అక్క ఇబ్బంది చూశాడు.... ఆవిష్కరణ చేశాడు

ABN , First Publish Date - 2022-09-20T05:04:13+05:30 IST

చీర కట్టుకుని ద్విచక్ర వాహనంలో వెనుక కూర్చుని ప్రయాణం చేయడానికి ఇబ్బంది పడుతున్న తల్లి, అక్కను చూసి చలించిపోయాడో కుర్రాడు.

అక్క ఇబ్బంది చూశాడు.... ఆవిష్కరణ చేశాడు
తాము తయారు చేసిన సీటు రెస్టును స్కూటర్‌కు బిగిస్తున్న చరణ్‌తేజ, రేణుక

ఇన్‌స్పైర్‌-మనక్‌ పోటీల్లో మెరిసిన పీలేరు కుర్రాడు 

బైక్‌లలో వెనుక కూర్చునే మహిళల కోసం బ్యాక్‌ రెస్ట్‌ తయారీ 

త్వరలో జపాన్‌కు పయనం 


పీలేరు, సెప్టెంబరు 19: చీర కట్టుకుని ద్విచక్ర వాహనంలో వెనుక కూర్చుని ప్రయాణం చేయడానికి ఇబ్బంది పడుతున్న తల్లి, అక్కను చూసి చలించిపోయాడో కుర్రాడు. తమకున్న ఏకైన ప్రయాణ సాధనంలోనూ వారు సౌకర్యవంతంగా కూర్చోలేకపోవడం అతనిని బాధించింది. దీంతో ఎలాగైనా వారి సమస్యకు పరిష్కారం కనుగొనాలకున్నాడు. తన ఆలోచనను తమ పాఠశాలలోని సైన్స్‌ ఉపాధ్యాయురాలితో పంచుకున్నాడు. ఆమె కూడా అతడి ఆలోచనను మెచ్చుకుని ఇద్దరూ కలిసి సమస్యకు పరిష్కారం కోసం అన్వేషణ, ప్రయోగాలు మొదలుపెట్టారు. తమకు వచ్చిన ఆలోచనను కార్యరూపంలోకి పెట్టి వివిధ కష్టనష్టాలకోర్చి అనేక ప్రయోగాల అనంతరం ఓ నూతన ఆవిష్కరణ చేశారు. అదే ‘బ్యాక్‌ రెస్ట్‌ ఫర్‌ సైడ్‌ సీటెడ్‌ ఉమెన్‌’. ఆ ఆవిష్కరణను తమ పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి ఇన్‌స్పెర్‌ పోటీల్లో ప్రదర్శనకు పెట్టగా వారి ఆలోచనలకు, ఆవిష్కరణను మెచ్చుకున్న ఉన్నతాధికారులు అవార్డులతో ప్రోత్సహించారు. అదే ప్రోత్సాహంతో ఆ యువకుడు తన నమూనాతో ఢిల్లీలో మెరిశాడు. జాతీయ స్థాయి పోటీల్లో సైతం ఉత్తమ ఆవిష్కరణ అవార్డు గెలుచుకున్నాడు. అక్కడితో ఆగిపోకుండా త్వరలో జపాన్‌లో జరగనున్న అంతర్జాతీయ ప్రదర్శనలో మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించనున్నాడు. అతనే పి.చరణ్‌తేజ. మారుమూల గ్రామం నుంచి మొదలైన అతడి ప్రస్థానం దేశ రాజధాని మీదుగా జపాన్‌ వరకు సాగనుంది. అతడి మదిలో మెదిలిన ఆలోచన, ఆవిష్కరణకు శాస్త్రవేత్తల సహకారం తోడైతే స్కూటర్లలో వెనుక కూర్చుని ప్రయాణం చేయడానికి ఇబ్బందిపడే కోట్లాది మంది మహిళలకు ఉపశమనం లభించడం ఖాయంగా కనిపిస్తోంది.


మారుమూల గ్రామం నుంచి 

పీలేరు మండలం వేపులబైలు పంచాయతీ చెరుకువారిపల్లెకు చెందిన దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన పి.చరణ్‌తేజ చెరుకువారిపల్లె పక్కన ఉన్న జంగంపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివాడు. అతడి తండ్రి పి.మదనమోహన్‌ పీలేరులోని ఓ డిష్‌ సంస్థలో పనిచేస్తుండగా, తల్లి మహదేవమ్మ అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. మారుమూల గ్రామమైన చెరుకువారిపల్లె నుంచి తాను చదువుకుంటున్న జంగంపల్లెకుగానీ, ఏదైనా పనుల కోసం పీలేరుకు రావాలన్నా వారికి స్కూటరే గతి. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండే చరణ్‌తేజకు తనతో పాటు ద్విచక్ర వాహనంలో ప్రయాణించడానికి తల్లి, అక్క పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయాడు. వారి ఇబ్బందులను తొలగించడానికి ఏమైనా చేయాలనుకున్నాడు. అదే విషయాన్ని జంగంపల్లె పాఠశాలలో సైన్స్‌ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రేణుకతో పంచుకున్నాడు. ఆమె తాను కూడా అనుభవిస్తున్న బాధకు ఏదైనా పరిష్కారం దొరికితే బాగుండునని అతడిని ప్రయోగాల వైపు ప్రోత్సహించింది. స్కూటర్‌ వెనుక సీటులో చీరలు కట్టుకున్న మహిళలు ఓవైపే కూర్చుంటారు కాబట్టి వారికి సౌకర్యవంతంగా ఉండేలా ఏదైనా సాధనం తయారు చేయాలనుకున్నాడు చరణ్‌తేజ. 


