నీరు - చెట్టు బిల్లులకు మోక్షమెప్పుడో..?

ABN , First Publish Date - 2022-09-26T07:34:25+05:30 IST

టీడీపీ హయాంలో నీరు - చెట్టు ద్వారా పనులు చేసిన కాంట్రాక్టర్లు దాదాపు నాలుగేళ్లుగా బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. నాడు - నేడు ద్వారా చేపట్టిన పనులకు, జగనన్న కాలనీలో మౌలిక వసతులకు ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తోంది. అయితే సీఎం జగన్‌

నీరు - చెట్టు బిల్లులకు మోక్షమెప్పుడో..?
నీరు చెట్టు ద్వారా బికోడూరు చేపట్టిన చెక్‌డ్యాం పనులు

కోర్టుకెళ్లిన వారికే బిల్లులు

టీడీపీ హయాంలో పనులు చేసిన వైసీపీ నేతలు

ప్రభుత్వంపై కోర్టుకెళ్లలేకపోతున్న నేతలు

పెండింగు బిల్లులు రూ.65 కోట్లు..?

(కడప - ఆంధ్రజ్యోతి) : టీడీపీ హయాంలో నీరు - చెట్టు ద్వారా పనులు చేసిన కాంట్రాక్టర్లు దాదాపు నాలుగేళ్లుగా బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. నాడు - నేడు ద్వారా చేపట్టిన పనులకు, జగనన్న కాలనీలో మౌలిక వసతులకు ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తోంది. అయితే సీఎం జగన్‌ మాపై ఎప్పుడు కరుణ చూపిస్తారో అంటూ పనులు చేసిన కాంట్రాక్టర్లు ఆశగా చూస్తున్నారు. టీడీపీ హయాంలో పనులు జరిగినప్పటికీ కొన్ని చోట్ల సుమారు 30 నుంచి 40 శాతం పనులను వైసీపీ నేతలు కూడా చేసినట్లు చెబుతున్నారు. అటు టీడీపీ కార్యకర్తలే కాదు.. ఇటు వైసీపీ కార్యకర్తలు కూడా బిల్లుల కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తుండడం గమనార్హం. బిల్లుల కోసం కోర్టుకెళ్లిన వారికి చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే సొంత ప్రభుత్వంపై కోర్టుకెళ్లలేక.. చేసిన పనులకు బిల్లులు రాక... తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ వైసీపీ నేతల తీరు అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. బిల్లుల చెల్లింపులో జగన్‌ సర్కారు కక్ష సాఽధింపు ధోరణిలో వ్యవహరించడాన్ని పనులు చేసిన కొందరు వైసీపీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. రూ.కోట్లు రెండు కోట్లు కాదు.. సుమారు రూ.65 కోట్లు మేర బిల్లులు పెండింగులో ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. 


కరువును జయించాలనే....

కరువును జయించాలంటే భూగర్భజలాలు పెంపొందించాలి. చంద్రబాబు హయాంలో ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో 2015-16 ఆర్థిక సంవత్సరంలో నీరు - చెట్టు పనులకు శ్రీకారం చుట్టారు. వర్షాకాలం నాటికి నీటి వనరులు సద్వినియోగం చేసుకొని భూగర్భజలాలు పెంచాలన్నదే ప్రధాన లక్ష్యం. తొలి విడత పనుల్లో చెరువులు, కాల్వల్లో పూడిక తీత, చెరువు కట్టల పటిష్టత, తూములను వర్షాలకు తెగి పోకుండా చేయడం, గొలుసు కట్టు చెరువులు, చెక్‌డ్యాంలను పునర్‌ నిర్మించడం తదితర పనులకు శ్రీకారం చుట్టారు. రెండేళ్ల పాటు పెద్ద ఎత్తున పనులు చేశారు. నీరు - చెట్టు పనులు సత్ఫలితాలు ఇచ్చాయి. 2015-16, 2016-17, 2017-18, 2018-19 సంవత్సరాల్లో చేపట్టిన పనుల్లో చాలావరకు సత్ఫలితాలు ఇచ్చినట్లు నీటిపారుదలశాఖ అధికారులు చెబుతారు. అప్పట్లో చేసిన పనుల కారణంగా కొన్నిచోట్ల భూగర్భ జలాలు  పెరిగినట్లు నాటి  నీటిపారుదలశాఖ వారు చెప్పిన లెక్కలు చూస్తే తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. అప్పట్లో ఉమ్మడి జిల్లాలో సుమారు నాలుగు వేల పనులు చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.


అంతా చిన్నోళ్లే....

