మున్సిపాలిటీ.. అధ్వానం

ABN , First Publish Date - 2022-09-30T05:15:34+05:30 IST

రాయచోటి మున్సిపాలిటీలోని 34 వార్డుల్లో ఏ వార్డుకు ఏ వీధికి వెళ్లి చూసినా సిమెంట్‌ రోడ్లన్నీ ధ్వంసమై గుంతలమయం గా మారిపోయాయి. డ్రైనేజీ కాలువలైతే చెప్పనవసరం లేదు. ప్రతి ప్రధాన రహదారితో పాటు ప్రతి సందులోనూ డ్రైనేజీ కాలువలన్నీ పూర్తి స్థాయిలో ఆక్రమణలకు గురయ్యాయి. ప్రతి ఒక్కరూ డ్రైనేజీలపై దర్జాగా నిర్మాణాలు చేపట్టి వాహనాలు వెళ్లేందుకు కూడా ఇబ్బంది కలిగే విధంగా వీధులను తయారు చేస్తుంటే మున్సిపల్‌ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

మున్సిపాలిటీ.. అధ్వానం
అసంపూర్తిగా ఉన్న జాతీయ రహదారి పనులు

అసంపూర్తిగా జాతీయ రహదారి పనులు   

15 ఏళ్లుగా పూర్తికాని ఔటర్‌ రింగురోడ్డు   

గుంతలమయంగా సిమెంటు రోడ్లు

ఆక్రమణలో డ్రైనేజీ కాలువలు   

పడకేసిన సుందరీకరణ పనులు   

ఇదీ రాయచోటి గ్రేడ్‌-1 మున్సిపాలిటీ దుస్థితి   

నేడు సర్వసభ్య సమావేశం


రాయచోటి గ్రేడ్‌-1 మున్సిపాలిటీ పేరు గొప్ప.. ఊరుదిబ్బ అన్న చందంగా తయారైంది.  పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే  అన్నట్టుగా ఉంది. ఏ వీధి చూసినా గుంతలమయమైన రోడ్లు, ధ్వంసమైన సిమెంటు రోడ్లు.. ఆక్రమణకు గురైన డ్రైనేజీ కాలువలే దర్శనమిస్తున్నాయి. గత పదేళ్లుగా భవన నిర్మాణాలు.. అదే స్థాయిలో జనాభా పెరుగుతున్నా ఆ మేరకు మౌలిక వసతులు లేవనే చెప్పవచ్చు. ఆ పన్ను, ఈ పన్ను అంటూ ప్రజలను ముక్కుపిండి వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ అభివృద్ధిలో ఎందుకు చూపడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు వెలిగల్లు నీటిని ప్యూరిఫై చేసేందుకు మున్సిపల్‌ అధికారులు ప్రతి నెలా రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నా.. ఆ నీళ్లు పట్టణ ప్రజలు తాగేందుకు ఏ మాత్రం ఉపయోగపడకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శుక్రవారం జరిగే సర్వసభ్య సమావేశంలో అయినా మున్సిపాలిటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూద్దాం. 


రాయచోటిటౌన్‌, సెప్టెంబరు 29: రాయచోటి మున్సిపాలిటీలోని 34 వార్డుల్లో ఏ వార్డుకు ఏ వీధికి వెళ్లి చూసినా సిమెంట్‌ రోడ్లన్నీ ధ్వంసమై గుంతలమయం గా మారిపోయాయి. డ్రైనేజీ కాలువలైతే చెప్పనవసరం లేదు. ప్రతి ప్రధాన రహదారితో పాటు ప్రతి సందులోనూ డ్రైనేజీ కాలువలన్నీ పూర్తి స్థాయిలో ఆక్రమణలకు గురయ్యాయి. ప్రతి ఒక్కరూ డ్రైనేజీలపై దర్జాగా నిర్మాణాలు చేపట్టి వాహనాలు వెళ్లేందుకు కూడా ఇబ్బంది కలిగే విధంగా వీధులను తయారు చేస్తుంటే మున్సిపల్‌ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వర్షం వచ్చిందంటే డ్రైనేజీలు నిండిపోయి మురుగునీరంతా రోడ్లపై పారుతుం టుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు వాహనదారులు, పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ విషయంపై ఆయా వార్డు కౌన్సిలర్లతో పాటు మున్సిపల్‌ అధికారులకు చెప్పినా ఫలితం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు.

ఇకపోతే నూతన మున్సిపల్‌ కార్యాలయం నిర్మించి సుమారు 5 ఏళ్లకు పైగా  కావస్తున్నా ఇంతవరకు కార్యాలయానికి వెళ్లేందుకు దారి లేదంటే అధికార పార్టీ నేతల పాలన ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. ఇదిలా ఉండగా రాయచోటి పట్టణంలోనే అత్యంత రద్దీగా ఉండే కొత్తపేట జగదాంబ సెంటర్‌ రోడ్డు గుంతలమయంగా మారి అధ్వాన స్థితికి చేరింది. ఇప్పటికే 20 దఫాలకు పైగా మున్సిపల్‌ అజెండాలో తీర్మానాలు చేసినా ఇంతవరకు కొత్తపేట రోడ్డు విస్తరణకు నోచుకోలేదు. ఫలితంగా ప్రతిరోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4-6 గంటల వరకు వాహనాలతో కొత్తపేట రోడ్డు అత్యంత రద్దీగా మారి గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. అలాగే పట్టణంలోని మదనపల్లె రోడ్డులోని కృష్ణాపురం ఆర్చీ నుంచి వెళ్లే రోడ్డు వరదలకు కోతకు గురై గుంతలమయంగా మారడంతో ఆ దారిలో ప్రయాణం అంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. 