కారు సీటు హెడ్‌ రెస్టుతో ప్రయోగం సఫలీకృతం 

సాధారణంగా కారు సీట్లలో ఉండే హెడ్‌ రెస్టును స్కూటర్‌కు బిగించగలిగితే ఉపయోగం ఉంటుందని భావించిన చరణ్‌తేజ ఆ విషయాన్ని తన టీచర్‌ రేణుకకు తెలిపాడు. వారిద్దరూ కలిసి పీలేరులోని ప్రముఖ స్కూటర్‌ మెకానిక్‌ అయిన సూరిని కలిసి తమ ఆలోచనను పంచుకున్నారు. వారి ఆలోచన మెచ్చుకున్న సూరి వారికి కావాల్సిన కారు సీటు హెడ్‌ రెస్టు తీసుకుని దానిని స్కూటర్‌ వెనుక భాగంలో అమర్చ గలిగేలా తయారు చేసి ఇచ్చాడు. వారిద్దరూ దానిని తీసుకుని చరణ్‌తేజ నాన్న మదనమోహన్‌ స్కూటర్‌పై పలుమార్లు ప్రయోగాలు చేసి చివరకు సఫలీకృతమయ్యారు. తాము తయారు చేసిన నమూనాను పాఠశాల హెచ్‌ఎం రెడ్డెప్పకు చూపగా ఆయన దానిని తమ పాఠశాల తరపున ‘ఇన్‌స్పైర్‌-మనక్‌’ పోటీలకు పంపారు. అలా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో చరణ్‌తేజ నమూనా అవార్డులు గెలుచుకుంటూ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. అలా 2020-21 జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న చరణ్‌తేజ ఈనెల 16న ఢిల్లీలో జరిగిన అవార్డుల ఎంపికలో కూడా జాతీయ స్థాయిలో మెరిసి కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి జితేంద్రసింగ్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. అంతేకాకుండా జపాన్‌లో త్వరలో జరగనున్న అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలో పాల్గొనేందుకు మన దేశం తరపున పాల్గొనేందుకు అర్హత సాధించాడు. పీలేరులోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రధమ సంవత్సరం చదువుతున్న చరణ్‌తేజ ఆ నమూనాను తాను 9వ తరగతి చదువుతున్నప్పుడే తయారు చేయడం విశేషం. చరణ్‌తేజకు జాతీయ అవార్డు రావడం, జపాన్‌కు వెళ్లే అవకాశం లభించడంతో జంగంపల్లెలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మారుమూల ప్రాంతంలో ఉన్న తమ పాఠశాలకు చరణ్‌తేజ కారణంగా జాతీయ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని అతడికి గైడ్‌గా వ్యవహరించిన సైన్స్‌ ఉపాధ్యాయురాలు రేణుక, పాఠశాల హెచ్‌ఎం రెడ్డెప్ప తెలిపారు. జపాన్‌లో జరిగే పోటీల్లో కూడా చరణ్‌తేజ నమూనాకు అవార్డు వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అతను తయారు చేసిన నమూనాకు పేటెంట్‌ హక్కులు చరణ్‌తేజకే దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, తద్వారా లభించే రాయల్టీతో అతను, అతడి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుందని, భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేపట్టేలా చరణ్‌తేజకు ఉపయోగపడుతుందని హెచ్‌ఎం రెడ్డెప్ప అభిప్రాయపడ్డారు. అవార్డు అందుకుని సోమవారం స్వగ్రామానికి విచ్చేసిన చరణ్‌తేజను జంగంపల్లె పాఠశాలకు పిలిపించి ఉపాధ్యాయులు అభినందించారు. 


అవార్డు రావడం సంతోషంగా ఉంది

- రేణుక, సైన్స్‌ ఉపాధ్యాయురాలు, చరణ్‌తేజ గైడ్‌, జంగంపల్లె 

తల్లి, అక్క ఇబ్బందులు చూసి వారి కోసం ఏదైనా చేయాలని 9వ తరగతి చదువుతున్న ఓ చిన్న కుర్రాడి మదిలో మెదిలిన ఆలోచన నేడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవడం సంతోషంగా ఉంది. అతడికి గైడ్‌గా వ్యవహరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ నమూనా తయారు చేసే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అవార్డు వచ్చిన తరువాత వాటన్నింటినీ మరిచిపోయి సంతోషంగా ఉన్నాం. చరణ్‌తేజ తయారు చేసిన నమూనాపై సైంటిస్టులు కూడా పరిశోధనలు జరిపి దానిని జనబాహుళ్యంలోకి తెస్తే బాగుంటుంది. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరికినట్లు అవుతుంది. 


ప్రోత్సాహం అందిస్తే బాగుంటుంది

- మదనమోహన్‌, మహదేవమ్మ, చరణ్‌తేజ తల్లిదండ్రులు 

చదువులో చురుగ్గా ఉండే చరణ్‌తేజ ఏదో ప్రయోగాలు చేస్తానంటే ప్రోత్సహించాం. అది జాతీయ స్థాయిలో పేరు తెస్తుందని ఊహించలేదు. వాడు బాగా చదువుతాడని జంగంపల్లె టీచర్లే పీలేరులోని ఓ కాలేజీలో ఎంపీసీలో చేర్పించారు. మా వాడి చదువులకు ప్రభుత్వం ఏమైనా సాయం అందిస్తే బాగుంటుంది. 



Updated Date - 2022-09-20T05:04:13+05:30 IST