నీరు - చెట్టు ద్వారా చేసిన పనుల విలువ రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల లోపే ఉంటుం ది. ఆ పనులను గ్రామాల్లోని స్థానిక నేతలే చేపట్టారు. కొన్ని చోట్ల వైసీపీ నేతలు పర్సంటేజీలకు పనులు చేసుకోగా, మరికొన్ని చోట్ల గ్రామాల్లో ఉన్న ఐక్యత కారణంగా పనులు పంచుకున్నట్లు చెబుతారు. 2015-16, 2016-17 సంవత్సరాల్లో చెరువులు, కాలువల్ల్లో పూడిక తీత, చెక్‌డ్యామ్‌ల పునరుద్దరణ పనులు చేపట్టారు. అయితే 2018-19 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మట్టి పనులు బదులు కాంక్రీటు పనులు చేపట్టారు. 


జగన్‌ కక్ష సాధింపు

నీరు-చెట్టు ద్వారా చేయని పనులకు చేసినట్లు చూపించి కోట్లాది రూపాయలు నొక్కేశారంటూ జగన్‌ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. 2019 జూన్‌ 6న జరిగిన జలవనరుల శాఖ సమీక్షలో నీరు - చెట్టు బిల్లులు చెల్లించవద్దంటూ అప్పట్లో సీఎం చెప్పినట్లు వార్తలు వచ్చాయి. సీఎం సూచనల మేరకు అప్పటి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ బిల్లులు నిలిపేసినట్లు చెబుతారు. జగన్‌ సర్కారు నిర్ణయంతో పనులు చేసిన కాంట్రాక్టర్లు తీవ్ర షాక్‌కు గురయ్యారు. అప్పట్లో నీరు-చెట్టు పనులను రాజంపేట, కమలాపురం, జమ్మలమడుగు, పులివెందుల, ప్రొద్దుటూరు, రాయచోటి నియోజకవర్గంతో పాటు మరికొన్ని చోట్ల వైసీపీ నేతలు కూడా చేసినట్లు చెబుతారు. కొందరు పర్సంటేజీల ద్వారా పనులు చేపట్టగా, మరికొందరు స్థానికంగా ఉన్న పరిస్థితుల కారణంగా పనులు చేసినట్లు చెబుతారు. దాదాపు 1100 పనులు, ఇతర కాంక్రీటు పనులే చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే కేవలం టీడీపీ హయాంలో పనులు చేశారనే కారణంగానే ఆ పనులకు బిల్లులు ఇవ్వకుండా నిలిపివేసినట్లు ప్రభుత్వంపై విమర్శలున్నాయి. 


ఇలాగైతే ఎలా....

పనులు చేసేందుకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తే ఎవరైనా టెండరులో పాల్గొనవచ్చు. ఆ నిబంధనల ప్రకారం పనులు చేయాల్సి ఉంది. పనుల్లో నాణ్యత లోపించినా, పనులు చేయకుండా బిల్లులు బొక్కేసినా సంబంధిత కాంట్రాక్టు సంస్థ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడం సహజం. ఇలాంటి ప్రభుత్వ నిర్ణయాలను ఎవరుకూడా ఆక్షేపించరు. అయితే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచే జగన్‌ గ్రామస్థాయిలో ఉన్న టీడీపీ నేతల ఆర్థిక వనరులపై దెబ్బకొట్టాలనే లక్ష్యంతో నీరు- చెట్టు పనుల బిల్లులకు బ్రేక్‌ వేశారని విమర్శలున్నాయి. ఆ పనులపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. అయితే ఏళ్లు గడుస్తున్నా ఇంకా విచారణ పూర్తి కాలేదు. గ్రామంలో గొప్ప కోసం కొందరు కార్యకర్తలు ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కూడా అప్పులుచేసి వారి స్థోమత మేర పనులు చేశారు. అయితే కేవలం టీడీపీనే టార్గెట్‌తో బిల్లులు నిలిపివేశారు. బిల్లులు చెల్లించండి మహా ప్రబో అంటూ రకరకాల మార్గాల్లో నిరసన వ్యక్తం చేసినా సీఎం జగన్‌ చెవికి ఎక్కలేదు. చివరికి హైకోర్టు మెట్లు ఎక్కారు. బిల్లులు చెల్లించాలంటూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఉమ్మడి జిల్లాలో కోర్టుకు వెళ్లిన వారికి సుమారు రూ.15 కోట్ల మేర బిల్లులు చెల్లింపులు జరిగాయి. ఇంకా రూ.65 కోట్ల మేర బిల్లులు పెండింగులో ఉన్నాయి. టీడీపీ నేతలైతే బిల్లుల కోసం కోర్టుకెళ్లారు. అయితే నీరు - చెట్టు పనులు చేసిన వైసీపీ నేతలు మాత్రం సొంత ప్రభుత్వంపై కోర్టుకెళ్లలేక, బిల్లులు రాక సతమతమవుతున్నారు. 


