ఎర్రగుంట్లలో విషాదం

ABN , First Publish Date - 2022-07-05T07:27:28+05:30 IST

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి నాపరాయి గని గుంత నీటిలో పడి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన సోమవారం ఎర్రగుంట్లలో చోటు చేసుకుంది. వివరాలిలా.. ఎర్రగుంట్ల మహేశ్వరనగర్‌ ట్యాంకు వీధిలో పిట్టల శ్రీను, అతని భార్య లక్ష్మిదేవి(30), కుమార్తె అక్షయ(9), కుమారుడు రేవంత్‌ (7) నివాసం ఉంటున్నారు. శ్రీనుది దూవ్వూరు మండలంలోని పల్లారెడ్డిపేట కాగా లక్ష్మిదేవిది వీరపునాయునిపల్లె మండలం.

ఎర్రగుంట్లలో విషాదం
మృతదేహాల వద్ద రోదిస్తున్న బంధువులు

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

మద్యం తాగి భర్త వేధింపులే కారణం

ఎర్రగుంట్ల, జూలై 4:  ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి నాపరాయి గని గుంత నీటిలో పడి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన సోమవారం ఎర్రగుంట్లలో చోటు చేసుకుంది.  వివరాలిలా.. ఎర్రగుంట్ల మహేశ్వరనగర్‌ ట్యాంకు వీధిలో పిట్టల శ్రీను, అతని భార్య లక్ష్మిదేవి(30), కుమార్తె అక్షయ(9), కుమారుడు రేవంత్‌ (7) నివాసం ఉంటున్నారు. శ్రీనుది దూవ్వూరు మండలంలోని పల్లారెడ్డిపేట కాగా లక్ష్మిదేవిది వీరపునాయునిపల్లె మండలం. వీరికి వివాహం అయ్యి పదేళ్లు అయింది. జీవనోపాధికోసం ఎర్రగుంట్లకు వచ్చి మహేశ్వరనగర్‌లో ఉంటున్నారు. కొంతకాలం రజక వృత్తి చేసిన శ్రీను ఇటీవల ఆటో నడుపుతున్నాడు. ఇతను నిత్యం మద్యం సేవించి భార్యను వేధింపులకు గురిచేసేవాడు. దీన్ని భరించలేని ఆమె ఎన్నోసార్లు తాగుడు మానుకోవాలని భర్తను బతిమలాడింది. సోమవారం ఉదయం కూడా ఇంట్లో దీనికి సంబంధించి ఘర్షణ పడ్డారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన లక్ష్మిదేవి కుమార్తె అక్షయ, కుమారుడు రేవంత్‌ను తీసుకుని ఎర్రగుంట్ల వేంపల్లిరోడ్డులోని ఆంజనేయస్వామి గుడి వెనుక ఉన్న నాపరాయి గనిగుంతల నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురు నీటిలో దూకారని సీఐ మంజునాథరెడ్డికి సమాచారం రావడంతో తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఈతగాళ్ల సహాయంతో నీటిలో వెతికించారు. ముందుగా ఇద్దరు పిల్లల మృతదేహాలను బయటికి తీశారు. అనంతరం లక్ష్మిదేవి మృతదేహాన్ని బయటికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. లక్ష్మిదేవి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆమె భర్తను శ్రీనును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సీఐ అన్నారు.


తీవ్ర విషాదం..

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడిందన్న విషయం ఎర్రగుంట్లలో దావానలంలా వ్యాపించింది. దీంతో పెద్దఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు. చాలాసేపు మృతదేహాలు దొరకలేదు. చివరకు ఒక్కొక్క మృత దేహం బయటపడ్డాయి. ముందుగా ఇద్దరు చిన్నారుల మృతదేహాలు దొరకడంతో బంధువులు భోరున విలపించారు. లక్ష్మిదేవి మృతదేహం కోసం చాలా సేపు గాలించారు. చివరకు దొరకడంతో అంతటా విషాదం నెలకొంది. ఎంత హింసకు గురైందో లేకపోతే పిల్లలతో కలిసి ఇంతటి అఘాయిత్యానికి ఎందుకు పాల్పడుతుందని అక్కడికి వచ్చిన వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-07-05T07:27:28+05:30 IST