అసంపూర్తిగా రింగురోడ్డు పనులు

రాయచోటి పట్టణంలో సుమారు 15 ఏళ్ల క్రితం 120 అడుగుల వెడల్పుతో నాలుగు వరుసల జాతీయ రహదారి పనులు ప్రారంభమయ్యాయి. నేటికీ ఈ పనులు పూర్తి కాలేదు. ఈ పనుల విషయంలో అటు ఎన్‌హెచ్‌ అధికారులు ఇటు మున్సిపల్‌ అధికారులు, రెవె న్యూ అధికారులు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణ లున్నాయి. దీంతో పట్టణంలోని ఎస్‌ఎన్‌కాలనీ, చెక్‌పోస్టు నుంచి నేతాజి సర్కిల్‌ వరకు 120 అడుగుల వెడల్పుతో జాతీయ రహదారి పనులు చేపట్టిన అధికారులు అక్కడ నుంచి ఠాణా, పెట్రోల్‌ బంకు, మాసాపేటకు వెళ్లేప్పటికి 70 అడుగులకు కుదించుకుపోయింది. అవసరమైన నష్టపరిహారాన్ని లబ్ధిదారులకు చెల్లించినా రోడ్డు విస్తరణ ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారంటూ ప్రజలు, వాహనదారులు ప్రశ్నిస్తున్నా రు. దీనికి తోడు నేతాజి సర్కిల్‌ నుంచి బస్టాండు రో డ్డు వరకు మధ్యలో ఉన్న మొక్కల ఆలనాపాలన చూసేవారు లేక చాలావరకు ఎండిపోయాయి. అంతేకాకుండా పార్కుల అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. 


వెంటాడుతున్న సీజనల్‌ వ్యాధులు 

వర్షాకాలం ప్రారంభం కావడంతో మురుగునీరంతా రోడ్లపైన ప్రవహించి దోమల బెడదతో సీజనల్‌ వ్యాధుల బారిన పడి అల్లాడుతున్నారు. రాయచోటిలో పందుల సంచారం ఎక్కువగా ఉంది. దీంతో పాటు వింత వ్యాధితో పందులు పట్టణంలోని పలు ప్రాంతాల్లో మృత్యువాత పడుతుండడంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సాధారణంగా వర్షాకాలంలో మున్సిపల్‌ అధికారులు పట్టణంలోని అన్ని వార్డులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువల్లో డీటీటీ స్ర్పే చేయడం, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం లాంటి పారిశుధ్య చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఏడాది అలాంటి చర్యలు చేపట్టలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


రోడ్ల అభివృద్ధి మరిచారు..

పట్టణంలో ఇళ్ల నిర్మాణాల కోసం మున్సిపాలిటీకి అప్రూవల్‌కి వెళ్తే రూ.లక్షా 50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కట్టించుకుంటున్నారు. అయితే రోడ్ల అభివృద్ధి గానీ, డ్రైనేజీ కాలువ నిర్మాణం, తాగునీటి సౌకర్యం, సిమెంటు రోడ్ల ఏర్పాటును అస్సలు పట్టించుకోవడం లేదు. సుద్దలవాండ్లపల్లె రోడ్డు గుంతలమయంగా నరకాన్ని తలపిస్తోంది. మున్సిపల్‌ అదికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.

- నాగరాజు, సుద్దలవాండ్లపల్లె రోడ్డు, రాయచోటి


గ్రామ పంచాయతీనే నయం..

రాయచోటి మున్సిపాలిటీ కంటే గ్రామ పంచాయతీనే నయం. ఇళ్ల నిర్మాణాల అప్రూవల్‌కు లక్షలు కడుతున్నా, మున్సిపాలిటీ విధించే పన్నులు చెల్లిస్తున్నా ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏమీ లేవు. సిమెంటు రోడ్లు అయితే అధ్వానంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అసలు సిమెంటు రోడ్లు లేవు. డ్రైనేజీ కాలువలు, మురుగునీరు, చెత్తతో నిండి కంపుకొడుతున్నాయి.

- వేణుగోపాల్‌రెడ్డి, రాయచోటి


మౌలిక వసతులు కల్పిస్తున్నాం..

రాయచోటి మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. సీజనల్‌ వ్యాధుల నివారణ కోసం ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్‌ చేపడుతున్నాం. గ్రాస్‌ల్యాండ్‌ అభివృద్ధికి టెండర్లు పిలిచాము. జాతీయ రహదారికి మాకు సంబంధం లేదు. రెవెన్యూ, ఎన్‌హెచ్‌ అధికారులు మాత్రమే చూసుకుంటారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నాం. 

- రాంబాబు, మున్సిపల్‌ కమిషనర్‌, రాయచోటి



Updated Date - 2022-09-30T05:15:34+05:30 IST