పులివెందులలో ఒకే....

టీడీపీ హయాంలో పులివెందులలో కూడా నీరు - చెట్టు ద్వారా పనులు చేశారు. ఇందులో వైసీపీ నేతలున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే అక్కడ కూడా బిల్లులు పెండింగులో ఉండగా కొందరికి క్లియర్‌ అయినట్లు చెబుతారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా కొందరు నేతలు టీడీపీ తరపున నామినేషన్లు వేశారు. ఆ ఎన్నికలంతా దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాల మధ్య జరిగాయి. సీఎం సొంత నియోజకవర్గంలో టీడీపీ పోటీలో ఉందంటే సీఎంకు మైనస్‌ అని భావించిన కొందరు వైసీపీ నేతలు నేరుగా టీడీపీ నుంచి నామినేషన్లు వేసిన వారితో చర్చలు జరిపారు. నామినేషన్‌ విత్‌డ్రా చేసుకుంటే నీరు-చెట్టు, ఇతర బిల్లులు క్లియర్‌ చేస్తామనే హామీ ఇవ్వడంతో ఆ నియోజకవర్గంలో కొందరు విత్‌డార చేసుకుని వైసీపీ ఏకగ్రీవానికి సహకరించండంతో బిల్లులు వచ్చినట్లు చెబుతారు.


వైసీపీ నేతల్లో అయోమయం

అక్క కూతురిని పెళ్లి చేసుకుంటే నీ..యమ్మ అని తిట్టలేం.. ఎందుకంటే అక్క కాబట్టి.. అలా తయారైంది మా  పరిస్థితి అంటూ నీరు - చె ట్టు పనులు చేసిన కొందరు వైసీపీ నేతలు అక్కసు వెల్లగక్కుతున్నారు. 2011లో జగన్‌ వైసీపీ స్థాపించారు. పుట్టిన రోజులు, పార్టీ వేడుకలతో పాటు నాయకుల పర్యటన... ఇలా ఒకటేంటి చాలామటుకు పార్టీ కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టారు. కొందరు లెక్క లేకపోయినా కూడా అప్పులు తెచ్చారు. అయితే 2014లో జగన్‌ సీఎం కాలేదు.. తొలి రెండేళ్లు ఎదురు చూశారు. పార్టీ కార్యకర్తలను కాపాడాలంటే నాయకునికి ఇన్‌కమ్‌ సోర్స్‌ అవసరం. అది ప్రతిపక్షంలో ఉండగా ఆదాయం గురించి ఆలోచించడం బాగుండదన్న ఉద్దేశ్యంతో కొందరు వైసీపీ నేతలు నీరు - చెట్టు పనులు పర్సంటేజీలకు తీసుకోగా, మరికొందరు గ్రామాభివృద్ధి కోసం ఉన్న ఐక్యత కారణంగా 65-35 మధ్య పనులు చేసుకున్నట్లు చెబుతారు. ఏదైనా పని పూర్తి చేస్తే ఏ ప్రభుత్వం వచ్చినా బిల్లులు చెల్లిస్తుందని అనుకున్నారు. ఇప్పటిదాకా జరిగింది అదే.. కార్యకర్తలను కాపాడేందుకు, గ్రామంలో పరువు కోసం చేతిలో డబ్బులు లేకున్నా కూడా అప్పులు చేసి పనులు చేశారు వైసీపీ నేతలు కొందరు. ఏ ప్రభుత్వం వచ్చినా బిల్లులు వస్తాయనుకున్నారు. అయితే జగన్‌ నిర్ణయంతో ఆ బిల్లులు ఆగిపోయాయి. కొందరు కాంట్రాక్టర్లు కోర్టుకెళ్లి బిల్లులు తెచ్చుకున్నారు.. అయితే సొంత ప్రభుత్వంపై కోర్టు మెట్లు ఎక్కేందుకు మనసు ఒప్పుకోక సతమతమవుతున్నారు. అటు చేసిన పనులకు బిల్లులు రాక వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నారు. మేమెంతో ప్రేమించే వ్యక్తి సీఎం కావడంతో ఆయనపై కోర్టుకెళ్లలేక, మనసు ఒప్పక అవస్థలు పడుతున్నారు. కోర్టుకెళితే ఎక్కడ సీఎంకు చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో లోలోన మదనపడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం నేను నా నవరత్నాలు, నా ఓటు బ్యాంకు అంటూ వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. మొత్తానికైతే సీఎం జగన్‌ నీరు - చెట్టు బిల్లులకు ఎప్పుడు మోక్షం కల్పిస్తారా అంటూ వైసీపీ నేతలు ఎదురు చూస్తున్నారు.

Read more