తగు చర్యలు తీసుకోవాలని శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  ముఖే్‌షకుమార్‌ మీనా ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2022-09-19T05:52:38+05:30 IST